రూ.130 కోట్ల విరాళం ప్రకటించిన తెలంగాణ ఉద్యోగుల ఐకాస
తెలంగాణ రాష్ట్రంలో వరద బాధితులను ఆదుకునేందుకు తమ వంతు సాయానికి ప్రభుత్వ ఉద్యోగులు ముందుకొచ్చారు. ఒక రోజు మూల వేతనం రూ.130 కోట్లను సీఎం సహాయనిధికి ఇస్తామని తీర్మానించిన లేఖను తెలంగాణ ఉద్యోగుల ఐకాస నేతలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డిలకు అందజేశారు. మహబూబాబాద్ పర్యటనలో ఉన్న సీఎంను అక్కడి కలెక్టరేట్‌లో స్వయంగా కలిసి సంతకాలతో కూడిన లేఖను సమర్పించారు. టీఎన్‌జీవో కార్యాలయంలో ఉద్యోగుల ఐకాస స్టీరిగ్ కమిటీ అత్యవసర సమావేశం ఏర్పాటు చేశారు. భారీ వర్షాలు, వరదల నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న సహాయక చర్యలకు మద్దతుగా మానవతా దృక్పథంతో ఈ సాయాన్ని ప్రకటిస్తూ తీర్మానం చేశారు. తెలంగాణ ఉద్యోగులు, గెజిటెడ్ అధికారులు, ఉపాధ్యాయులు, కార్మికులు, పింఛనుదారులు, కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ సిబ్బంది ఒక రోజు మూల వేతనం మొత్తాన్ని సెప్టెంబర్ నెల జీతం నుంచి ప్రభుత్వ ఖజానాకు జమ చేయాలని ముఖ్యమంత్రికి విన్నవిస్తూ తీర్మానించినట్లు ఐకాస చైర్మన్ మారం జగదీశ్వర్, ప్రధాన కార్యదర్శి ఏలూరి శ్రీనివాసరావు ప్రకటించారు.