US: అమెరికాలో మరోసారి భారతీయుల విజయం
అమెరికా ఎన్నికల చరిత్రలో మరోసారి భారతీయులు విజయం సాధించి తమ సత్తాను చాటారు. డెమోక్రటిక్ పార్టీ తరపున పోటీచేసిన పలువురు భారతీయులు ఈ ఎన్నికల్లో విజయం సాధించి అధ్యక్షుడు ట్రంప్ కు వ్యతిరేకంగా ప్రచారం చేసి విజయాన్ని సాధించారు. న్యూయార్క్ నగరంతోపాటు పలుచోట్ల భారత సంతతి నేతలు ఘన విజయం సాధించి చరిత్ర సృష్టించారు. భారత సంతతి యువకుడు జోహ్రాన్ మమ్దానీ అధ్యక్షుడు ట్రంప్‌ను సవాలుచేసి మరీ విజయాన్ని సాధించి న్యూయార్క్ మేయర్‌గా ఎన్నికవడం అందరినీ ఆశ్చర్యపరిచింది. ఆయనతోపాటు వర్జీనియా లెఫ్టినెంట్ గవర్నర్‌గా.. భారత్‌లో జన్మించి అమెరికాలో స్థిరపడ్డ గజాలా హష్మీ విజయం సాధించారు. సిన్సినాటి మేయర్‌గా భారత సంతతికి చెందిన ఆఫ్తాబ్ పురేవాల్ రెండోసారి ఎన్నికయ్యారు. న్యూజెర్సిలోని ఎడిసన్ నగర మేయర్‌గా శామ్ జోషి ఎన్నికై తన సత్తాను చాటుకున్నారు. పలు నగరాల్లో జరిగిన ఈ ఎన్నికల్లో డెమోక్రాట్లు విజయం సాధించి సత్తా చాటారు. ఇది ట్రంప్‌నకు పెద్ద దెబ్బగా భావిస్తున్నారు. ఈ ఎన్నికల్లో విజయం సాధించడం ద్వారా మరోసారి అగ్రరాజ్యంలో భారతీయుల సత్తా ఏమిటో నిరూపితమైంది.
వర్జీనియా లెఫ్టినెంట్ గవర్నర్‌గా గజాలా హష్మీ
అమెరికా ఎన్నికల్లో భారతీయ మూలాలున్న వ్యక్తులు విజయ దుంధుభి మోగించారు. న్యూయార్క్ లో మమ్దానీ గెలిచిన వెంటనే వర్జీనియా లెఫ్టినెంట్ గవర్నర్ గానూ మరో భారత సంతతి వ్యక్తి విజయం సాధించారు. ఆమె హైదరాబాద్‌లో జన్మించిన గజాలా హష్మీ. రిపబ్లికన్ అభ్యర్థి జాన్ రీడ్ పై ఘన విజయం సాధించారు గజాలా. వర్జీనియా సెనేట్‌లో పని చేసిన తొలి ముస్లిం, తొలి దక్షిణాసియా అమెరికన్‌గా ఇప్పటికే రికార్డు సృష్టించిన గజాలా.. ఇప్పుడు రాష్ట్రంలో కీలక పదవిని దక్కించుకోవడం డెమోక్రాట్లకు, భారతీయ-అమెరికన్లకు గర్వకారణంగా నిలుస్తోంది.
గజాలా హాష్మీకి హైదరాబాద్‌తో బలమైన అనుబంధం ఉంది. ఆమె 1964లో హైదరాబాద్‌లో జియా హాష్మీ, తన్వీర్ హాష్మీ దంపతులకు జన్మించారు. తన బాల్యాన్ని మలక్‌పేటలోని అమ్మమ్మ ఇంట్లో గడిపిన గజాలా.. నాలుగేళ్ల వయసులో తన తల్లి, సోదరుడితో కలిసి అమెరికాలోని జార్జియాకు వలస వెళ్లారు. ఆమె తండ్రి అంతర్జాతీయ వ్యవహారాల్లో పీహెచ్డీ పూర్తి చేసి.. ఓ యూనివర్శిటీలో ప్రొఫెసర్‌గా పని చేసేవారు. గజాలా జార్జియా సదరన్ విశ్వవిద్యాలయం నుంచి బీఏ ఆనర్స్ పూర్తి చేశారు. అట్లాంటాలోని ఎమరీ విశ్వవిద్యాలయం నుంచి సాహిత్యంలో పీహెచ్డీ పట్టా పొందారు.ఆ తర్వాత పెళ్లి చేసుకున్న గజాలా హష్మి.. 1991లో రిచ్మండ్ ప్రాంతానికి మారారు. అక్కడే రేనాల్డ్స్ కమ్యూనిటీ కళాశాలలో సుమారు 30 ఏళ్ల పాటు ప్రొఫెసర్‌గా పని చేసి.. వేలాది మంది విద్యార్థులకు మార్గదర్శకత్వం వహించారు. విద్యారంగంలో ఆమె చేసిన సేవలు ఆమె రాజకీయ ప్రవేశానికి పటిష్టమైన పునాదిగా నిలిచాయి. ప్రొఫెసర్‌గా సుదీర్ఘ అనుభవం తర్వాత.. గజాలా 2019లో తొలిసారిగా అమెరికా ఎన్నికల్లో గెలుపొందారు. ఆ తర్వాత 2024లో ఆమె సెనేట్ విద్య, వైద్య కమిటీ చైర్‌పర్సన్‌గా డెమోక్రాటిక్ పార్టీ తరఫున ఎన్నిక అయ్యారు. ఇప్పుడు లెఫ్టినెంట్ గవర్నర్ పదవిని చేపట్టడం ఆమె రాజకీయ జీవితంలో అత్యున్నత ఘట్టం కాగా.. అంతా ఆమెకు అభినందనలు తెలియజేస్తున్నారు. ఓ హైదరాబాదీ మహిళ అమెరికాలో అంత అత్యున్నత పదవిని సాధించడం తమకు ఎంతో సంతోషంగా ఉందని.. భారత సంతతి అమెరికన్లు చెబుతున్నారు.
