ASBL Koncept Ambience
facebook whatsapp X

ఢిల్లీకి సీఎం రేవంత్ రెడ్డి..! కేబినెట్ విస్తరణ కోసమేనా..?

ఢిల్లీకి సీఎం రేవంత్ రెడ్డి..! కేబినెట్ విస్తరణ కోసమేనా..?

తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి పది నెలలవుతోంది. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన సమయంలోనే తన కేబినెట్లోకి మంత్రులను తీసుకున్నారు. అయితే ఇప్పటికీ 6 స్థానాలు ఖాళీగా ఉన్నాయి. వీటిని ఎప్పుడు భర్తీ చేస్తారోననే ఉత్కంఠ చాలాకాలంగా ఉంది. ఇప్పుడు నామినేటెడ్ పదవులతో పాటు పీసీసీ చీఫ్ నియామకం కూడా పూర్తవడంతో కేబినెట్ విస్తరణ చేపట్టవచ్చనే ఊహాగానాలు ఊపందుకున్నాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీ వెళ్తుండడంతో మంత్రివర్గ విస్తరణపై చర్చించేందుకే ఆయన వెళ్తున్నారని కాంగ్రెస్ పార్టీలో చర్చ జరుగుతోంది.

కొత్తగా ఎంపికైన పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ తో పాటు సీఎం రేవంత్ రెడ్డి బుధవారం ఢిల్లీ వెళ్తున్నారు. ఈ దఫా కేబినెట్ విస్తరణపై అధిష్టానంతో చర్చించి ఆమోదం పొందుతారని ఆయన సన్నిహిత వర్గాలు భావిస్తున్నారు. దీంతో కేబినెట్ లో చోటు ఆశిస్తున్నవాళ్లంతా ఆశగా ఎదురు చూస్తున్నారు. మంత్రివర్గంలో స్థానం దక్కించుకునేందుకు చాలా మంది పోటీ పడుతున్నారు. కాంగ్రెస్ నుంచి ఎన్నికైన వాళ్లతో పాటు బీఆర్ఎస్ నుంచి వచ్చిన ఎమ్మెల్యేలు కూడా మంత్రివర్గంలో చోటు దక్కుతుందని ఆశిస్తున్నారు. అయితే వాళ్లను చేర్చుకుంటే చట్టపరమైన ఇబ్బందులు వస్తాయి కాబట్టి వాళ్లకు ఇతర పదవులు ఇచ్చే అవకాశం ఉందని సమాచారం.

కాంగ్రెస్ నుంచి గెలిచిన వాళ్లు మాత్రం చాలా మంది కేబినెట్ లో స్థానం కోసం తెరవెనుక గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు. గడ్డం వివేక్, గడ్డం వినోద్, ప్రేమ్ సాగర్ రావు, సుదర్శన్ రెడ్డి, మల్ రెడ్డి రంగారెడ్డి, రాంమోహన్ రెడ్డి, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, శ్రీహరి ముదిరాజ్, షబ్బీర్ ఆలీ, ఆజారుద్దీన్ తదితరులు మంత్రిపదవులు ఆశిస్తున్నారు. మైనార్టీ కోటాలో షబ్బీర్ ఆలీ, అజారుద్దీన్ కేబినెట్లో చోటు ఆశిస్తున్నారు. అయితే షబ్బీర్ ఆలీకి అవకాశం దక్కవచ్చని అంచనా. మరోవైపు ముదిరాజ్ కోటాలో శ్రీహరి ముదిరాజ్ కు కచ్చితంగా చోటు ఉంటుందని భావిస్తున్నారు.

నల్గొండ జిల్లా నుంచి ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఇప్పటికే కేబినెట్లో ఉన్నారు. అయితే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కూడా కేబినెట్ లో స్థానంకోసం గట్టిగా ప్రయత్నిస్తున్నారు. మరోవైపు గడ్డం వివేక్ కు ఎస్సీ కోటాలో తీవ్రంగానే ప్రయత్నిస్తున్నారు. బీఆర్ఎస్ పైన ఫైట్ చేసిన వాళ్లలో వివేక్, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఉన్నారు. అయితే వీళ్లు పార్టీలు మారి ఇప్పుడు కాంగ్రెస్ నుంచి గెలిచారు.ఇలాంటి వాళ్లకంటే మొదటి నుంచి పార్టీలో ఉంటున్న వారికే కేబినెట్లో స్థానం కల్పించే అవకాశం ఉందనే ప్రచారం జరుగుతోంది. పార్టీని నమ్ముకున్నవాళ్లకు అధిష్టానం ఎప్పుడూ అన్యాయం చేయదని.. పీసీసీ చీఫ్ గా ఎన్నికైన మహేశ్ కుమార్ గౌడ్ నియామకమే ఇందుకు నిదర్సనమని చెప్తున్నారు. మరి చూడాలి అధిష్టానం మైండ్ లో ఏముందో..!!

 

 

 

praneet praneet praneet ASBL Radhey Skye Radha Spaces
Tags :