Jagan Seeks TDP s Support to Move No-trust Motion Against NDA Over Andhra Special Status

ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇవ్వకుండా వంచన చేస్తున్న కేంద్ర ప్రభుత్వంపై రానున్న పార్లమెంట్‌ సమావేశాల్లో అవిశ్వాస తీర్మానం ప్రవేశపెడతామని వైసీపీ అధినేత జగన్‌ ప్రకటించారు. అవిశ్వాసం ప్రవేశపెట్టడానికి టీడీపీ ముందుకు వచ్చినా మద్దతివ్వడానికి తాము సిద్ధంగా ఉన్నామన్నారు. ప్రకాశం జిల్లాలో ప్రజాసంకల్ప యాత్రలో భాగంగా జరిగిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. వచ్చే పార్లమెంట్‌ సమావేశాల్లో కేంద్రంపై అవిశ్వాస తీర్మానం పెట్టి బీజేపీ మెడలు వంచేలా చంద్రబాబుతో పవన్‌ కల్యాణ్‌ మాట్లాడాలని సూచించారు. అవిశ్వాస తీర్మానం పెట్టడానికి సరిపోయే బలం తమకు లేనందున టీడీపీ కలిసి రావాల్సిన అవసరం ఉందన్నారు. నవాంధ్రకు ప్రత్యేక హోదా డిమాండ్‌తో వచ్చే నెల 5న ఢిల్లీలో పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలతో కలిసి ధర్నా చేయనున్నట్లు తెలిపారు. ఏప్రిల్‌ 6 వరకూ జరిగే పార్లమెంట్‌ సమావేశాల్లో రాజీలేని పోరాటం చేస్తామన్నారు. చివరి వారంలో అవిశ్వాస తీర్మానం ప్రవేశ పెడతామని, అప్పటికీ కేంద్ర ప్రభుత్వం స్పందించకుంటే చివరి రోజున తమ ఎంపీలు రాజీనామాలను వారి ముఖాన కొట్టి వచ్చేస్తారని ప్రకటించారు.