సిన్సినాటి మేయర్‌గా ఆఫ్తాబ్ పురేవాల్
ఒహాయోలోని సిన్సినాటిలో అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ సవతి సోదరుడైన రిపబ్లికన్ అభ్యర్థి కోరీ బౌమ్యాన్ను భారత సంతతికి చెందిన ఆఫ్తాబ్ పురేవాల్ ఓడిరచారు. ఆయన ఈ నగర మేయర్‌గా ఎన్నిక కావడం ఇది రెండోసారి. అమెరికా అటార్నీ ప్రత్యేక సహాయకుడిగా పని చేసిన 43 ఏళ్ల పురేవాల్ 2021లో మొదటిసారి మేయర్‌గా గెలిచారు. పురేవాల్ తల్లి టిబెట్‌కు చెందినవారు. తండ్రి పంజాబీ. న్యూయార్క్: ఓహియోలోని సిన్సినాటీ సిటీ మేయర్ గా భారత సంతతి వ్యక్తి అఫ్తాబ్ ఫురేవాల్ రెండోసారి ఎన్నికయ్యారు. మేయర్ ఎన్నికలో ఆయన డెమోక్రటిక్ అభ్యర్థిగా బరిలోకి దిగారు. అమెరికా వైస్ ప్రెసిడెంట్ జేడీ వాన్స్ సోదరుడు, రిపబ్లికన్ అభ్యర్థి కోరీ బౌమన్ ను ఓడిరచారు. సిన్సినాటీలో స్థానికంగా డెమోక్రట్లకు గట్టి పట్టుంది. ఫురేవాల్ విజయం స్థానిక ప్రభుత్వంపై డెమోక్రాట్ల నియంత్రణను మరింత పెంచనుంది. మేయర్ పదవికి ఓపెన్ ప్రైమరీ ఎన్నికలు మేలో జరగగా.. ఫురేవాల్ దాదాపుగా 80శాతం ఓట్లతో కోరీ బౌమన్ ను ఓడిరచారు. ప్రైమరీలో ఈ ఇద్దరూ అత్యధిక ఓట్లు సాధించడంతో తాజాగా మేయర్ పీఠానికి పోటీపడ్డారు. 43 ఏండ్ల ఫురేవాల్ మాజీ స్పెషల్ అసిస్టెంట్ యూఎస్ అటార్నీగా పని చేశారు. 2021లో మొదటిసారి 66శాతం ఓట్లను సాధించి మేయర్ పీఠాన్ని కైవసం చేసుకున్నారు.
ఎడిసన్ మేయర్‌గా మరోసారి శామ్ జోషి ఎన్నిక
ఎడిసన్ నగర మేయర్ ఎన్నికల్లో శామ్ జోషీ మరోసారి ఎన్నికయ్యారు. న్యూజెర్సీ లో నివసించే ఎన్నారై తెలుగు కమ్యూనిటీ ఆయనకు ఎన్నికల్లో మద్దతును ప్రకటించిన సంగతి తెలిసిందే. శామ్ జోషీ తెలుగు కమ్యూనిటీ నాయకులకు మరియు తెలుగు సంఘాల కార్యవర్గ సభ్యులందరికీ ఆప్తుడు, తెలుగువారు నిర్వహించే చాలా కార్యకలాపాలకు ఆయన మద్దతు ఇవ్వడమేకాకుండా ఎల్లప్పుడూ అందరికీ అందుబాటులో ఉంటాడు. ఇప్పుడు శామ్ జోషీ మళ్లీ మేయర్ ఎన్నికల్లో డెమోక్రటిక్ పార్టీ తరపున పోటీ చేసి గెలవడం పట్ల పలువురు తెలుగువాళ్ళు సంతోషం వ్యక్తం చేశారు.
