డాలస్‌లో వైభవంగా శ్రీనివాస కల్యాణం

టీపాడ్, టీటీడీ సమన్వయంతో నిర్వహణ
దాదాపు పదివేల మంది హాజరు
అఖిలాండ కోటి బ్రహ్మాండనాయకుడు, శ్రీదేవి, భూదేవి సమేత తిరుమల శ్రీనివాసుడి కల్యాణం అమెరికాలోని డాలస్‌లో అంగరంగవైభవంగా జరిగింది. జూన 25 శనివారం రోజున డాలస్‌లోని క్రెడిట్ యూనియన్ ఆఫ్ టెక్సాస్ ఈవెంట్ సెంటర్ వేదికగా కన్నుల పండువగా సాగింది. కొవిడ్ వల్ల వెంకన్న దర్శనభాగ్యానికి నోచుకోలేకపోయిన ఇక్కడి తెలుగువారందరూ తమకు దక్కిన అరుదైన అద్భుత అవకాశానికి మురిసిపోయారు. ఏడుకొండలు దిగి, సప్త సముద్రాలు దాటి వచ్చిన వెంకన్నను దర్శించుకునేందుకు పన్నెండువేల మందికి పైగా తరలివచ్చారు. మరో సముద్రంలా కదిలివచ్చిన జనసమూహం తమకు దక్కిన ఈ అవకాశానికి తన్మయులవుతూ వెంకన్న సేవలో ఆనంద పరవశులయ్యారు. చివరకు స్టేడియాన్ని గుడిలా మార్చడంపై అభినందనలు వెల్లువెత్తాయి. టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి దంపతులతో పాటు విశాఖపట్నం ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ, ఏపీ అధికార భాషా సంఘం చైర్మన డాక్టర్ యార్లగడ్డ లక్ష్మీప్రసాద్, కడప జడ్పీ చైర్‌పర్సన్ అమర్‌నాథ్ రెడ్డి, చిత్తూరు మాజీ ఎంపీ మహాసముద్రం జ్ఞానేందర్‌రెడ్డి ఈ కార్యక్రమానికి హాజరై విశేష సేవల్లో పాల్గొన్నారు.
ఏపీ, తెలంగాణ నుంచి ప్రత్యేకంగా..
అమెరికాలోనూ తెలుగుదనం ఉట్టిపడేలా ఏర్పాట్లు ఏర్పాట్లు చేశారు. టీటీడీ అర్చకులు, వేద పండితులు కేవలం వెంకన్న కల్యాణానికే పరిమితం కాకుండా సుప్రభాత సేవతో మొదలుపెట్టి, తోమాల సేవ, అభిషేక సేవలు ఘనంగా నిర్వహించారు. వైఖానస ఆగమం ప్రకారం నిర్వహించి ఈ సేవల్లో పాల్గొన్న వారికి టీపాడ్ నిర్వాహకులు ఒక్కో సేవను అనుసరించి వేర్వేరుగా లడ్డూ ప్రసాదం, వస్త్రం, ఐదు గ్రాముల బంగారు నాణెం, వెండి నాణెం, కంచిపట్టు చీర, పట్టు దోతీ, గద్వాల్ పట్టుచీర, పట్టు దుపట్టా, ఇక్కత బ్లౌజ్ పీస్‌తో పాటు వీఐపీ బ్రేక్ దర్శన భాగ్యం కల్పించారు.
నేత్రపర్వంగా..
తొలుత దేవేరులకు కంకణధారణ చేసిన పండితులు కార్యక్రమం ఆసాంతం శ్రీనివాసుడు ఇక్కడే మనసు లగ్నం చేసేలా మనోజపం చేస్తూ పూజలను మనోరంజకంగా, నేత్రపర్వంగా సాగించారు. తమకు ఇంతటి దర్శన, సేవాభాగ్యం కలగడం పట్ల తెలుగువారందరూ పులకించిపోయి టీపాడ్ నిర్వాహకులకు, టీటీడీ చైర్మన వైవీ సుబ్బారెడ్డి దంపతులకు మరీమరీ ధన్యవాదాలు తెలిపారు.
ఏపీ ఎనఆర్‌టీ సమన్వయంతో..
ఆమెరికాలో ఉంటున్న తెలుగువారందరికీ పద్మావతీ అలిమేలు సమేత తిరుమల వేంకటేశ్వరస్వామి దర్శనం కల్పించాలనే ఉద్దేశ్యంతో ఆంధ్రప్రదేశ ప్రభుత్వం ఏపీ నాన రెసిడెంట్ తెలుగు సొసైటీ సమన్వయంతో తిరుమల తిరుపతి దేవస్థానం సహకారంతో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా తెలుగువారు ఎక్కువగా ఉండే అమెరికాలోని తొమ్మిది నగరాల్లో శ్రీనివాస కల్యాణానికి అంకురార్పణ చేసింది. జూన 25న డాలస్ వేదికగా స్వామి వారి కల్యాణం నిర్వహించే అవకాశం తమకు దక్కడం పూర్వజన్మ సుకృతంగా డాలస్ తెలంగాణ ప్రజాసమితి (టీపాడ్) పేర్కొంది. అమెరికా నగరాల్లో శ్రీదేవి, భూదేవి సమేత వెంకన్న కల్యాణం నిర్వహించాలన్న ఆలోచన వచ్చిందే తడవు ఆంధప్రదేశ ప్రభుత్వం, తిరుమల తిరుపతి దేవస్థానం, ఏపీ నాన రెసిడెంట్ తెలుగు అసోసియేషన బృందంతో చర్చలు జరిపి, కార్యక్రమానికి అంకురార్పణ చేసేలా చొరవ తీసుకోవడమే కాకుండా డాలస్‌లో టీపాడ్‌కు ఆ అవకాశమిచ్చేందుకు కారకులైన నాటా అధ్యక్షుడు శ్రీధర్‌రెడ్డి కొర్సపాటికి ఈ సందర్భంగా టీపాడ్ కృతజ్ఞతలు తెలిపింది. ఈ అవకాశం దక్కడం పట్ల ఆంధప్రదేశ ముఖ్యమంత్రి వైఎస్ జగనమోహనరెడ్డికి, టీటీడీ చైర్మన వైవీ సుబ్బారెడ్డికి, టీటీడీ అర్చకులు, పండితులకు, ఏపీ ఎనఆర్‌టీ చైర్మన వెంకట్ మేడపాటికి టీపాడ్ ధన్యవాదాలు తెలిపింది.
