Radha Spaces ASBL

మంచి మనసున్న హిమాలయ పర్వతం సూపర్ స్టార్ కృష్ణ......ఇక లేరు

మంచి మనసున్న హిమాలయ పర్వతం సూపర్ స్టార్ కృష్ణ......ఇక లేరు

ఘ‌ట్ట‌మ‌నేని కుటుంటానికి 2022 మ‌ర‌చిపోలేని ఏడాది అని చెప్పాలి. వారికి విషాదాన్ని నింపిన సంవ‌త్స‌మిది. ఎందుకంటే ఘ‌ట్ట‌మ‌నేని కుటుంబానికి చెందిన ముగ్గురు స‌భ్యులు త‌ర‌లిరాని లోకాల‌కు వెళ్లిపోటం ఎంతో బాధాక‌రం. సోదరుడు రమేష్ బాబు.. తల్లి ఇందిరా దేవి.. తండ్రి కృష్ణలను మహేష్ పోగొట్టుకున్నారు. ఇలా ఒకే ఏడాది ముగ్గురు కుటుంబ స‌భ్యుల‌ను పోగొట్టుకున్న మ‌హేష్ దుఃఖం తీర్చ‌లేనిద‌ని అభిమానులు, స‌న్నిహితులు అంటున్నారు. ఆయనకు మనోధైర్యం ఇవ్వడానికి దగ్గరి వారు ప్రయత్నిస్తున్నారు. ఘ‌ట్ట‌మ‌నేని కుటుంటానికి 2022 మ‌ర‌చిపోలేని ఏడాది అని చెప్పాలి. వారికి విషాదాన్ని నింపిన సంవ‌త్స‌రమిది. ఎందుకంటే ఘ‌ట్ట‌మ‌నేని కుటుంబానికి చెందిన ముగ్గురు స‌భ్యులు త‌ర‌లిరాని లోకాల‌కు వెళ్లిపోటం ఎంతో బాధాక‌రం. ఏడాది ప్రారంభంలో అంటే జ‌న‌వ‌రి 8న మ‌హేష్ బాబుకి ఎంతో ఇష్టమైన సోద‌రుడు ర‌మేష్ బాబు క‌న్నుమూశారు. ఆ ఎఫెక్ట్‌తో మ‌హేష్ ఎంత‌గానో కుంగిపోయారు.

ర‌మేష్ బాబు మ‌ర‌ణించిన స‌మ‌యంలో మ‌హేష్ క‌రోనాతో బాధ‌ప‌డుతుండ‌టం వ‌ల్ల తుది చూపు కూడా చూసుకోలేక‌పోవ‌టం మ‌రింత బాధాకరం. ఇక మ‌హేష్ మాతృమూర్తి  ఇందిరా దేవి వ‌యో భారంతో సెప్టెంబ‌ర్ 28, 2022న క‌న్నుమూశారు. త‌న జీవితాన్ని ఉన్న‌తంగా తీర్చిదిద్దిన వ్య‌క్తుల గురించి ప్ర‌స్తావించే ప్ర‌తీ సంద‌ర్భంలో మ‌హేష్ త‌న త‌ల్లి గురించి చెబుతుంటారు. అలాంటి వ్య‌క్తి దూర‌మైతే ఉండే బాధ చెప్ప‌న‌ల‌వి కాదు.. అప్పుడు మ‌హేష్ ఇంకా కుంగిపోయారు. ఇక ఇప్పుడు ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. త‌న జీవితానికి ఇన్‌స్పిరేష‌న్ ఇస్తూ ముందుకు న‌డిపించిన తండ్రి కృష్ణ‌ ను పోగొట్టుకున్నారు మహేష్. కార్డియాక్ అరెస్ట్‌తో ఆదివారం రాత్రి కాంటినెంట‌ల్ హాస్పిట‌ల్‌లో కృష్ణ జాయిన్ అయ్యారు. డాక్ట‌ర్స్ సీపీఆర్ చేయ‌టంతో గుండెపోటు నుంచి బ‌య‌ట‌ప‌డ్డారు. అయితే అవ‌య‌వాలు వైద్యానికి స‌హ‌క‌రించ‌క‌పోవ‌టంతో కృష్ణ మంగ‌ళ‌వారం ఉద‌యం న‌వంబ‌ర్ 15న తెల్లవారు ఝామున గం. 4:09ని లకు క‌న్నుమూశారు. ఇలా ఒకే ఏడాది ముగ్గురు కుటుంబ స‌భ్యుల‌ను పోగొట్టుకున్న మ‌హేష్ దుఃఖం తీర్చ‌లేనిద‌ని తెలుగు సినీ పరిశ్రమ, అభిమానులు, స‌న్నిహితులు యావత్ అభిమాన సంఘాలు అంటున్నారు. ఈ సందర్భంగా సూపర్ స్టార్ కృష్ణ సినీ ప్రస్థానం గురించి సింహావలోకనం చేసుకుంటే....

