షర్మిల పార్టీ విలీనానికి ఓకే..! సేవలపై సందిగ్ధత..!!
కాంగ్రెస్ లో షర్మిల పార్టీ విలీనంపై సస్పెన్స్ ఇంకా కొనసాగుతూనే ఉంది. ఎన్నికలు సమీపిస్తున్న కూడా విలీనంపై క్లారిటీ రాకపోవడంతో షర్మిల అసంతృప్తితో ఉన్నట్టు సమాచారం. దీనిపై తాడోపేడో తేల్చుకునేందుకు షర్మిల ఢిల్లీ వెళ్లారని తెలుస్తోంది. అయితే విలీన ప్రక్రియపై ఒకటి రెండ్రోజుల్లో క్లారిటీ వస్తుందని సమాచారం. ఆమెను తెలంగాణ, ఏపీల్లో ఎక్కడికి పంపిస్తారు.. ఏ రాష్ట్రంలో సేవలను వినియోగించుకుంటారు.. లాంటి అనేక ప్రశ్నలకు విలీనం తర్వాత మాత్రమే సమాధానాలు వచ్చే అవకాశం కనిపిస్తోంది. అయితే విలీనం మాత్రం కచ్చితంగా ఉంటుందని ఇరు పార్టీల నేతలు చెప్తున్నారు.
కుటుంబంలో విభేదాల వల్ల వైఎస్ షర్మిల ఏపీని వదిలేసి తెలంగాణలో అడుగు పెట్టారు. తన మెట్టినిల్లు కావడంతో ఇక్కడ రాజకీయాల్లో చక్రం తిప్పాలనుకున్నారు. తెలంగాణలో కూడా తన తండ్రి రాజశేఖర రెడ్డికి మంచి ఫాలోయింగ్ ఉందని.. అది తనకు కలిసొస్తుందని నమ్మి వైఎస్సార్ తెలంగాణ పార్టీ పెట్టారు. 3800 కిలోమీటర్లకు పైగా పాదయాత్ర చేశారు. అయినా ఆమె అనుకున్నంత మైలేజ్ మాత్రం రాలేదు. అందుకే ట్రాక్ మార్చి ఈసారి కేసీఆర్ పై తీవ్ర విమర్శలు చేశారు. దీంతో ఆమె జైలుకు కూడా వెళ్లాల్సి వచ్చింది. అయినా ఆమె పార్టీ వైపు చూసే నేతలు లేకుండా పోయారు. దీంతో ఆమెకు సీన్ అర్థమైంది.
తెలంగాణలో ఒంటరి పోరు చేస్తే తనకు ఎప్పటికీ మనుగడ ఉండదని భావించిన షర్మిల.. తన కుటుంబ సన్నిహితుడు, కర్నాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ ద్వారా కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ కు దగ్గరయ్యారు. పార్టీ విలీనానికి ప్రతిపాదించారు. విలీన ప్రతిపాదనకు కాంగ్రెస్ హైకమాండ్ కూడా ఓకే చెప్పింది. కానీ తెలంగాణ కాంగ్రెస్ మాత్రం షర్మిల రాకను తీవ్రంగా వ్యతిరేకించింది. అవసరమైతే ఆమెను ఏపీకి పరిమితం చేయాలని సూచించింది. అయితే ఏపీ నేతలు కూడా షర్మిల రాకను స్వాగతించలేదు. ఏపీలో కాంగ్రెస్ పార్టీ ఇలా ఉండడానికి వైఎస్ ఫ్యామిలీయే కారణమనే విషయాన్ని గుర్తు పెట్టుకోవాలని ఏపీ కాంగ్రెస్ హైకమాండ్ కు సూచించింది. దీంతో హైకమాండ్ డైలమాలో పడింది.
రెండు తెలుగు రాష్ట్రాల పీసీసీల అభిప్రాయం తీసుకున్న అనంతరం కాంగ్రెస్ హైకమాండ్ ఓ నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది. ప్రస్తుతానికి షర్మిలను ఏ రాష్ట్రానికి పరిమితం చేయకుండా పక్కన పెట్టాలని నిర్ణయించింది. అయితే విలీనానికి మాత్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. పార్టీ విలీనం తర్వాత కర్నాటక నుంచి ఆమెను రాజ్యసభకు పంపుతారు. అలాగే పార్టీలో ప్రధాన కార్యదర్శి పదవి కట్టబెడతారు. ఎన్నికలు ముగిసిన తర్వాత షర్మిల సేవలను ఏ రాష్ట్రంలో వినియోగించుకోవాలనే దానిపై నిర్ణయం తీసుకుంటారు. ప్రస్తుతానికైతే విలీనానికి ఓకే చెప్పారు. కానీ షర్మిల సేవలపై మాత్రం ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది.