YSRCP MLA Anam Ramanarayana Reddy Fires on AP CM Jagan

మాజీ మంత్రి, ఆంధ్ర‌ప్రదేశ్‌కు చెందిన సీనియ‌ర్ రాజ‌కీయ‌నేత ఆనం రామ‌నారాయ‌ణ‌రెడ్డి వైసీపీ ప్ర‌భుత్వంపై కారాలు మిరియాలు నూరుతున్నారు. నెల్లూరు జిల్లా రాజ‌కీయాల్లో ఉద్దండ పండితులైన ఆనం బ్ర‌ద‌ర్స్‌లో సౌమ్యుడిగా ద‌క్ష‌త క‌ల‌వాడిగా పేరున్న ఆనం గ‌త కొంత కాలంగా వైసీపీ అధినాయ‌క‌త్వంతో అంటీ ముట్ట‌న‌ట్టుగా ఉంటున్నార‌నే వార్త‌ల నేప‌ధ్యంలో తాజాగా ఆయ‌న చేసిన వ్యాఖ్య‌లు ఈ వార్త‌ల‌కు బ‌లం చేకూరుస్తున్నాయి. బుధ‌వారం ఆయ‌న మాట్లాడుతూ స్థానిక ప్ర‌భుత్వాధికారుల‌పై విరుచుకుప‌డ్డారు. త‌న నియోజ‌క‌వ‌ర్గంలో ఏ ప‌ని జ‌ర‌గ‌డం లేద‌ని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. నెల్లూరు జిల్లాలో వెంకటగిరి నియోజకవర్గం ఒకటుందని ప్ర‌భుత్వం గుర్తించాలి అంటూ విరుచుకుప‌డ్డారు. కొంత కాలంగా ఇదే ప‌రిస్థితి ఉన్న‌ప్ప‌టికీ... సంయ‌మ‌నంతో వ్య‌వ‌హ‌రించాన‌ని. మరో ఏడాది వేచి చూస్తానని, అప్ప‌టికీ పనులు జరగకపోతే ప్రభుత్వాన్ని నిలదీసేందుకు  కూడా తాను వెనుకాడనని ఘాటు హెచ్చ‌రిక‌లు చేశారు. అధికారుల‌తో పాటు కొంద‌రు మంత్రుల‌కు కూడా సిఎం అంటే లెక్క‌లేద‌న్న‌ట్టు వ్య‌వ‌హ‌రిస్తున్నార‌న్నారు. సీఎం లేఖకే దిక్కులేని పరిస్థితి ఉంద‌ని, మంత్రులు, అధికారులు సీఎం లేఖనే పట్టించుకోవడం లేదని ఆరోపించారు. అంతేకాకుండా నెల్లూరు జిల్లాలో జలదోపిడీ చేస్తున్నార‌ని దీని లెక్కలు తేల్చాలంటూ డిమాండ్ చేశారు.

ఇదిలా ఉంటే కాంగ్రెస్‌, తెలుగుదేశః పార్టీలలో ప‌నిచేసిన ఆనం రామ‌నారాయ‌ణ‌రెడ్డి త‌ర్వాత వైసీపీలో చేరారు. అయితే ప్ర‌త్య‌ర్ధి పార్టీల్లో ఉన్న‌ప్పుడు వైఎస్ జ‌గ‌న్‌ను తీవ్రంగా వ్య‌తిరేకించి తిట్టిపోసిన వాళ్ల‌లో ఆనం బ్ర‌ద‌ర్స్ ముందున్నారు. మారిన ప‌రిణామాల్లో వైసీపీలో చేరిన‌ప్ప‌టికీ ఆనం అక్క‌డ స‌ర్ధుకోలేక‌పోతున్నార‌ని స‌మాచారం. ఒ సీనియ‌ర్ నేత‌గా త‌న‌కు ఇవ్వాల్సినంత ప్రాధాన్య‌త ఇవ్వ‌డం లేద‌నే బాధ కూడా  ఉంద‌ని, ఈ ప‌రిస్థితిలో ఆనం మ‌రో ఏడాది దాకా వేచి చూస్తాన‌ని ప్ర‌క‌టించిన‌ప్ప‌టికీ... అంత కాలం అయినా ఆయ‌న ఆగ‌గ‌ల‌రా అనేది సందేహాస్ప‌దమేన‌ని ప‌రిశీల‌కులు అంటున్నారు.