తెలుగు రాష్ట్రాల నుంచి 120 మంది అమెరికాకు..

22-05-2020

తెలుగు రాష్ట్రాల నుంచి 120 మంది అమెరికాకు..

తెలుగు రాష్ట్రాలకు చెందిన 120 మంది అమెరికాకు పయనమయ్యారు. గురువారం ఎయిర్‍ ఇండియా విమానంలో హైదరాబాద్‍ నుంచి ఢిల్లీ మీదుగా శాన్‍ఫ్రాన్సిస్కోకు బయలుదేరారు. వందే భారత్‍ మిషన్‍లో భాగంగా విదేశాల్లో చిక్కుకుపోయిన భారతీయులను కేంద్ర ప్రభుత్వం వెనక్కి తీసుకొస్తోంది. అదే సమయంలో అత్యవసర పనుల మీద బారత్‍కు వచ్చి.. లాక్‍డౌన్‍ కారణంగా ఇక్కడే ఉండిపోయిన వారిని ఆయా దేశాలకు తరలిస్తోంది. ఈ క్రమంలో బెంగళూరు నుంచి శంషాబాద్‍ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్న కనెక్ట్డ్‍ ఫ్లైట్‍.. అమెరికాకు వెళ్లాల్సిన ప్రయాణికులతో ఢిల్లీకి చేరుకుంది. అక్కడి నుంచి శుక్రవారం తెల్లవారుజామున శాన్‍ఫ్రాన్సిస్కోకు బయలుదేరనుంది. ప్రయాణికులతో కిక్కిరిసిపోయిన ఆ విమానంలో భౌతిక దూరంతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరికీ ఫేస్‍ మాస్క్, గ్లోప్స్, శానిటైజర్‍ను అందజేసినట్లు అమెరికాకు బయలుదేరిన ప్రయాణికుడు ఒకరు తెలిపారు. ఈ నెల 23న ఢిల్లీ నుంచి న్యూయార్క్కు మరో విమానం వెళ్లనుంది.