జగన్ తప్పు మీద తప్పు చేస్తున్నారా..?
ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు గతంలో చాలా హుందాగా ఉండేవి. అధికార, ప్రతిపక్షాల మధ్య సిద్ధాంతపరమైన వైరుద్ధ్యాలు ఉండేవి కానీ వైరం ఉండేది కాదు. నేతలను ఒకరికొకరు గౌరవించుకునేవారు. కానీ ఇప్పుడు అలాంటి పరిస్థితులు పొరపాటున కూడా లేవు. బద్ధశత్రువుల్లాగా మారిపోయారు అధికార, ప్రతిపక్షాల నేతలు. ఒకరికొకరు ఎత్తుకు పైఎత్తులు వేస్తూ రాజకీయాలను రోజురోజుకూ మరింత దిగజార్చేస్తున్నారు. గత పదేళ్లుగా ఈ సంస్కృతి ఏపీలో ఎక్కువగా కనిపిస్తోంది. ఇప్పుడు కూడా అది కంటిన్యూ అవుతోంది.
2014లో టీడీపీ, 2019లో వైసీపీ అధికారంలో ఉన్నాయి. జగన్ అధికారంలో ఉన్నప్పుడు టీడీపీ నేతలపై ఎన్నో కేసులు నమోదయ్యాయి. టీడీపీ ఆఫీసు, చంద్రబాబు ఇంటిపై వైసీపీ నేతలు దాడి చేశారు. ఇవన్నీ కెమెరాల్లో కూడా నమోదయ్యాయి. అయితే వీటిపై అప్పటి ప్రభుత్వం చర్యలు తీసుకోలేదు. పైగా టీడీపీ ఆఫీసుపై దాడికి వెళ్లినప్పుడు వైసీపీ నేతలు, కార్యకర్తలపై టీడీపీ వాళ్లు దాడి చేశారంటూ రివర్స్ కేసులు పెట్టారు. ఇది సహజంగానే టీడీపీ నేతలకు ఆగ్రహం తెప్పిస్తుంది. అప్పుడు ఎంత అరిచి గీపెట్టినా ఉపయోగం లేకుండా పోయింది. ఇప్పుడు టీడీపీ అధికారంలోకి రావడంతో ఆ కేసులను తిరగదోడి చర్యలు తీసుకోవడం మొదలుపెట్టింది.
టీడీపీ ఆఫీసుపై దాడి కేసులో మాజీ ఎంపీ నందిగం సురేశ్ ను అరెస్టు చేసింది చంద్రబాబు ప్రభుత్వం. ఆయనకు కోర్టు రిమాండ్ విధించడంతో జైలుకు తరలించారు. ఆయన్ను జైల్లో పరామర్శించారు వైసీపీ అధినేత జగన్. ఈ సందర్భంగా ఆయన మాట్లాడిన మాటలు ఆశ్చర్యం కలిగిస్తున్నాయి. నాడు తనపై టీడీపీ నేతలు వ్యక్తిగత విమర్శలు చేసినందువల్లే వైసీపీ వాళ్లు దాడికి వెళ్లారని చెప్పుకొచ్చారు. అంతటితో ఆగకుండా ఇవన్నీ కక్షపూరిత చర్యలని.. ఈ ఐదేళ్ల తర్వాత తాము అధికారంలోకి వస్తామని చెప్పారు. అప్పుడు కూటమి నేతలందరినీ తెచ్చి ఇదే జైలులో వేస్తానని హెచ్చరించారు. ఒక తప్పుడు సంప్రదాయానికి నాంది పలికారని.. అది సునామీలా మారుతుందన్నారు.
ఓ వైపు వరదలతో జగన్ అల్లాడుతున్నారు. వాళ్లను పట్టించుకోకుండా కేసులో అరెస్టయి జైల్లో ఉన్న పార్టీ నేతను పరామర్శించడానికి జగన్ వెళ్లారు. దీనిపైనే అనేక విమర్శలు వ్యక్తమవుతున్నాయి. పైగా వచ్చే ఐదేళ్లూ తనవేనని.. అప్పుడు అందర్నీ ఇదే జైల్లో వేస్తానని హెచ్చరించడంపై సెటైర్లు జోరుగా వినిపిస్తున్నాయి. కక్షపూరిత రాజకీయాలకు తెరలేపిందే నువ్వు.. అంటూ సోషల్ మీడియాలో కామెంట్స్ వస్తున్నాయి. 11 సీట్లకు పరిమితమైనా ఇంకా అహంకారం తగ్గలేదని.. ఇలాంటి మాటలు మాట్లాడితే ఈసారి ఆ సీట్లు కూడా రావని జోకులు వేస్తున్నారు నెటిజన్లు.