Eligibility Test for Scholarships NTR Trust

ప్రతిభ కలిగిన పదో తరగతి విద్యార్థినులకు ఇంటర్మీడియట్‌ విద్యాభ్యాసానికి ఎన్టీఆర్‌ ట్రస్ట్‌ ద్వారా వచ్చే విద్యా సంవత్సరంలో రూ.22 లక్షల ఉపకార వేతనాలను అందించనున్నట్లు ట్రస్ట్‌ మేనేజింగ్‌ ట్రస్టీ నారా భువనేశ్వరి వెల్లడించారు. ఎన్టీఆర్‌ ట్రస్ట్‌ ఆధ్వర్యంలో గర్ల్స్‌ ఎడ్యుకేషన్‌ స్కాలర్‌షిప్‌ టెస్ట్‌ (జీఈఎస్‌టీ)ను ఈ నెల 15న ఉదయం 10 నుంచి 12 గంటల వరకు హైదరాబాద్‌ గండిపేటలోని ఎన్టీఆర్‌ బాలికల జూనియర్‌ కళాశాలలో నిర్వహించనున్నట్లు తెలిపారు. బంజారాహిల్స్‌లోని ఎన్టీఆర్‌ ట్రస్ట్‌ భవన్‌లో మీడియా సమవేశంలో భువనేశ్వరి మాట్లాడుతూ ఉపకార వేతనాల అర్హత పరీక్షలో మొదటి 10 ర్యాంకులు సాధించిన విద్యార్థినులకు నెలకు రూ.5 వేల చొప్పున, 11-25 వరకు ర్యాంకులు సాధించిన విద్యార్థినులకు నెలకూ రూ.3 వేల చొప్పున ఎన్టీఆర్‌ బాలికల జూనియర్‌ కళాశాలలో ఇంటర్‌ విద్యాభ్యాసానికి అందిస్తామని వివరిచారు.

జీఈఎస్‌టీ అర్హత పరీక్షలో పాల్గొనేందుకు డబ్ల్యుడబ్ల్యూడబ్ల్యూ.ఎన్‌టీఆర్‌టీఆర్‌యూఎస్‌టీ.ఓఆర్‌జీ ద్వారా ఈ నెల 13 లోగా దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు 76600 02627 / 28 ఫోన్‌ నంబర్లలో సంప్రదించాలని ట్రస్ట్‌ వర్గాలు వెల్లడించాయి. ఈ సమావేశంలో ట్రస్ట్‌ సీఈవో రాజేందర్‌, సీవోవో వై.మోహన్‌రావు, మోడల్‌ స్కూల్‌ డైరెక్టర్‌ ప్రసాద్‌ పాల్గొన్నారు.