టాలీవుడ్ చిత్రసీమను కొత్త పుంతలు తొక్కించిన ధీశాలి. ఘట్టమనేని శివరామకృష్ణగా తెలుగు సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి ఏ హీరో చేయలేని విధంగా 360కి పైగా చిత్రాల్లో నటించడమే కాకుండా తెలుగు సినిమాకు టెక్నికల్ గా కొత్తదారులు చూపించి సాహసానికి మారుపేరుగా నిలిచిన నట శిఖరం మన నటశేఖర కృష్ణ. నటుడుగా ఐదు దశాబ్దాలను పూర్తి చేసుకున్న ఆయన హీరోగా ఎన్నో విలక్షణమైన సినిమాలతో తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో చెరగని ముద్రవేసిన సూపర్ స్టార్ గా నిలిచిపోయారు. తెలుగు సినిమా రంగంలో ఆయన చేసినన్ని సాహసోపేతమైన ప్రయోగాలు ఇంకెవ్వరూ చెయ్యలేదన్నది నిజం. సూపర్ స్టార్ అనే పదానికి అసలు సిసలైన అర్థంగా నిలిచారు. తన సినీ ప్రయాణంలో ఒక్కో మెట్టు ఎక్కుతూ లక్ష్యాన్ని ఎలా చేరుకోవాలో చెప్పడానికి హీరో కృష్ణ కెరీర్ గ్రాఫ్ గొప్ప ఉదాహరణ. ఎక్కడో గుంటూరు జిల్లా తెనాలి తాలూకా బుర్రిపాలెం నుంచి వచ్చిన యువ హీరో...అంచెలంచెలుగా ఎదిగి నేడు సూపర్ స్టార్ కావడం అంటే ఆషామాషీ కాదు. ఓటమికి కుంగిపోవడం, గెలుపుకు పొంగిపోవడం ఆయన డిక్షనరిలో లేదు. సూపర్ స్టార్ కృష్ణ 360 చిత్రాల ప్రయాణాన్ని తరచి చూస్తే ఆయన విజయం వైపు సాగిన ప్రయాణంలో ఎన్నో ఆటు పోట్లు మనకు దర్శనమిస్తాయి. హీరోగా, నిర్మాతగా, స్టూడియో అధినేతగా, దర్శకుడిగా, డిస్ట్రిబ్యూటర్ గా అన్ని కోణాల్లో తన బహుముఖ ప్రజ్ఞను ప్రదర్శించారు కృష్ణ.

తొలి చిత్రంతోనే సక్సెస్ ఫుల్ హీరో

ఎన్టీఆర్, ఎ.ఎన్.ఆర్ నువ్వా నేనా అంటూ పోటాపోటీగా సినిమాలు చేసే తరుణమది. అప్పుడు ప్రేక్షకుల దృష్టిలో హీరోలంటే వాళ్ళే. అటువంటి చిత్రసీమలో ఆదుర్తి సుబ్బారావు దర్శకత్వంలో వచ్చిన 1965లో ‘తేనెమనసులు’ చిత్రం ద్వారా హీరోగా పరిచయమై తొలి చిత్రంతోనే శతదినోత్సవ హీరోగా అందరి దృష్టిని ఆకర్షించారు కృష్ణ. కన్నెమనసులు చిత్రంలో కృష్ణ మెప్పించారు.

