చంద్రబాబు వాహనాన్నే చెక్ చేస్తారా?

19-08-2017

చంద్రబాబు వాహనాన్నే చెక్ చేస్తారా?

నంద్యాలలో ముఖ్యమంత్రి ప్యాంట్రీ కారు తాళాలు పగులకొట్టి తనిఖీలు నిర్వహించడంపై ఇంటెలిజెన్స్‌ సెక్యూరిటీ వింగ్‌ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. జడ్‌ ప్లస్‌ క్యాటగిరీ భద్రతలో ఉన్న చంద్రబాబు నాయుడు కదలికలకు సంబంధించిన సమాచారం అత్యంత గోప్యంగా ఉంచుతారు. ఒక రోజుకు మించి రాష్ట్ర పర్యటన ఉంటే ఆయన కోసం ప్యాంట్రీ వాహనాన్ని ఆ ప్రదేశానికి ముందే పంపుతారు. ఇది కూడా ఇంటెలిజెన్స్‌ వింగ్‌ ఆధీనంలోనే ఉంటుంది. నంద్యాల ఉప ఎన్నికల్లో ధన ప్రవాహంపై పోటాపోటీ విమర్శలు నడుస్తున్న నేపథ్యంలో శుక్రవారం రాత్రి ప్యాంట్రీ వాహనంలో 100కోట్లను తరలిస్తున్నారంటూ ఆందోళన మొదలైంది.

వైసీపీ నేతలు అడ్డుకుని……

నంద్యాలకు 18కిలోమీటర్ల దూరంలోని గాజులపల్లి మెట్ట వద్ద వైసీపీ నేతలు ఈ వాహనాన్ని అడ్డుకున్నారు. వాహనాన్ని తనిఖీ చేయాల్సిందేనని బైఠాయించడం., చివరకు తాళాలు పగులగొట్టి వాహనాన్ని తనిఖీ చేశారు. అందులో వంట సామాగ్రి., డ్రై ఫ్రూట్స్‌., ఆహార పదార్ధాలు మాత్రమే అందుబాటులో ఉండటం గుర్తించారు. వాహనంలో వంట సామాగ్రి మాత్రమే ఉంటాయని చెప్పినా దానిపై ఆందోళన నిర్వహించడం., ప్యాంట్రీ వాహనం కదలికలు బయటకు ఎలా తెలిసాయన్నదానిపై ఇంటెలిజెన్స్ చీఫ్‌ ఏబి వెంకటేశ్వరరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై వెంటనే విచారణ జరపాలని ఆదేశించారు. ఈ ఘటనపై డీజీపీకి సైతం ఫిర్యాదు చేయనున్నారు. పోలీస్‌ అని రాసి ఉన్న వాహనాన్ని సైతం ఖచ్చితంగా అడ్డుకోవడంతో., వాహనం కదలికలు లీక్‌ అయ్యాయని అనుమానిస్తున్నారు. వాహనంపై ఫిర్యాదు చేసిన వారిని విచారించాలని భావిస్తున్నారు.