మహేష్ సినిమాలో విక్రమ్?
దర్శకధీరుడు రాజమౌళి తన తర్వాతి సినిమాను సూపర్ స్టార్ మహేష్ బాబుతో చేయనున్న విషయం తెలిసిందే. ఈ సినిమాపై ఎన్ని అంచనాలున్నాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆర్ఆర్ఆర్ రిలీజై రెండేళ్లవుతున్నా రాజమౌళి ఇప్పటికీ మహేష్ బాబు సినిమాను సెట్స్ పైకి తీసుకెళ్లలేదు. ప్రస్తుతం రాజమౌళ ఈ సినిమా కోసం నటీనటులు, సాంకేతిక నిపుణులను సెలెక్ట్ చేసే పనిలో బిజీగా ఉన్నాడు.
ఇదిలా ఉంటే ఈ సినిమాలో విలన్ క్యారెక్టర్ కు తమిళ నటుడు విక్రమ్ ను ఎంపిక చేశారని కొన్నాళ్ల కిందట నెట్టింట ప్రచారం జరిగింది. కానీ దాని గురించి టీమ్ ఏ విధమైన స్పష్టత ఇవ్వకపోవడంతో దాని గురించి అందరూ మర్చిపోయారు. దీంతో విక్రమ్ ఈ సినిమాలో నటిస్తున్నాడా లేదా అన్నది సస్పెన్స్ గానే ఉండిపోయింది.
ఈ నేపథ్యంలో విక్రమ్ తన తాజా చిత్రం తంగలాన్ ప్రమోషన్స్ కోసం హైదరాబాద్‌కు రాగా మీడియా తనను మహేష్- రాజమౌళి సినిమాకు సంబంధించిన ప్రశ్న అడిగింది. ఈ సినిమాలో మీరు నటిస్తున్నారా అని అడిగితే విక్రమ్ దానికి సూటిగా సమాధానం చెప్పకుండా రాజమౌళితో తనకు స్నేహం ఉందని, కలిసి సినిమా చేయడం కోసం చాన్నాళ్లుగా చర్చలు జరుగుతున్నాయని చెప్పాడు. తామిద్దరూ కలిసి ఏదొక రోజు సినిమా చేస్తామని, అది ఏ సినిమా అనేది మాత్రం చెప్పలేనని తెలివిగా తప్పించుకున్నాడు. విక్రమ్ చెప్పినదాన్ని బట్టి చూస్తుంటే మహేష్ సినిమా కోసం అతణ్ని సంప్రదిస్తున్న మాట వాస్తవమే అని అర్థమవుతోంది. ఏదేమైనా ఈ విషయంలో క్లారిటీ రావాలంటే జక్కన్న సినిమాను అనౌన్స్ చేసేవరకు ఆగాల్సిందే.