ఏపీ మాజీ స్పీకర్‌ కోడెల ఇకలేరు

16-09-2019

ఏపీ మాజీ స్పీకర్‌ కోడెల ఇకలేరు

తెలుగుదేశం పార్టీ సీనియర్‌ నేత, ఆంధ్రప్రదేశ్‌ మాజీ స్పీకర్‌ కోడెల శివప్రసాదరావు కన్నుమూశారు. హైదరాబాద్‌లోని తన నివాసంలో బలవన్మరణానికి పాల్పడారు. ఉదయం అల్పాహారం తీసుకున్న అనంతరం తన గదిలోకి వెళ్లి ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు కుటుంబ సభ్యులు, పోలీసులు తెలిపారు. కోడెల శివప్రసాదరావు ఆంధ్రప్రదేశ్‌ విభజన తర్వాత ఎన్నికైన తొలి శాసనసభాపతి. 1983లో వైద్య వృతి నుంచి తెలుగుదేశం పార్టీలో చేరిన ఆయన 2004 వరకు వరుసగా ఐదుసార్లు నరసరావుపేట నుంచి గెలిచారు. ఆ తర్వాత రెండుసార్లు ఓటమిపాలైనా, 2014లో ఆంధ్రప్రదేశ్‌ శాసనసభకు సత్తెనపల్లి నుంచి తెలుగుదేశం పార్టీ తరుపున విజయం సాధించారు. శాసనసభకు ఆరుసార్లు ఎన్నికైన డాక్టర్‌ కోడెల ఎన్టీఆర్‌, చంద్రబాబు మంత్రివర్గంలో పలు శాఖల్లో పనిచేశారు.

గుంటూరు జిల్లా నకరికల్లు మండలం కండ్లగుంటలో 1947 మే 2న కోడెల శివప్రసాదరావు జన్మించారు. కోడెల భార్య శశికళ గృహిణి కాగా, వీరికి ముగ్గురు పిల్లలు. విజయలక్ష్మి, శివరామకృష్ణ, సత్యనారాయణ. వీరు కూడా వైద్యులే. అమ్మాయి గైనకాలజిస్టు. పెద్ద కుమారుడు క్యాన్సర్‌ సర్జన్‌ కాగా, రెండో కుమారుడు ఎముకల స్పెషలిస్టు. అయితే, ప్రమాదవశాత్తూ రెండో కుమారుడు రోడ్డు ప్రమాదంలో మరణించారు.