NMMS పరీక్ష కోసం NATS సహాయం
విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించాలనే సత్సంకల్పం తో ఉత్తర అమెరికా తెలుగు సంఘం (నాట్స్) మరో ముందడుగు. ఉమ్మడి గుంటూరు మరియు కృష్ణా జిల్లాల ప్రభుత్వ పాఠశాలల్లో 8వ తరగతి విద్యార్థుల కోసం NMMS (National Means & Merit Scholarship) పరీక్షకు అవసరమైన స్టడీ మెటీరియల్ను నాట్స్ అందించింది. ఈ పరీక్షలో విజయం సాధించిన విద్యార్థులకు కేంద్ర ప్రభుత్వం నుండి ప్రతి సంవత్సరం ₹12,000 చొప్పున నాలుగేళ్ల పాటు మొత్తం ₹48,000 స్కాలర్షిప్ లభిస్తుంది. ఈ సహాయం పేద కుటుంబాలకు చెందిన విద్యార్థులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది.
ఈ కార్యక్రమం ద్వారా రెండు జిల్లాల్లోని పలు ప్రభుత్వ పాఠశాలలలో మొత్తం సుమారు 26 వేల మంది విద్యార్థులు లబ్ధిపొందారు.
నారాకోడూరులో జరిగిన కార్యక్రమంలో నాట్స్ చైర్మన్ ప్రశాంత్ పిన్నమనేని, నాట్స్ ప్రెసిడెంట్ శ్రీహరి మందాడి, నేషనల్ కోఆర్డినేటర్ (ప్రోగ్రామ్స్) కిరణ్ మందాడి, వెంకట్ కోడూరు, చైతన్య మాదాల తదితరులు పాల్గొన్నారు. విద్యార్థులు పరీక్షకు సమగ్రమైన సిద్ధత సాధించేందుకు అవసరమైన పుస్తకాల ముద్రణ మరియు పంపిణీకి నాట్స్ సహకారం అందించింది.
అదేవిధంగా, నారాకోడూరు హైస్కూల్లో విద్యార్థులకు తాగునీటి సౌకర్యం కోసం వాటర్ ట్యాంక్ ఏర్పాటు చేయడానికి నాట్స్ ఉదారంగా ముందుకొచ్చింది.
ఈ సందర్భంలో నారాకోడూరు హైస్కూల్లో నాట్స్ నాయకత్వంతో STEM విభాగాన్ని ప్రారంభించడం జరిగింది.
ఈ కార్యక్రమంలో మాట్లాడుతూ, విద్యార్థులకు ఉపయోగపడే కార్యక్రమాలకు నాట్స్ ఎప్పుడూ ముందుండి సహకారం అందిస్తుందని, విద్యార్థుల అభివృద్ధికి ప్రోత్సాహక కార్యక్రమాలు కొనసాగుతాయని నాట్స్ చైర్మన్ ప్రశాంత్ పిన్నమనేని, నాట్స్ అధ్యక్షుడు శ్రీహరి మందాడి తెలిపారు.
ఇకపోతే, ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులను ప్రోత్సహించడం కోసం NMMS స్టడీ మెటీరియల్ను మాజీ ఎంఎల్సీ లక్ష్మణరావు ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా 26,500 మంది విద్యార్థులకు పంపిణీ చేయడం జరిగినట్లు తెలిపారు.
-Govindarajan






