టీడీపీ – జనసేన ఉమ్మడి కార్యాచరణ..!!
ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు రోజురోజుకూ ఆసక్తికరంగా మారుతున్నాయి. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు స్కిల్ డెవలప్మెంట్ కేసులో అరెస్ట్ అయి జైలులో ఉండడంతో ఎన్నికలకు ఆ పార్టీ ఎలా సమాయత్తమవుతుందనేది ఉత్కంఠ కలిగిస్తోంది. మరోవైపు అధికార వైసీపీ దూకుడు మరింత పెంచుతోంది. అయితే వైసీపీని ఎలాగైనా గద్దె దించాలని పట్టుదలతో ఉన్న టీడీపీ, జనసేన ఈసారి కలిసి పోటీ చేస్తామని ప్రకటించాయి. దీంతో రెండు పార్టీలు ఇప్పటి నుంచే ఉమ్మడిగా పోరాడేందుకు సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది. అన్ని అంశాలపై కలిసి కార్యాచరణ రూపొందించుకునే దిశగా అడుగులు వేస్తున్నాయి.
చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయి రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉన్నప్పుడు జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఆయన్ను కలిసి ఈసారి టీడీపీతో కలిసి పోటీ చేయబోతున్నట్టు వెల్లడించారు. అప్పటి వరకూ ఊహాగానాలుగానే ఉన్న ఈ అంశం.. పవన్ కల్యాణ్ ప్రకటన తర్వాత అధికారికమైంది. దీంతో టీడీపీ – జనసేన పొత్తుపై ఊహాగానాలకు బ్రేక్ పడింది. ఈ రెండు పార్టీలు పొత్తు పెట్టుకుంటే ఈసారి వైసీపీకి కష్టమే అనే ప్రచారం జరుగుతోంది. అందుకే ఆ రెండు పార్టీలను కలవనీయకుండా ఉండేందుకు వైసీపీ తీవ్ర ప్రయత్నాలే చేసింది. కానీ వర్కవుట్ కాలేదు. టీడీపీ-జనసేన కలిస్తే వైసీపీ ఎక్కువగా కష్టపడాల్సి ఉంటుంది.
గతంలో విడివిడిగా పోటీ చేయడం వల్ల వైసీపీ గెలిచిందని టీడీపీ, జనసేన భావిస్తున్నాయి. అందుకే ఈసారి ఆ అవకాశం ఎట్టిపరిస్థితుల్లో వైసీపీకి ఇవ్వకూడదనుకుంటున్నాయి. అందుకే ఎన్నికలకు ఇంకా ఆరు నెలలకు పైగా సమయం ఉన్నా.. ఇప్పటి నుంచే ఉమ్మడి కార్యాచరణతో ముందుకు వెళ్లాలని ఆ రెండు పార్టీలు భావిస్తున్నాయి. రెండు పార్టీల మధ్య సమన్వయం కోసం ఓ కమిటీని ఏర్పాటు చేస్తున్నాయి. టీడీపీ తరపున యనమల రామకృష్ణుడు, జనసేన నుంచి నాదెండ్ల మనోహర్ కమిటీకి సమన్వయ కర్తలుగా పని చేయనున్నారు. ప్రస్తుతం చంద్రబాబు ఎపిసోడ్ వల్ల కమిటీ కార్యాచరణ కాస్త ఆలస్యం అవుతోంది.
టీడీపీకి ప్రస్తుతం షోటైమ్ కన్సల్టెన్సీ సేవలందిస్తోంది. అలాగే జనసేనకు రైజ్ పని చేస్తోంది. ఈ రెండు కూడా ఇకపై సమన్వయంతో పని చేయాలని నిర్ణయించాయి. సోషల్ మీడియాలో ఇప్పటికే రెండు పార్టీలూ సమర్థంగా పనిచేస్తున్నాయి. వైసీపీ తరపున పని చేస్తున్న ఐప్యాక్ కు గట్టిగానే కౌంటర్స్ ఇస్తున్నాయి. ఇకపై సోషల్ మీడియాలో కూడా కలిసి పనిచేస్తూ వైసీపీకి ఎప్పటికప్పుడు చెక్ పెట్టాలనుకుంటున్నాయి. టీడీపీ, జనసేన సోషల్ మీడియా టీంలు ఉమ్మడిగా పనిచేస్తేనే వైసీపీని సమర్థంగా ఎదుర్కోగలమని భావిస్తున్నాయి.