ఏపీలో ముందస్తు ఎన్నికలు లేనట్టే..! జగన్‌కు ఫుల్ క్లారిటీ..!!

ఆంధ్రప్రదేశ్ లో ముందస్తు ఎన్నికలు రాబోతున్నాయని, జగన్ ఆ మేరకు సిద్ధమవుతున్నారనే ప్రచారం కొంతకాలంగా బాగా వినిపిస్తోంది. ముఖ్యంగా రేపు కేబినెట్ సమావేశాన్ని ఏర్పాటు చేస్తుండడం.. జగన్ ఢిల్లీలో ఉన్నప్పుడే ఈ మీటింగ్ షెడ్యూల్ చేయడంతో ఆ ఊహాగానాలకు మరింత బలం చేకూరింది. కేబినెట్ మీటింగులో ముందస్తు ఎన్నికలపై సహచర మంత్రులకు జగన్ దిశానిర్దేశం చేస్తారని పలువురు అంచనా వేశారు. అనంతరం ఆగస్టు, సెప్టెంబర్ లో అసెంబ్లీ రద్దు చేసి తెలంగాణతో పాటు ఈ ఏడాది చివర్లో ఎన్నికలకు వెళ్లే అవకాశం ఉందని వారం రోజులుగా మీడియా కోడైకూస్తోంది. అయితే ఇవన్నీ ఊహాగానాలేనని తెలుస్తోంది.
రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ బలపడుతోందని.. వచ్చే ఏడాది వరకూ గడువు ఇస్తే ఆ పార్టీ మరింత బలపడుతుందని జగన్ భావిస్తున్నారని.. అందుకే ముందస్తు ఎన్నికలకు వెళ్లే ఆలోచనలో ఉన్నారని కొంతకాలంగా ప్రచారం సాగుతోంది. పైగా రాష్ట్రం ఆర్థికంగా వెనుకబడి ఉండడం.. సంక్షేమ పథకాలకు అత్యధికంగా ఖర్చు చేయాల్సి వస్తుండడంతో వనరుల కొరత ఏర్పడుతోంది. దీంతో ఉద్యోగుల జీతభత్యాలు కూడా సకాలంలో చెల్లించలేని పరిస్థితి ఏర్పడింది. వీటన్నింటినీ తప్పించుకోవాలంటే ముందస్తుకు వెళ్లడమే మార్గమని జగన్ భావిస్తున్నారని అందరూ అనుకున్నారు.
ఆంధ్రప్రదేశ్ లో ముందస్తు ఎన్నికలకు వెళ్లే ఆలోచన సీఎం జగన్ కు లేదని తెలుస్తోంది. కేబినెట్ సమావేశం సాధారణమేనని... దీనికి ప్రత్యేక ప్రాధాన్యత లేదని సీఎంఓ వర్గాలు చెప్తున్నాయి. నెలకో, రెండు నెలలకో కేబినెట్ సమావేశం నిర్వహించడం ఆనవాయితీగా వస్తోందని.. ఇప్పుడు కూడా అందులో భాగంగానే మంత్రివర్గ సమావేశం ఏర్పాటు చేశామని తెలియజేశాయి. పథకాలు, అమలు తీరు, తీసుకోవాల్సిన చర్యలు.. లాంటి అంశాలపై మాత్రమే మంత్రివర్గ సమావేశంలో చర్చలు ఉంటాయని స్పష్టం చేశారు. మీడియాలో వస్తున్న కథనాలకు ప్రాధాన్యం లేదని తేల్చేశారు.
ప్రజలు తమకు ఐదేళ్లు పరిపాలించేందుకు అవకాశం ఇచ్చారని.. అందులో ఒక్కరోజు కూడా వదులుకోబోమని గతంలోనే జగన్ ప్రకటించారు. తాజాగా మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి కూడా ఇదే విషయాన్ని వెల్లడించారు. తమకు ముందస్తు ఆలోచనే లేదని.. అవన్నీ ఊహాగానాలేనని కొట్టిపారేశారు. ముందస్తుకు వెళ్తే తప్పుడు సంకేతాలు వెళ్తాయని, ప్రతిపక్షాలు చేస్తున్నదే నిజమని ప్రజలు భావించే అవకాశం ఉందని వైసీపీ భావిస్తోంది. అందుకే వాళ్లు చెప్పినట్టు కాకుండా కష్టమోనష్టమో భరిస్తూ చివరి వరకూ ఉండడమే మంచిదనే నిర్ణయానికి జగన్ వచ్చారని సమాచారం. అందుకే ముందస్తు ముచ్చటే లేకుండా రేపు కేబినెట్ సమావేశం జరగబోతోంది.






