నంద్యాల ఉప ఎన్నికల పోలింగ్‌కు సర్వం సిద్ధం

22-08-2017

నంద్యాల ఉప ఎన్నికల పోలింగ్‌కు సర్వం సిద్ధం

నంద్యాల అసెంబ్లీ ఉప ఎన్నికకు సంబంధించిన పోలింగ్‌కు సర్వం సిద్ధంచేసినట్లు రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి భన్వర్‌లాల్‌ వెల్లడించారు. నంద్యాల ఉప ఎన్నికల ప్రచారం ముగిసిన నేపథ్యంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని వెల్లడించారు. ఓటర్లను ప్రలోభ పెట్టినా, నిబంధనలు ఉల్లంఘించినా కఠిన చర్యలుంటాయని హెచ్చరించారు. మొత్తం 255 పోలింగ్‌ కేంద్రాల్లో ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటలకు పోలింగ్‌ నిర్వహించనున్నట్లు చెప్పారు. 6 కంపెనీ పారా మిలటరీ బలగాలతో భద్రతా ఏర్పాటు చేశామని, 82 ఫ్లైయింగ్‌ స్వ్కాడ్‌ లు క్షేత్రస్థాయిలో ఎన్నికలను పరిశీలిస్తాయని అన్నారు. సాయంత్రం ఆరు గంటల వరకు క్యూలో ఉన్నవారంతా ఓటేయొచ్చని తెలిపారు. ఓటర్లందరూ స్వేచ్ఛగా ఓటు హక్కును వినియోగించుకోవాలని, ఎక్కడ ఏం జరిగినా క్షణాల్లో స్పందించేలా ఏర్పాటు చేశామని వెల్లడించారు.