పొలిటికల్ రింగ్ లోకి రెజ్లర్లు...
మహిళా రెజ్లర్లపై లైంగిక వేధింపులకు సంబంధించి అలుపెరుగని పోరాటం చేసిన భారత రెజ్లర్లు వినేష్ పొగట్, బజరంగ్ పునియా.. ఇప్పుడు రాజకీయ రింగ్ లో దిగేందుకు సిద్ధమవుతున్నారా...? తాము ఢిల్లీ రోడ్లపై రోజుల తరబడి పోరాటం చేసినా...కేంద్రం సరిగ్గా స్పందించలేదన్న ఆవేదనతో ఉన్న ఈ రెజ్లర్లు.. ఇప్పుడు నేరుగా రాజకీయ క్షేత్రంలో పోరాడాలని నిర్ణయించారా.. ? అంటే తాజా పరిణామాలు చూస్తే అవుననే సమాధానం వినవస్తోంది. ఎందుకంటే.. వీరిద్దరూ కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీని కలిశారు
మరి. హర్యానా అసెంబ్లీ ఎన్నికల వేళ రాహుల్ గాంధీతో వీరి సమావేశం ఆసక్తికరంగా మారింది. పారిస్ ఒలింపిక్స్‌లో ఉన్నప్పుడే వినేష్ ఫోగట్ కాంగ్రెస్ నుంచి ఎన్నికల్లో పోటీ చేస్తారని ప్రచారం జరిగింది. ఇటీవల పంజాబ్-హర్యానా సరిహద్దులో అన్నదాతలు చేస్తున్న ఆందోళనకు వినేష్ ఫోగట్ మద్దతు తెలిపింది. ఈ పరిణామాల నడుమ ఆమె రాహుల్‌గాంధీని కలిసింది. త్వరలో జరగనున్న హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి పోటీ చేయడం ఖాయమని తేలిపోయింది.
అక్టోబర్ 5న హర్యానా అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఎన్డీఏ-ఇండియా కూటమిల మధ్య గట్టి పోటీ నెలకొంది. మరోసారి అధికారం కోసం బీజేపీ ప్రయత్నిస్తుండగా.. ఈసారి ఎలాగైనా అధికారం దక్కించుకోవాలని కాంగ్రెస్ కూటమి ప్రయత్నిస్తోంది. ఇందులో భాగంగానే గెలుపు గుర్రాల కోసం హస్తం పార్టీ వెతుకులాట ప్రారంభించినట్లు సమాచారం. రెజర్లు వినేష్ ఫోగట్, బజరంగ్ పునియాకు సీట్లు కేటాయించి విజయం సాధించాలని కాంగ్రెస్ వ్యూహాలు రచిస్తోంది. ఇదిలా ఉంటే ఎన్నికల్లో పోటీపై మాత్రం వినేష్ ఫోగట్ ఇంకా క్లారిటీ ఇవ్వలేదు.
పారిస్ ఒలింపిక్స్‌లో 100 గ్రాములు బరువు తేడా రావడంతో వినేష్ ఫోగట్ ఫైనల్‌కు వెళ్లకుండా నిష్క్రమించింది. దీంతో ఆమె తీవ్ర ఆవేదన చెందింది. ఆమెకు భారతీయుల నుంచి సంపూర్ణ మద్దతు లభించింది. ఇక కుస్తి పోటీలకు స్వస్తి పలికి ఆమె రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు తాజా పరిణామాలను బట్టి అర్ధమవుతోంది. హర్యానాలో మొత్తం 90 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. ఇప్పటికే కాంగ్రెస్ 34 మంది అభ్యర్థులను ఖరారు చేసింది. ఇక్కడ అక్టోబర్ 5న పోలింగ్ జరగనుండగా... 8న ఫలితాలు విడుదల కానున్నాయి.