నంద్యాల లెక్కలు తారుమారవుతాయా..?

16-08-2017

నంద్యాల లెక్కలు తారుమారవుతాయా..?

నంద్యాల ఉప ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్ధుల సంఖ్య ఎక్కువ కావడంతో ప్రధాన పార్టీలకు ఓట్ల చీలిక భయం పట్టుకుంది. 2014 సార్వత్రిక ఎన్నికల్లో నియోజక వర్గంలో ఉన్న 2,42,742 ఓట్ల గాను 174309 ఓట్లు పోలయ్యాయి. వైసీపీ నుంచి పోటీ చేసిన భూమా నాగిరెడ్డికి 82,194 ఓట్లు, శిల్పా మోహన్‌రెడ్డికి 78,598 ఓట్లు వచ్చాయి. రాష్ట్ర విభజనతో దెబ్బతిన్న కాంగ్రెస్‌కు 2,459 ఓట్లు, ఎస్‌డీపీడీఐ అభ్యర్థికి 6,091 ఓట్లు వచ్చాయి. కాంగ్రెస్ ఎస్‌డీపీడీఐ అభ్యర్థులకు దాదాపు 8 వేల సంపాదించారు. ఇప్పుడు జరుగుతున్న ఉప ఎన్నికల్లో కాంగ్రెస్‌తో పాటు రాయలసీమ పరిరక్షణ సమితి, బీఎస్‌పీ, సవాజ్‌వాదీ పార్టీ స్వతంత్రులు బరిలో ఉన్నారు. వీరిలో ఎవరు ఏ మేరకు ఓట్లు చీల్చుతారు? చీలిక ఓట్లతో ఎవరికి నష్టం వంటి అంశాలపై ప్రధాన పార్టీలు దృష్టి పెట్టాయి. నంద్యాల పట్టణంలోనే 1,35,000 పైగా ఓటర్లు ఉన్నారు. వీరిలో ముస్లీం సామాజిక వర్గానికి చెందిన ఓట్లే 60 వేలకు పైగా ఉన్నాయి. ముస్లింల ఓట్లు సాధించడంలో టీడీపీ, వైసీపీ నాయకుల్లో ఎవరి లెక్కలు వారికున్నాయి.

ఆర్పీఎస్ వల్ల టీడీపీకి నష్టమేనా

మరోవైపు ముస్లిం సామాజిక వర్గానికి చెందిన అబ్దుల్ ఖాదర్‌ను కాంగ్రెస్ బరిలో నిలబెట్టింది. కాంగ్రెస్‌ పార్టీ ప్రత్యేక హోదా సెంటిమెంట్‌ను భుజాన వేసుకుని ప్రచారం చేస్తోంది. కాంగ్రెస్ అభ్యర్థికి 10 వేల నుంచి 15 వేల ఓట్లు దక్కితే టీడీపీ-వైసీపీల అంచనాలు తలకిందులవుతాయి. కాంగ్రెస్‌ అభ్యర్ధి గణనీయంగా ఓట్లను చీలిస్తే మైనార్టీ ఓటు బ్యాంక్‌కు గండిపడి తమకే నష్టం వాటిళ్లుతుందని వైసీపీ నేతలు ఆందోళన చెందుతున్నారు. అభివృద్ధి పనులకు, సంక్షేమ కార్యక్రమాలకు ముస్లిం సామాజిక వర్గం తమకే అండగా ఉంటుందని టీడీపీ నేతలు లెక్కలు వేసుకుంటున్నా లోలోన భయం లేకపోలేదు. మరోవైపు విభజన తర్వాత అభివృద్ధి అంతా కోస్తాంధ్రలోనే ఉందని సీమను పూర్తిగా విస్మరించారని ఆరోపిస్తూ ‘రాయలసీమ పరిరక్షణ సమితి’ తరపున బనవాసి పుల్లయ్యను బరిలోకి దింపింది. ఆర్పీఎస్ కూడా భారీగా ఓట్లను చీల్చే ప్రమాదం ఉందని అనుమానిస్తున్నారు. ఆర్పీఎస్ 5 వేల ఓట్లు చీలిస్తే దాని ప్రభావం ఎక్కువగా టీడీపీ మీదే ఉంటుంది. వైసీపీ కూడా సీమ వాదాన్ని బలపర్చడంతో ఆర్పీఎస్‌ ప్రభావం ఆ పార్టీపై కూడా ఉంటుంది. అన్నావైఎస్సార్ పార్టీ నుంచి షేక్ మహ్మద్ భాషా, బీసీ యునైటెడ్ ప్రంట్ పార్టీ నుంచి గాజుల అబ్దులు సత్తార్ అనే ఇద్దరు పోటీలో ఉన్నారు. వీరిద్దరు చీల్చే ఓట్లపై కూడా టీడీపీ-వైసీపీలో గుబులు ఉంది. 2004, 2009 ఎన్నికల్లో కాంగ్రెస్‌ నుంచి పోటీ చేసిన శిల్పా మోహన్‌ రెడ్డి వైఎస్‌., రోశయ్య క్యాబినెట్లో పనిచేశారు. 2014 ఎన్నికల్లో టీడీపీ నుంచి బరిలోకి దిగి ఓడిపోయారు.