విక్రమ్ డెడికేషన్ వల్ల చూపే పోయేదట
తమిళ నటుడు విక్రమ్ సినిమా కోసం ఎంతటి డెడికేషన్ చూపిస్తాడనేది అందరికీ తెలిసిందే. తాను చేసే పాత్ర కోసం ఎంతటి కష్టమైనా పడటానికి సిద్ధమతడు. హీరోగా తనకు మొదటి బ్రేక్ ఇచ్చిన సేతు సినిమాలో ఒక చోట తన పాత్ర నల్లగా, వీక్ గా కనిపించాలని డైరెక్టర్ చెప్పడంతో దాని కోసం తినడం మానేసి గంటల తరబడి ఎండలో నిలబడ్డ డెడికేషన్ ఒక్క విక్రమ్‌కే సొంతం.
విక్రమ్ చేసిన ప్రతీ పాత్ర కోసం ఆయన ఎంతగానో కష్టపడ్డాడు. కొన్ని సినిమాల కోసం ఒళ్లు హూనం కూడా చేసుకున్నాడు. అయితే కాశీ సినిమా కోసం తాను పడ్డ కష్టం వల్ల చూపు పోయే ప్రమాదంలో పడ్డానని, ఆ టైమ్ లో కొన్ని రోజుల పాటు చూపు మందగించిందని విక్రమ్ రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో తెలిపాడు.
విక్రమ్ కాశీ సినిమాలో అంధుడిగా నటించాడు. ఈ సినిమా మంచి విజయం సాధించడమే కాకు ఎన్నో అవార్డులను గెలుచుకుంది. అయితే ఈ సినిమా కోసం విక్రమ్ కొన్ని నెలలపాటూ కళ్లు పైకి పెట్టి నిజమైన అంధుడిగానే కనిపించేలా నటించడంతో కళ్లు దెబ్బ తిన్నాయని, డాక్టర్ ను కలిస్తే చూపు మందగించిన విషయం చెప్పడంతో పాటూ ఇలానే ఇంకొన్నాళ్లు చేస్తే చూపు పూర్తిగా పోయేదని విక్రమ్ చెప్పాడు. అయితే సినిమా కోసం అందులో తన పాత్ర కోసం ఎంత కష్టపడినా తనకు అది ఆనందాన్నిస్తుందని విక్రమ్ చెప్పడం అందర్నీ ఆశ్చర్యపరుస్తుంది.