Radha Spaces ASBL

తానా పుస్తక మహోద్యమంకు అనూహ్య స్పందన!

తానా పుస్తక మహోద్యమంకు అనూహ్య స్పందన!

ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) ప్రపంచ సాహిత్య వేదిక ఆధ్వర్యంలో ‘‘పుస్తక మహోద్యమం’’ కార్యక్రమం ఘనంగా నిర్వహించబడింది. ప్రవాస భారతీయులు, పిల్లలు అధిక సంఖ్యలో ఈ సమావేశంలో ఉత్సాహంగా పాల్గొని సభను జయప్రదం చేశారు. స్వాతి కృష్ణమూర్తి మరియు వారి శిష్యబృందం ‘‘మా తెలుగు తల్లికి మల్లె పూదండ...’’ ఆలపించిన ప్రార్ధనా గీతంతో సభను ప్రారంభించారు.  ముందుగా కౌన్సిల్‌ ఎట్‌లార్జ్‌ ప్రతినిధి లోకేష్‌ నాయుడు, సభను ప్రారంబించి అందరికి తానా పుస్తక మహోద్యమానికి స్వాగతం పలికి, తెలుగు భాష, పుస్తకాల విశిష్ఠత గురించి తెలియజేశారు. తానా వారు చేస్తున్న పలు కార్యక్రమాల గురించి వివరించి, రాబోయే కాలంలో తానా అధ్యక్షులు అంజయ్య చౌదరి మరియు తానా కార్యవర్గ బృందం సారధ్యంలో మరిన్ని మంచి మంచి కార్యక్రమలను మీముందుకు తీసుకు వస్తున్నాం అని, తానా కార్యక్రమాలలో అందరు పాల్గొనవలసిందిగా కోరారు. ప్రముఖ రచయిత, సాహితీవేత్త డాక్టర్‌ బీరం సుందరరావు మరియు ప్రముఖ రచయిత్రి అత్తలూరి విజయలక్ష్మి గౌరవ అతిధులుగా పాల్గొన్న ఈ సభకు తానా పూర్వాధ్యక్షులు, తానా ప్రపంచ సాహిత్య వేదిక నిర్వాహకులు డాక్టర్‌ ప్రసాద్‌ తోటకూర అధ్యక్ష్తత వహించారు. తానా పాఠశాల చైర్మన్‌ నాగరాజు నలజుల డాక్టర్‌ బీరం గారిని, తానా తెలుగు భాషా పరివ్యాప్తి కమిటి చైర్మన్‌ చినసత్యం వీర్నపు అత్తలూరి విజయలక్ష్మి గారిని సభకు పరిచయం చేశారు.

డాక్టర్‌ ప్రసాద్‌ తోటకూర మాట్లాడుతూ పుస్తకాలను కొని బహుమతులుగా ఇచ్చే సంప్రదాయాన్ని ప్రోత్సహించడం, ముఖ్యంగా పిల్లలకు చిన్నప్పటినుండే పుస్తక పఠనంపై ఆసక్తి గల్గడానికి వారికి మంచి పుస్తకాలను పరిచయం చెయ్యాలని, ‘పాతికవేల పుస్తకాలు పాఠకుల చేతుల్లోకి’ అనే నినాదంతో ప్రారంభించిన ఈ అక్షర యజ్ఞానికి విశేష స్పందన లభిస్తోందని, ఈ కార్యక్రమంలో భాగస్వాములైన వారందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. టెక్సాస్‌ రాష్ట్రంలో తెలుగు భాష మాట్లాడేవారి సంఖ్య నానాటికి పెరుగుతుందని రాష్ట్ర అభివృద్దికి వారి సహాయం మరువలేనిదని కొనియాడుతూ టెక్సాస్‌ రాష్ట్ర గవర్నర్‌ ‘గ్రెగ్‌అబ్బాట్‌ ‘ఉగాది పర్వ దినం (ఏప్రిల్‌ 02) ‘తెలుగు భాష మరియు వారసత్వ దినం’ ప్రకటించినందులకు డాక్టర్‌ తోటకూర ప్రసాద్‌ గవర్నర్‌ కు ప్రత్యేక ధన్యవాదాలు తేలియజేశారు.

తానా పాఠశాల చైర్మన్‌ నాగరాజు నలజుల మాట్లాడుతూ పాఠశాలలో పిల్లలకు సులభతరంలో తెలుగు నేర్చుకునే విధంగా పాఠ్యాంశాలను రూపొందించామని, డాక్టర్‌ అరుణ జ్యోతి, వెంకట్‌ తాడిబోయిన లాంటి ఉపాథ్యాయులు కూడా పిల్లలకు అర్ధమయ్యే రీతిలో తెలుగు నేర్పిస్తున్నారు అని చెప్పారు. ఇప్పటికే అమెరికా అంతటా, విదేశాలలో కూడా తానా పాఠశాలలో వేల సంఖలో పిల్లలు చేరి పిల్లలు తెలుగు నేర్చుకుంటున్నారు అని అన్నారు. తానా తెలుగు పరివ్యాప్తి కమిటీ చైర్మన్‌ చినసత్యం వీర్నపు మాట్లాడుతూ, తల్లిదండ్రులు పిల్లలతో ఇంట్లో తెలుగులో మాట్లాడాలని, పిల్లల భాషా పటిమ పెంచడం కోసం వినూత్నంగా వివిధ భాగాలలో ‘తెలుగు తేజం పోటీలు ‘త్వరలో నిర్వహిస్తున్నాం అని, ఈ పోటీలలో  పిల్లలు అధిక సంఖ్యలో పాల్గొనాలని ఆహ్వానించారు. సిరికోన సాహిత్య సంస్థ వారిచే పురస్కారం పొందిన చారిత్రాత్మక నవల ‘‘ఉపాసన’’ ప్రతులను సుబ్రమణ్యం జొన్నలగడ్డ గౌరవ అతిథులకు, మిత్రులకు బహుమతులుగా అందజేశారు.