టీటీడీ అధికారులతో సమన్వయం చేసుకుంటూ రవాణా తదితర ఏర్పాట్లు చేయడమే కాకుండా డాలస్‌లోని స్థానిక అధికారులు, వ్యాపారులు, రెస్టారెంట్లతో చర్చించి కార్యక్రమ నిర్వహణను సుగమం చేసిన రఘువీర్ బండారును టీపాడ్ బృందంతో పాటు వేడుకకు హాజరైన తెలుగువారందరూ అభినందించారు. లాజిస్టిక్ సహకారం అందించిన తిరుపతికి చెందిన ప్రొఫెసర్ భాను సేవలను ఈ సందర్భంగా కొనియాడారు.
ఈ కార్యక్రమానికి రమణ లష్కర్, ఇందు పంచెర్పుల, అశోక్ కొండల, రామ్ అన్నాడి, మాధవి సుంకిరెడ్డి, సుధాకర్ కలసాని, విజయ్ తొడుపునూరి, చంద్రారెడ్డి పోలీస్, కరణ్ పోరెడ్డి, పాండురంగారెడ్డి పాల్వాయి, రవికాంత రెడ్డి మామిడి స్టీరింగ్ కమిటీ సభ్యులు గా విశేష సేవలిందించారు.
అజయ్ రెడ్డి, రావు కల్వల, జానకి రాంరెడ్డి మందడై అడ్వయిజరీ కమిటీ సభ్యులుగా వ్యవహరించారు.
వివిధ కమిటీలకు చైర్స్‌గా వ్యవహరించిన నరేష్ సుంకిరెడ్డి, బాల గంగవరపు, స్వప్న తుమ్మపాల, మంజుల తొడుపునూరి, రూప కన్నయ్యగారి, మధుమతి వ్యాసరాజు, మాధవి లోకిరెడ్డి, అనురాధ మేకల, లక్ష్మీ పోరెడ్డి, శ్రీనివాస్ అన్నమనేని, రత్న ఉప్పల, శ్రీధర్ వేముల, రేణుక చనుమోలు, జయ తెలకపల్లి, శ్రీనివాస్ తుల, లింగారెడ్డి ఆల్వా, సుమన బసని, రోజా ఆడెపు, గాయత్రి గిరి, మాధవి మెంట, శ్రీనివాస్ రెడ్డి పాలగిరి, వెంకట్ అనంతుల, వీర శివారెడ్డి, రవీంద్రనాథ్ ధూలిపాల, సంతోషి విశ్వనాథుల, రాజా వైశ్యరాజు, అభిషేక్‌రెడ్డి కార్యక్రమం విజయవంతానికి ఎనలేని కృషి చేశారు.
ఈ సందర్భంగా TANTEX ప్రెసిడెంట్ ఉమా మహేశ్వర్ కి మరియు ఇతర తెలుగు సంస్థలైన NATA, ATA, TANA, NATS, TTA లకు TPAD కృతజ్ఞతలు తెలిపింది. కాగా, ఈ సందర్భంగా శ్రీనివాస కళ్యాణం డల్లాస్ మహానగరంలో జరగడానికి మరియు TPAD కి ఈ అవకాశం రావడానికి సహాయం చేసిన NATA ప్రెసిడెంట్ శ్రీధర్‌రెడ్డి కొర్సపాటి గారికి TPAD కృతజ్ఞతలు తెలిపింది. ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వ ప్రవాస ఆంధ్రుల అధికార ప్రతినిధి శ్రీ రత్నాకర్ పందిగాయల కి TPAD ధన్యవాదాలు తెలిపారు.
వైవీ సుబ్బారెడ్డి దంపతులకు సత్కారం
కాగా, ఆంధప్రదేశ ముఖ్యమంత్రి వైఎస్ జగనమోహనరెడ్డి ఆదేశానుసారం శ్రీదేవి, భూదేవి సమేత మలయప్పస్వామి మూర్తులను అర్చకులు, పండితులతో సహా వెంటబెట్టుకుని వచ్చి, ఈ కార్యక్రమాన్ని దగ్గరుండి విజయవంతంగా నిర్వహించిన తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి దంపతులను, అర్చకులు, పండితులను టీపాడ్ అధ్యక్ష కార్యదర్శులు విశేష రీతిలో సత్కరించారు.
డాలస్‌లోని క్రెడిట్ యూనియన ఆఫ్ టెక్సాస్ ఈవెంట్ సెంటర్ వేదికగా జరిగిన ఈ వేడుకకు హాజరై పద్మావతీ అలివేలు సమేత వెంకన్ననను దర్శనం చేసుకున్న వారందరికీ తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదాన్ని ఉచితంగా అందజేశారు.