న్యూయార్క్ మేయర్‌గా జోహ్రాన్ మమ్దానీ
అమెరికాలోని న్యూయార్క్ నగర మేయర్‌గా భారత సంతతి అమెరికన్ జోహ్రాన్ మమ్దానీ ఘన విజయం సాధించారు. డెమొక్రాట్ పార్టీ అభ్యర్థి అయిన మమ్దానీని ఓడిరచేందుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్రంగా ప్రయత్నించినా ఫలితం లేకపోవడం గమనార్హం. 34 ఏళ్ల మమ్దానీ న్యూయార్క్ నగర మేయర్ అయిన అతిపిన్న వయస్కుడిగా, తొలి భారతీయ అమెరికన్ ముస్లింగా, తొలి దక్షిణాసియా సంతతి వ్యక్తిగా రికార్డులు సృష్టించారు. జనవరి 1న మేయర్ గా బాధ్యతలు చేపట్టనున్నారు. ఎన్నో విమర్శలు.. మరెన్నో అవమానాలు..కమ్యూనిస్టు ముద్ర ఉండనే ఉంది. యూదు వ్యతిరేకంటూ ట్రంప్ వర్గం ఆది నుంచి విమర్శలు గుప్పిస్తోంది. మరి ఇన్నింటినీ తట్టుకుని న్యూయార్క్ నగర మేయర్‌గా భారత సంతతికి చెందిన జోహ్రాన్ మమ్దానీ ఎన్నికై చరిత్ర సృష్టించారు. నగర అధికారిక నివాసం ‘గ్రేసీ మాన్షన్’లోకి అడుగుపెట్టనున్న ఆయన, అతి పిన్న వయస్కుడైన మేయర్‌గానూ రికార్డు నెలకొల్పారు. ఈ చారిత్రక విజయం తర్వాత ఆయన సతీమణి రామా సవాఫ్ దువాజీ పేరు కూడా ప్రముఖంగా వినిపిస్తోంది. ఎన్నికల ప్రచారంలో ఆమె పెద్దగా కనిపించకపోయినా, తెరవెనుక ఆమె పోషించిన పాత్ర కీలకమనితెలుస్తోంది.
సిరియన్-అమెరికన్ సంతతికి చెందిన రామా దువాజీ వృత్తిరీత్యా చిత్రకారిణి, యాని మేటర్. 1997లో టెక్సాస్‌లో జన్మించిన ఆమె, తొమ్మిదేళ్ల వయసులో తన కుటుంబంతో కలిసి దుబాయ్‌కు వెళ్లారు. విభిన్న సంస్కృతులు కలిగిన దుబాయ్‌లో పెరిగిన ఆమె, ఉన్నత విద్య కోసం న్యూయార్క్ వచ్చి స్కూల్ ఆఫ్ విజువల్ ఆర్ట్స్‌లో మాస్టర్స్ డిగ్రీ పూర్తి చేశారు. తన చిత్రాల ద్వారా మహిళా సాధికారత, పాలస్తీనియన్ల సమస్యలను రామా బలంగా వినిపిస్తుంటారు. ప్రముఖ పత్రికల్లో ఆమె చిత్రాలు ప్రచురితమయ్యాయి. ఈ క్రమంలో 2021లో ఓ డేటింగ్ యాప్ ద్వారా జోహ్రాన్ మమ్దానీతో ఆమెకు పరిచయం ఏర్పడిరది. ఆ పరిచయం ప్రేమగా మారి, గతేడాది డిసెంబర్లో దుబాయ్‌లో వీరి వివాహం జరిగింది. అనంతరం ఈ ఏడాది ఫిబ్రవరిలో న్యూయార్క్‌లో రిజిస్టర్ మ్యారేజ్ చేసుకొని, జులైలో ఉగాండాలో ప్రత్యేక వేడుకను నిర్వహించారు. తన గెలుపులో తల్లిదండ్రులతో పాటు భార్య పాత్ర ఎంతో ఉందని స్పష్టం చేశారు మమ్దానీ. ‘‘ప్రతి పురుషుడి విజయం వెనుక ఒక మహిళ ఉంటుందంటారు. నా విషయంలో ఈ క్షణం, ప్రతిక్షణం నాకు తోడుగా నిలిచే వ్యక్తి నా భార్యే’’ అంటూ ఆయన తన సతీమణికి కృతజ్ఞతలు తెలిపారు. విభిన్న సంస్కృతుల నేపథ్యం కలిగిన రామా దువాజీ ఇప్పుడు న్యూయార్క్ నగర ప్రథమ మహిళగా తనదైన ముద్ర వేసేందుకు సిద్ధమవుతున్నారు.






