గోల్డెన్ పీకాక్ అవార్డు స్వీకరణ సభలో ముఖ్యమంత్రి చంద్రబాబు

పెద్దమనసుతో రాష్ట్రాభివృద్ధికి సహకరిస్తే చాలని, తనకు పెద్ద పదవులు అక్కరలేదని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. విదేశీ పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి బుధవారం రాత్రి గ్లోబల్ అకాడమీ తొలిసారి గా పబ్లిక్ సర్వీసు విభాగానికి ప్రకటించిన ‘గ్లోబల్ లీడర్‌షిప్ ఇన్ పబ్లిక్ సర్వీస్ అండ్ ఎకనమిక్ ట్రాన్స్‌ఫార్మేషన్ అవార్డు’ను స్వీకరించారు. తమదొక చిన్న ప్రాంతీయ పార్టీ అని తాను ఆ పార్టీకి అధ్యక్షుణ్ణి అని, ఆంధ్రప్రదేశ్ కు ముఖ్యమంత్రినని చంద్రబాబు చెప్పారు. ఆంధ్రప్రదేశ్ ను ఒక ఆదర్శంగా, నమూనా రాష్ట్రంగా తీర్చిదిద్దాలన్నే తన లక్ష్యమని చంద్రబాబు అన్నారు. తమ రాష్ట్రాభివృద్ధికి ఇక్కడ హాజరైన వాణిజ్య, కార్పొరేట్ల మద్దతు కావాలని కోరారు. 

బుధవారం రాత్రి కన్నుల పండువగా జరిగిన ఈ కార్యక్రమంలో ప్రభుత్వం నుంచి ముఖ్యమంత్రి చంద్రబాబు అవార్డు అందుకుంటే, కార్పొరేట్ గవర్నెన్స్ నుంచి ఆయన సతీమణి భువనేశ్వరి తనకు ప్రకటించిన అవార్డును అందుకోవటం విశేషం. ముఖ్యమంత్రి మాట్లాడుతూ మంత్రి ప్రీతి పటేల్ ఇక్కడ ఎంతో ప్రసిద్ధి చెందిన వారని, ఆమెతో ఇవాళ ఉదయం రాష్ట్రాభివృద్ధికోసం సంభాషించినట్లు తెలిపారు.

‘నాకు ఒక అవార్డు ఇచ్చారు. నా సతీమణి మరో అవార్డు స్వీకరిస్తోంది. ఒకటి కార్పొరేట్ రంగం నుంచి, మరొకటి పబ్లిక్ సెక్టర్ నుంచి రెండు అవార్డులు తమకు లభించడం అరుదైన అవకాశమని వివరించారు.

‘మీరు వచ్చి పెట్టబడులు పెడితే మా దగ్గర అత్యంత ప్రతిభ చూపే మానవనరులున్నాయి, మీకు విద్యుత్తునిస్తాం, మీకు నీరిస్తాం, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో తమ రాష్ట్రం సెంబర్-1’ అని ముఖ్యమంత్రి చంద్రబాబు వివరించారు. గోల్డెన్ పీకాక్ అవార్డు తన బాధ్యతలను మరింత గుర్తు చేస్తోందని అన్నారు. పురస్కార గ్రహీతలందరికీ అభినందనలు చెబుతూ ముఖ్యమంత్రి తన ప్రసంగం ముగించారు. సభలో మంత్రులు యనమల రామకృష్ణుడు, నారాయణ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సలహాదారు డా పరకాల ప్రభాకర్ , ఎకనమిక్ డెవలప్ మెంట్ బోర్డు సీఈఓ జాస్తి కృష్ణ కిశోర్, అజయ్ జైన్ తదితరులు పాల్గొన్నారు.

Click here for PhotoGallery