World Bank pulling out of Amaravati capital project

ఆంధ్రప్రదేశ్‌ రాజధాని అమరావతి నిర్మాణానికి రుణం ఇవ్వబోమని ప్రపంచబ్యాంకు సృష్టం చేసింది. సుమారు రూ.7,200 కోట్ల రుణం ప్రతిపాదనను తాజాగా జరిగిన బోర్డు సమావేశంలో ప్రపంచబ్యాంకు ఉపసంహరించుకుంది. అమరావతి సస్టెయినబుల్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ అండ్‌ ఇన్‌స్టిట్యూషనల్‌ డెవలప్‌మెంట్‌ ప్రాజెక్ట్‌ ని బ్యాంక్‌ వెబ్‌సైట్‌లో డ్రాప్డ్‌ ప్రాజెక్టుల జాబితాలో చేర్చింది. అమరావతి నిర్మాణానికి ప్రపంచ బ్యాంకు నుంచి రుణం వస్తుందని సీఆర్‌డీఏ పెట్టుకున్న ఆశలన్నీ ఆవిరయ్యాయి. రాజధానికి రుణం ఇవ్వాలంటే పూర్తిస్థాయిలో తనిఖీ నిర్వహించాల్సిందేనని ప్రపంచబ్యాంకు ఇన్‌స్పెక్షన్‌ ప్యానెల్‌ ఇటీవల సృష్టం చేసింది. దానికి ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం సానుకూలంగా స్పందించని నేపథ్యంలో రుణం ప్రతిపాదనను విరమించుకుంటూ బ్యాంకు నిర్ణయం తీసుకుంది.

రాష్ట్ర ప్రభుత్వం ఇన్‌స్పెక్షన్‌ ప్యానల్‌ తనిఖీకి సుముఖత వ్యక్తం చేయకపోవడం వెనుక కేంద్ర ప్రభుత్వ ప్రమేయం కూడా ఉంది. రాజధాని రుణం కావాలంటే వేరే మార్గంలో చూద్దామని, ప్రపంచబ్యాంకు తనిఖీకి అంగీకరిస్తే, ఆ ప్రభావం బ్యాంకు ఆర్థిక సాయంతో దేశంలో చేపడుతున్న ఇతర ప్రాజెక్టులపైనా పడుతుందని రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్రం సూచించినట్టు సమాచారం.