జియోలో మరో అమెరికన్ కంపెనీ పెట్టుబడులు

22-05-2020

జియోలో మరో అమెరికన్ కంపెనీ పెట్టుబడులు

అమెరికాకు చెందిన ప్రముఖ ఈక్విటీ దిగ్గజం కేకేఆర్‍ రిలయన్స్ ఇండస్ట్రీస్‍ లిమిటెడ్‍ (ఆర్‍ఐఎల్‍) అనుబంధ సంస్థ జియో ప్లాట్‍ఫామ్స్లో పెట్టుబడి పెట్టనున్నట్టు ఆర్‍ఐఎల్‍ ప్రకటించింది. తమ మధ్య రూ.11,367 కోట్ల మేరకు ఒప్పందం కుదిరినట్లు వెల్లడించింది. ఈ మేరకు జియో ప్లాట్‍ఫామ్స్లో 2.32 శాతం వాటాను కేకేఆర్‍కు బదలాయించనున్నట్టు తెలిపింది. ఆసియాలో కేకేఆర్‍కు ఇదే అతిపెద్ద పెట్టుబడి. తాజా పెట్టుబడితో జియో ప్లాట్‍ఫామ్స్ ఈక్విటీ విలువ రూ.4.91 లక్షల కోట్లకు చేరింది. కేకేఆర్‍ను 1976లో స్థాపించారు. అంతర్జాతీయ స్థాయి ఎంటర్‍ప్రైజ్‍లను నెలకొల్పడం, సాంకేతిక రంగంలోని కంపెనీల్లో పెట్టుబడులు పెట్టడంలో కేకేఆర్‍కు మంచి అనుభవం ఉంది. ఇప్పటికే బీఎంసీ, సాఫ్ట్వేర్‍, బైట్‍డ్యాన్స్, గోజెక్‍ వంటి ప్రముఖ కంపెనీల్లో పెట్టుబడులు పెట్టిన చరిత్ర ఉంది. ఇప్పటి వరకు ఈ సంస్థ 20 వివిధ కంపెనీల్లో 30 బిలియన్‍ డాలర్లు పెట్టుబడులు పెట్టినట్లు సమాచారం. భారత్‍లోనూ 2006 నుంచి తన పెట్టుబడుల ప్రస్థానాన్ని కొనసాగిస్తోంది.