టాలీవుడ్ జేమ్స్ బాండ్ అయినా..కౌబోయ్ అయినా కృష్ణే

అలాగే అపరాధ పరిశోధన సినిమాలకు ఊపిరి పోసిన నటుడు కూడా  కృష్ణే. తెలుగు జేమ్స్ బాండ్ గా సూపర్ స్టార్ కృష్ణ విన్యాసాలు అభిమానులకు ఇప్పటికీ గుర్తే. గూఢచారి 116 పాత్రలు కృష్ణకు అభిమానులను చేరువ చేసింది. టాలీవుడ్ జేమ్స్ బాండ్ మూవీ గూఢచారి 116 అన్ని సెంటర్స్ లో అద్భుతమైన కలెక్షన్స్ ను రాబట్టింది. ఈ చిత్రంతో ప్రేక్షకుల్లో తిరుగులేని మాస్ ఇమేజ్ను సంపాదించుకున్నారు కృష్ణ. హాలీవుడ్ చిత్రాలకు ధీటుగా, ఇండియన్, తెలుగు కౌబోయ్ మూవీగా విడుదలైన ‘మోసగాళ్ళకు మోసగాడు’ చిత్రం సరికొత్త ట్రెండ్ని క్రియేట్ చేసి సాంకేతికంగా సినిమా ఖ్యాతిని ఖండాంతరాలు వ్యాపించేలా చేసింది. అందుకే ఇప్పటికీ ఎప్పటికీ టాలీవుడ్ జేమ్స్ బాండ్ అయినా, కౌబోయ్ అయినా సూపర్ స్టార్ కృష్ణ మాత్రమే తెలుగు సినీ ప్రేక్షకులకు గుర్తుండిపోయారు., ఉండిపోతారు కూడా. మంచి నటుడిగానే కాకుండా, మంచి క్రమశిక్షణగల వ్యక్తిగా అందరి హృదయాలను గెలుచుకున్న రియల్ హీరో. తొలి సినిమా స్కోప్ చిత్రంగా ‘అల్లూరి సీతారామరాజు’ తొలి 70 ఎం.ఎం చిత్రంగా ‘సింహాసనం’ను రూపొం దించి తెలుగు సినిమాని టెక్నికల్ గా ఉన్నత స్థాయికి తీసుకెళ్ళిన ఘనత సూపర్ స్టార్ కృష్ణదే! కృష్ణ నటించిన చిత్రాలన్నీ తమిళ్, హిందీ భాషల్లో డబ్ అయి సంచలన విజయాలు సాధించి తెలుగు సినిమా మార్కెట్ రేంజ్ ని పెంచాయి. మోసగాళ్ళకు మోసగాడు ఇంగ్లీష్ లో కూడా డబ్ అయి విజయం సాధించడం విశేషం.

సాంఘిక చిత్రాల్లో కూడా తనదైన ముద్ర

డిఫరెంట్ చిత్రాల్లో నటిస్తూనే మరోపక్క ఫ్యామిలీ ఆడియన్స్ మెచ్చే కుటుంబ కథా చిత్రాలతోనూ విజయాలు సాధించారు. ‘పండంటి కాపురం, ఇల్లు ఇల్లాలు, కొత్త కాపురం, పచ్చనికాపురం, పచ్చని సంసారం’ వంటి శతదినోత్సవ చిత్రాలు దీనికి ఉదాహరణ. మరోపక్క దేశభక్తి సినిమాల్లో కూడా తన మార్క్ ను చూపించారు. ‘తెలుగు వీరలేవరా’ అన్న అల్లూరి సీతారామరాజు పిలుపు తెలుగు ప్రేక్షకుల గుండెల్లో ఇంకా మారుమోగుతూనే వుంది. ఒక సంవత్సరంలో 18 సినిమాలు, మరో సంవత్సరం 14 చిత్రాలు, 13 సినిమాలు, 12 సినిమాలు... వరసగా సినిమాలు చేస్తూ రికార్డులు సృష్టించడమే కాకుండా రోజుకు రెండు, మూడు షిఫ్టులలో 360 చిత్రాలకు పైగా నటించిన ఘనత సాధించిన సూపర్ స్టార్ కృష్ణకే దక్కింది. 330 చిత్రాల్లో హీరోగా నటించి అత్యధిక చిత్రాల్లో నటించిన హీరోగా రికార్డ్ క్రియేట్ చేశారు. అంతే కాకుండా విజయనిర్మలతో 50కి పైగా చిత్రాల్లో కలిసి నటించి ఓకే హీరోయిన్ తో ఎక్కువ చిత్రాల్లో జత కట్టిన హీరోగా కూడా ఓ అరుదైన రికార్డు సృష్టించారు.  

నిర్మాతల హీరో

సినిమా పరిశ్రమ బావుండాలంటే స్టార్ హీరోలు ఎక్కువ సినిమాలు చేయాలి, నిర్మాతలు ఇబ్బందుల్లో ఉంటే హీరోలు సదరు నిర్మాతలకు నేనున్నానంటూ భరోసా ఇవ్వాలి. ఈ సూత్రాలను తు.చ. తప్పకుండా పాటించిన ఏకైక హీరో కృష్ణ. వరుసగా ఎడతెరపి లేకుండా సినిమాలు చేసి ఇండస్ట్రీ ఎదుగుదలకు పాటుపడటమే కాకుండా ఒక సినిమా సరిగా ఆడకపోతే ఆ నిర్మాతని పిలిచి మరో సినిమాకి డేట్స్ ఇచ్చి సినిమా చేసుకోమనే మంచి మనసున్న మనీషి కృష్ణ. అందుకే ఆయన్ను అందరూ నిర్మాతల హీరో అంటారు.

