తెలంగాణ నుంచి 74 రైళ్లలో 1,01,146 మంది వలస కార్మికుల తరలింపు

20-05-2020

తెలంగాణ నుంచి 74 రైళ్లలో 1,01,146 మంది వలస కార్మికుల తరలింపు

రాష్ట్రం నుండి వలస కార్మికులను 74 ప్రత్యేక రైళ్లలో వివిధ రాష్టాలకు ఎటువంటి అవాంతరాలు లేకుండా లక్ష మందిని తరలించినందుకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శ్రీ సోమేశ్ కుమార్ అధికారులను అభినందించారు.
బుధవారం బి.ఆర్.కె.ఆర్ భవన్ లో నిర్వహించిన సమీక్షా సమావేశం లో మాట్లాడుతూ ముఖ్యమంత్రి శ్రీ కె.చంద్ర శేఖర్ రావు గారి ఆదేశాల మేరకు నోడల్ బృందం, రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లా కలెక్టర్లు , హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ పోలీస్ కమీషనర్లు, రైల్వే తదితర శాఖలు అహర్నిషలు కష్టపడి ఈ మైలు రాయిని చేరుకున్నందుకు అన్ని శాఖల అధికారులను అభినందించారు.

వలస కార్మికులను ఆప్ ద్వారా నమోదు చేసి ఎంపిక చేయబడిన వారిని బస్సులలో రైల్వే స్టేషన్ లకు తరలించి ఆహారం, నీరు అందించినట్లు ఆయన తెలియజేశారు. రైల్వే శాఖ సకాలంలో రైళ్లు ఏర్పాటు చేసి వలస కార్మికుల రవాణా కు తోడ్పడింది. అన్ని శాఖలు సమన్వయంతో పని చేసి ఈ టాస్క్ ను సాధించడం జరిగిందని అన్నారు.

వలస కార్మికుల తరలింపుకు రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ఏర్పాట్లకు వివిధ రాష్ట్రాల నుండి, ప్రయాణికుల నుండి మంచి స్పందన లభించిందని ఆయన అన్నారు. వలస కార్మికుల తరలింపుకు మొదటి రైలు మన రాష్టం నుండి బయలుదేరిందని, బీహార్ నుండి తిరిగి మన రాష్ట్రానికి వలస కార్మికులు ప్రత్యేక రైలులో రావడం జరిగిందని ఆయన పేర్కొన్నారు. రాష్ట్రంలో మిగిలిన వలస కార్మికుల రవాణాకు అన్ని ఏర్పాట్లు చేయాలని ఆయన అధికారులను ఆదేశించారు.

వలస కార్మికుల తరలింపుకు రాష్ట్ర ప్రభుత్వం రైల్వేకు 8.5 కోట్లు చెల్లించింది. వలస కార్మికులు వెళ్లవలసిన రాష్ట్రాల నుండి సమ్మతి పొందడంలో ఎక్కువ మందిని తరలించడంలో ఇబ్బందులు ఎదురయ్యాయని అన్నారు. ఈ విషయాన్ని కేంద్ర హోం శాఖ దృష్టికి తీసుకురాగా, వలస కార్మికుల తరలింపుకు ఆయా రాష్ట్రాల సమ్మతి అవసరం లేదని కేంద్ర హోం శాఖ తెలిపిందని అన్నారు.

ఇప్పటి వరకు 74 రైళ్లలో 1,01,146 ప్రయాణికులను తరలించగా వీటిలో బీహార్ (26), ఉత్తర ప్రదేశ్ (14), చత్తీస్ గడ్ (2), ఓడిశా (4), మధ్యప్రదేశ్ (7), జార్ఖండ్ (11), రాజస్థాన్ (5), ఉత్తరా ఖండ్ (1), పశ్చిమ బెంగాల్ (1), ఈశాన్య రాష్ట్రాలు(2), జమ్ము అండ్ కాశ్మీర్, పంజాబ్ (1) రైళ్లు ఉన్నాయిన్నారు.

ఈ సమావేశంలో డి.జి.పి. మహేందర్ రెడ్డి, పోలీస్ శాఖ ఆదనపు డి.జి. (L&O) జితేందర్ , పోలీస్ కమీషనర్లు అంజనీ కుమార్, మహేశ్ భగవత్ , సజ్జనార్, రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా, దక్షిణ మద్య రైల్వే జి.యం. గజానన్ మాల్యా, ఆర్ధిక శాఖ కార్యదర్శి రోనాల్డ్ రోస్, ఎస్సీ శాఖ కార్యదర్శి రాహుల్ బొజ్జా, కలెక్టర్లు మేడ్చల్ , రంగారెడ్డి జిల్లాల వాసం వెంకటేశ్వర్లు, అమోయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.