కుటుంబ సభ్యుల ఆస్తులను ప్రకటించిన నారా లోకేశ్

కుటుంబ సభ్యుల ఆస్తులను ప్రకటించిన నారా లోకేశ్

20-02-2020

కుటుంబ సభ్యుల ఆస్తులను ప్రకటించిన నారా లోకేశ్

రాజకీయాలపై ఆధారపడకూడదని హెరిటేజ్‍ సంస్థను స్థాపించామని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‍ చెప్పారు. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో తమ కుటుంబ సభ్యుల ఆస్తుల వివరాలను లోకేశ్‍ వెల్లడించారు. 15 రాష్ట్రాల్లో హెరిటేజ్‍ పాల ఉత్పత్తులను విక్రయిస్తున్నామన్నారు. తమ సంస్థ ద్వారా 3 వేల మందికి ఉపాధి కల్పిస్తున్నామని, 9 రాష్ట్రాల్లో హెరిటేజ్‍కు ఆస్తులు ఉన్నాయని తెలిపారు. రాజధాని ప్రాంతంలో హెరిటేజ్‍కు ఆస్తులు లేవని సృష్టం చేశారు. హెరిటేజ్‍ కోసం రాజధాని పరిధికి 30 కి.మీ దూరంలో 2014 మార్చిలో భూములు కొన్నారని చెప్పారు.

చంద్రబాబు నాయుడు ఆస్తి రూ.9 కోట్లు, ఆప్పులు రూ.5.13 కోట్లు. ఆయన నికర ఆస్తి రూ.3.87 కోట్లు. గతేడాదితో పోలిస్తే చంద్రబాబు ఆస్తులు రూ.87 లక్షలు పెరిగాయి. భువనేశ్వరి ఆస్తులు రూ.50 కోట్లు. గతం కంటే ఆమె ఆస్తులు తగ్గాయి. బ్రహ్మణి ఆస్తి 15 కోట్ల 68 లక్షలు. దేవాన్ష్ ఆస్తి 19 కోట్ల 42 లక్షలు. నా ఆస్తులు రూ.8.14 కోట్లు. నా పేరిట ఉన్న షేర్లను బ్రహ్మణికి బహుమతిగా ఇచ్చా. గతం కంటే నా ఆస్తి రూ.2.40 కోట్లు తగ్గిందని అని లోకేశ్‍ వివరించారు. తమ కుటుంబ సభ్యులపై ఆరోపణలు చేయడం సరికాదని, ఆరోపణలు చేసేముందు వారు తమ ఆస్తులను ప్రకటించాలని లోకేశ్‍ డిమాండ్‍ చేశారు. ఆస్తులను సీబీఐ, ఈడీ ప్రకటించడం కాదని, మీరే ప్రకటించాలంటూ పరోక్షంగా సీఎం జగన్‍ను ఉద్దేశించి ఎద్దేవా చేశారు. ఆస్తులు ప్రకటించాలని తాము డిమాండ్‍ చేస్తే వారి నుంచి సమాధానం రావడం లేదన్నారు.

రాజధానిలో ఇన్‍సైడర్‍ ట్రేడింగ్‍ జరిగిందని ఆరోపణలు చేస్తున్నారని నిరూపించమంటే ముందుకు రాలేకపోతున్నారని విమర్శించారు. తాము ప్రకటించిన ఆస్తుల కంటే ఎక్కువ ఉందని నిరూపిస్తే దాన్ని గుర్తించిన వారికే ఇస్తామని  లోకేశ్‍ సవాల్‍ విసిరారు. తమ ఆస్తులపై తొమ్మిదేళ్లుగా సవాల్‍ విసురుతున్నా ఎవరూ స్వీకరించడం లేదన్నారు. 2009లో రూ.లక్షల్లో ఉన్న సీఎం జగన్‍ ఆస్తులు ఇప్పుడు రూ.42వేల కోట్లకు చేరాయని చెప్పారు. దోచుకోకపోతే అంత డబ్బు ఎలా వచ్చిందని నిలదీశారు. అందుకే ప్రతి శుక్రవారం కోర్టుకు హాజరవుతున్నారంటూ వ్యాఖ్యానించారు.