వైకాపా వల్లే ఆ ప్రాజెక్టు ఆగిపోయింది

20-09-2019

వైకాపా వల్లే ఆ ప్రాజెక్టు ఆగిపోయింది

పోలవరం ప్రాజెక్టు రాష్ట్ర ప్రజల కల అని, వైకాపా ప్రభుత్వ విధ్వంసక చర్యల వల్ల ఆ ప్రాజెక్టు ఆగిపోయిందని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఆరోపించారు. ఒకరిని దృష్టిలో పెట్టుకొని రీటెండరింగ్‌ ప్రక్రియ చేపట్టారని ఆరోపించారు. ఉండవల్లిలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో చంద్రబాబు మాట్లాడుతూ ఎవరినీ సంప్రదించకుండా ఏకపక్ష నిర్ణయంతో పోలవరం ఆపేశారని మండిపడ్డారు. దేశ చరిత్రలో ఇప్పటి వరకూ ఇలాంటి భారీ ప్రాజెక్టు నిర్మాణాల్లో రివర్స్‌ టెండరింగ్‌కు ఎవరూ పోలేదని అన్నారు. పోలవరం ప్రాజెక్టుపై వైకాపా ప్రభుత్వానిది రివర్స్‌ టెండరింగ్‌ కాదు.. రీ టెండరింగ్‌ అని ఎద్దేవా చేశారు. రాష్ట్ర భవిష్యత్‌ను దృష్టిలో పెట్టుకుంటే రీటెండరింగ్‌తో ముందుకెళ్లేవారు కాదని అభిప్రాయపడ్డారు. సీఎం జగన్‌ బంధువు పీటర్‌ ఇచ్చిన నివేదిక ఆధారంగా నిర్ణయాలు తీసుకుంటున్నారని ఆరోపించారు. ఏకపక్ష నిర్ణయాలతో ముందుకెళ్లడం మంచి పద్ధతి కాదని హితవు పలికారు.

ప్రాజెక్టు నిర్మాణం ఆలస్యమైతే వ్యయం కూడా పెరుగుతుందని అన్నారు. ప్రాజెక్టు భద్రత, నాణ్యత ప్రమాణాలతో ఆడుకుంటున్నారని మండిపడ్డారు. కేంద్రం, నిపుణులు చెప్పినా ఈ ప్రభుత్వం వినకుండా ముందుకెళ్తోందని తెలిపారు. టెక్నికల్‌ బిడ్‌ మానుకొని ప్రైస్‌ బిడ్‌కు వచ్చారని, అదేనా రీటెండరింగ్‌ అని ప్రశ్నించారు. కాంఫ్లికేటెడ్‌ ప్రాజెక్టుపై ఇష్టమెచ్చినట్టు ప్రవర్తించడం మంచిది కాదని అన్నారు.