24న తెలుగు రాష్ట్రాల సీఎంల భేటీ!

20-09-2019

24న తెలుగు రాష్ట్రాల సీఎంల భేటీ!

తెలుగు రాష్ట్రాల మధ్య విభజన సమస్యలన్నింటిని పరిష్కరించుకునే దిశగా ఈ నెల 24న మరోసారి ముఖ్యమంత్రుల స్థాయి సమావేశం జరగనుంది. తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు, ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డిలు ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది. హైదరాబాద్‌లోనే ఈ సమావేశం జరగవచ్చని సమాచారం. ఇద్దరు ముఖ్యమంత్రుల మధ్య ఇప్పటికే మూడు దఫాలు సమావేశాలు జరిగాయి. పలు అంశాలపై అంగీకారం కుదిరింది. తర్వాత మరికొన్ని సార్లు భేటీ జరగాల్సి ఉన్నా అక్కడా, ఇక్కడా శాసనసభా సమావేశాలు, ఇతరత్రా కారణాల వల్ల జరగలేదు. తొమ్మిది, పది షెడ్యూలు సంస్థల విభజన, గోదావరి, కృష్ణా జలాల సంపూర్ణ వినియోగం తదితర అంశాలు పెండింగులో ఉన్నాయి. గతంలోని నిర్ణయాలకు అనుగుణంగా ఉత్తర్వులు జారీ చేయాల్సి ఉంది. ఆర్థికపరమైన అంశాలపై నిర్ణయం తీసుకోవాలి. వీటిని సత్వరమే పరిష్కరించుకోవాలని భావిస్తున్న ఇద్దరు ముఖ్యమంత్రులు ఈ మేరకు ఫోన్‌లో చర్చించి తేదీని ఖరారు చేసినట్లు తెలుస్తోంది.