చంద్రహాస్‌ మద్దుకూరి పుస్తక మహోద్యపు ప్రాముఖ్యాన్ని వివరించి, అనంత్‌ మల్లవరపు, రమణ జువ్వాడిలు ఒకరికి ఒకరు పుస్తకాలను బహుమతులుగా అందించుకున్నారు. అత్తలూరి విజయలక్ష్మి మట్లాడుతూ, తానా వారు ప్రవాసంలో చేస్తున్న ‘‘పుస్తక మహోద్యమం’ ను పుస్తకాల పండుగ అని కొనియాడారు. ప్రస్తుత సమాజంలో బుక్‌ కల్చర్‌ పోయి, లుక్‌ కల్చర్‌ పెరిగింది అన్నారు. పుస్తకాలు ఇచ్చి పుచ్చుకోవడం మరియు చదవడం శుభసూచకం అని, పాతిక వేల పుస్తకాలు పాఠకులకు అందిచడం ముదావహమని అన్నారు. ఉభయ రాష్ట్రాలలోని వారికంటే ప్రవాసంలో వున్నవారే ఎక్కువగా తెలుగు భాషాభివృద్దికి కృషిచేస్తున్నారు అని మెచ్చుకున్నారు.

డాక్టర్‌ బీరం సుందరరావు ముందుగా అందరికి శుభకృత్‌ ఉగాది శుభాకాంక్షలు తెలియజేసి, వారి గురువుగారైన నాగభైరవ కొటేశ్వర రావు గారిని గుర్తు చేసు కున్నారు. మన నిత్య జీవితంలో ఒక ప్రశ్న వేసుకోవాలి, అది ఎంటంటే సినిమా ఎందుకు చూడాలి, సెల్‌ ఫోన్‌ ఎందుకు వాడాలి అని ప్రశ్నించుకుంటే, మనం పుస్తకం చదవడం కూడా అంతకంటే ప్రధానం అని తల్లిదండ్రులు గుర్తించాలని తెలియజేశారు. ధృశ్యం అంటే చూసి ఆనందించేదని, శ్రావ్యం అంటే విని ఆనందించేదని, ఈ రెండిరటి కలయికే పుస్తక పఠనం అని అన్నారు. పుస్తకం అనుభవాల సంపుటి, జ్ఞాన సంపుటి అని, తలిదండ్రులు పిల్లలకి పుస్తక పఠనం పట్ల ఆసక్తి పెంచాలని విజ్ఞప్తి చేశారు. మురళీ వెన్నం, డాక్టర్‌ తోటకూర ప్రసాద్‌, శ్రీకాంత్‌ పోలవరపు, లొకేష్‌ నాయుడు, నాగరాజు నలజుల, చినసత్యం వీర్నపు, లెనిన్‌ వీర మరియు తానా బృంద సభ్యులు గౌరవ అతిథులను పుష్పగుచ్చం, శాలువా, జ్ఞాపికలతో ఘనంగా సత్కరించారు.

ఈ కార్యక్రమం లో వందలాదిమంది పిల్లలకు తానా బృంద సభ్యులు బాల సాహిత్యం పుస్తకాలను, పెద్దలకు ఉపయోగ పడే అనేక పుస్తకాలను బహుమతులుగా అందించారు. డా. ప్రసాద్‌ తానా కళాశాలకు పునాది వేశారు అని, వారి ఆలోచన వల్ల ఎందరో ప్రవాసంలో వున్న నృత్య కళాకారులకు ఆ కార్యక్రమం ఉపయోగ పడుతుందని తెలియజేసి, ‘లాస్య సుధ డ్యాన్స్‌ అకాడెమి’ అధినేత్రి డా. సుధ కలవగుంట డా. ప్రసాద్‌ తోటకూర ను ఘనంగా సత్కరించారు. లోకేష్‌ నాయుడు, మురళీ వెన్నం, శ్రీకాంత్‌ పోలవరపు, డా. సుధా కలవగుంట, డా. ఊరిమిండి నరసింహారెడ్డి, సుబ్రమణ్యం జొన్నలగడ్డ, స్వర్ణ అట్లూరి, రాజేశ్వరి ఉదయగిరి, భాస్కర్‌ రాయవరం, డా. భానుమతి ఇవటూరి , లక్ష్మి పాలేటి, ఉమామహేశ్వరావు పార్నపల్లి (టాంటెక్స్‌ అధ్యక్షులు), వెంకట్‌ ములుకుట్ల, పరమేష్‌ దేవినేని, సాంబయ్య దొడ్డ, వెంకట ప్రమోద్‌,  కళ్యాణి తాడిమేటి, వీర లెనిన్‌, లెనిన్‌ వేముల, డా. అరుణ జ్యోతి, వెంకట్‌ తాడిబోయిన మొదలైన పలువురు పురప్రముఖులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. తానా పుస్తక మహోద్యపు దాతలకు, మైత్రి రెస్టారెంట్‌ అధినేత కు, వివిధ ప్రసార మాధ్యమాలకు, కమిటీ సభ్యులకు, స్వచ్ఛంద కార్యకర్తలకు చినసత్యం వీర్నపు ప్రత్యేక కృత్ఞతలు తెలియజేశారు.

 

Click here for Event Gallery

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :