ఆ ముగ్గురు పెద్దలే ఈ సమస్యకు బాధ్యులు : కోదండరామ్

25-04-2019

ఆ ముగ్గురు పెద్దలే ఈ సమస్యకు బాధ్యులు : కోదండరామ్

ఇంటర్‌ ఫలితాల్లో అవకతవకలకు టీఆర్‌ఎస్‌ పార్టీలోని ముగ్గురు పెద్దలే ఈ సమస్యకు బాధ్యులని తెలంగాణ జన సమితి పార్టీ అధ్యక్షుడు ప్రొఫెసర్‌ కోదండరామ్‌ విమర్శించారు. నాంపల్లిలోని తెలంగాణ జన సమితి కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ గ్లోబరీనా సంస్థ ఈ ఏడాది ఆరంభం నుంచి అన్నీ తప్పిదాలే చేస్తోందన్నారు. ఇంటర్‌ బోర్డు నుంచి మార్కుల డేటాను స్వీకరించి అప్‌డేటా చేయలేదని ఆరోపించారు. దీనిపై ఎన్నో కాలేజీల నుంచి ఫిర్యాదులు అందాయని, అయినా ఇంటర్‌ బోర్డ్‌ అధికారులు సరిగా స్పందించలేదని  విమర్శించారు. గ్లోబరీనా సంస్థను కాపాడేందుకు ఇంటర్‌ బోర్డు సెక్రటరీ ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. గ్లోబరీనాపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేస్తూ..ఆ సంస్థను బ్లాక్‌ లిస్ట్‌లో పెట్టాలన్నారు. దీనికి నైతిక బాధ్యత వహించి విద్యాశాఖ మంత్రి తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్‌ చేశారు. ఇంత జరుగుతున్నా బాధ్యులపై ప్రభుత్వం చర్యలు తీసుకోలేదని విమర్శించారు. ఇంటర్‌ బోర్డు తీరుపై అఖిలపక్ష నేతలమంతా గవర్నర్‌ను కలుస్తామని తెలిపారు.