మల్టీస్టారర్ చిత్రాల్లోనూ కృష్ణదే రికార్డ్

ఎన్టీఆర్ తో ‘దేవుడు చేసిన మనుషులు’ వంటి భారీ మల్టీస్టారర్ ని నిర్మించి మల్టీస్టారర్ చిత్రాల చరిత్రలో కొత్త ట్రెండ్ క్రియేట్ చేసిన కృష్ణ 50కి పైగా అత్యధిక మల్టీస్టారర్ చిత్రాల్లో నటించి రికార్డ్ ను సృష్టించారు. ఎన్.టి.ఆర్, ఎ.ఎన్.ఆర్, శివాజీ గణేశన్, రజనీకాంత్, శోభన్ బాబు, కృష్ణంరాజు, చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున.. ఇలా అందరు హీరోలతో కలిసి నటించిన హీరోగా కృష్ణ ఓ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు.

అత్యధిక హిట్స్ అందించిన క్రెడిట్

1973లో ‘నేరము శిక్ష, పుట్టినిల్లు మెట్టినిల్లు, మాయదారి మల్లిగాడు, గంగ మంగ, మీనా’ వంటి బ్లాక్ బస్టర్స్ ఇచ్చిన ఘనత కూడా కృష్ణదే. ఎప్పటికప్పుడు హీరోగా అత్యధిక చిత్రాలు చెయ్యడమే కాదు, అత్యధిక హిట్స్ అందించిన క్రెడిట్ కూడా కృష్ణ దక్కించుకున్నారు. 1983లో ‘ముందడుగు, కిరాయి కోటిగాడు, రామరాజ్యంలో భీమరాజు, అడవి సింహాలు, శక్తి, ప్రజారాజ్యం, పోరాటం, అమాయకుడు కాదు అసాధ్యుడు’ ఇలా ఒకే సంవత్సరంలో 8 హిట్ చిత్రాలు ఇచ్చిన హీరోగా ప్రేక్షకుల ప్రశంసల్ని అందుకున్నారు. 1985లో ‘అగ్ని పర్వతం, వజ్రాయుధం, పల్నాటి సింహం’ వంటి బ్లాక్ బస్టర్స్ తో ‘పచ్చని సంసారం, సూర్యచంద్ర’ వంటి సూపర్ హిట్స్ తో ఒకే సంవత్సరంలో 5 సూపర్ డూపర్ హిట్స్ ఇచ్చిన ఘనత కూడా కృష్ణదే. కెరీర్ ప్రారంభం నుండి సంక్రాంతి చిత్రాలన్నీ దాదాపు ఘన విజయాలు సాధించిన హీరోగా కృష్ణ మరో రికార్డ్ సృష్టించారు. ‘అసాధ్యుడు, పాడి పంటలు, అమ్మదొంగా, నెంబర్వన్, పచ్చని సంసారం, సంప్రదాయం’ వంటి సంక్రాంతి హిట్స్ సూపర్ స్టార్ ని సంక్రాంతి హీరోని చేసాయి.

నిర్మాతగా, దర్శకుడిగా ఎవర్ గ్రీన్ చిత్రాలు

నిర్మాతగా ‘మోసగాళ్ళకు మోసగాడు, పండంటి కాపురం, దేవుడు చేసిన మనుషులు, అల్లూరి సీతారామరాజు, పాడి పంటలు, ఈనాడు’ వంటి సంచలన చిత్రాలు నిర్మించిన కృష్ణ దర్శకుడిగా ‘సింహాసనం, కొడుకు దిద్దిన కాపురం, కలియుగ కర్ణుడు’ వంటి ఎవర్గ్రీన్ హిట్ చిత్రాలను అందించి సక్సెస్ఫుల్ దర్శక నిర్మాతగా పేరు సంపాదించుకున్నారు.

సంక్రాంతి మొనగాడు

పండుగల్లో సంక్రాంతి పండుగకి ప్రత్యేక స్థానం ఉంది. ఈ సంక్రాంతి సినిమాల బరిలో సూపర్ స్టార్ కృష్ణే మొనగాడు. సంక్రాంతికి 26 సినిమాలను విడుదల చేసి హిట్స్ సాధించిన ఏకైక హీరో ఇప్పటికీ కృష్ణ మాత్రమే.

ఆరు దశాబ్దాల నట ప్రస్థానంలో, 360కి పైగా సినిమాలో, ప్రయోగాలకు వెరవని తత్వం, చెక్కుచెదరని ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళ్తున్న సూపర్ స్టార్  కృష్ణ పుట్టిన రోజు 1942 మే 31. ఈ ఏడాదితో కృష్ణ 80 వసంతాలను పూర్తి చేసుకున్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని తెలుగు టైమ్స్ తమ సంతాపాన్ని తెలియచేస్తుంది. 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :