మంత్రి బొత్సకు సీబీఐ కోర్టు నోటీసులు

23-08-2019

మంత్రి బొత్సకు సీబీఐ కోర్టు నోటీసులు

దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి హయాంలో జరిగిన ఫోక్స్‌ వ్యాగన్‌ కేసు వ్యవహారంలో ఆంధ్రప్రదేశ్‌ మంత్రి బొత్స సత్యనారాయణకు సమన్లు జారీ అయ్యాయి. హైదరాబాద్‌లోని నాంపల్లి సీబీఐ కోర్టు బొత్సకు సమన్లు జారీ చేసింది. వచ్చే నెల 12న హాజరు కావాలని బొత్సకు న్యాయస్థానం సూచించింది. వైఎస్‌ సర్కారులో పరిశ్రమల శాఖ మంత్రిగా ఉన్న బొత్స.. ఫోక్స్‌వ్యాగన్‌ కేసులో కీలక సాక్షిగా ఉన్నారు. విశాఖపట్నంలో జర్మనీకి చెందిన ఫోక్స్‌వ్యాగన్‌ సంస్థ ఏర్పాటు చేస్తామని పలువురు అప్పటి రాష్ట్ర ప్రభుత్వాన్ని మోసం చేశారనేది కేసులో ప్రధాన అభియోగం.

నాంపల్లి సీబీఐ కోర్టులో 2010లో సీబీఐ దాఖలు చేసిన ఛార్జ్‌షీట్‌ ఆధారంగా కేసు విచారణ జరుగుతోంది. ఈ నేపథ్యంలో బొత్స సత్యనారాయణ వాంగ్మూలం నమోదుకోసం సెప్టెంబరు 12న హాజరు కావాలని న్యాయస్థానం సమన్లు జారీ చేసింది.