Radha Spaces ASBL

తానా ఎన్నికలు - కోర్టు ముందర వివాదాలు... ఊపందుకోని ప్రచారాలు

తానా ఎన్నికలు - కోర్టు ముందర వివాదాలు... ఊపందుకోని ప్రచారాలు

తానా సంస్థ స్వభావ లక్షణాలు గురించి ఇదివరకు తెలుగుటైమ్స్‌లో ఒకసారి చెప్పిన విషయమే అయినా మళ్లీ గుర్తు చేసుకొని ఈ ఆర్టికల్‌ మొదలు పెడదాం. తానా సంస్థ స్వాభావికంగా, అంటే ఎక్కువ మంది ఫాలో అయ్యేలా తెలుగు దేశం పార్టీకి దగ్గరగా ఉన్నప్పటికీ, భౌతికంగా కాంగ్రెస్‌ పార్టీకి దగ్గరగా వుండే లక్షణాలతో పని చేస్తుంది. అంటే తానాలో కాంగ్రెస్‌  పార్టీలో లాగా మితి మీరిన ప్రజాస్వామ్య విధానాలు, ఎవరు ఎవరినన్నా ఆనగలిగే స్వతంత్రం, స్వేచ్ఛగా ప్రకటనలు చేసే అవకాశం వున్నాయి. అదే తానా బలం. అదే తానా బలహీనత కూడా.

అందుకే  తానా ఎన్నికలు అంటే అమెరికాలోని తెలుగువాళ్ళల్లో, తెలుగు రాష్ట్రాల్లో ఉన్న వారిలో ఓ ఆసక్తి కనిపించేది. ఎందుకంటే తానా సంస్థ ప్రభావం అలాంటిది. తానాలో నాయకునిగా ఎన్నికైతే ఆ నాయకునికి వారి ఊరిలో ఉండే క్రేజే వేరుగా ఉంటుందని చెప్పేవారు. తెలుగు రాష్ట్రాల రాజకీయ నాయకులతో సన్నిహిత సంబంధాలను తానాలో ఎన్నికైనవారు కొనసాగిస్తూ వస్తున్నారు. అందువల్లే తానా ఎన్నికల్లో నిలబడటానికి చాలామంది ఆసక్తిని చూపిస్తుంటారు.

గత సంవత్సరం 2021 జనవరి నుంచి మే వరకు జరిగిన తానా నాయకత్వ ఎన్నికలు అమెరికాలోనే కాక, తెలుగు రాష్ట్రాలలో కూడా సంచలనాన్ని కలిగించింది. తెలుగు రాష్టాలలో దిన పత్రికలు, టీవీ చానెళ్లు కూడా ఆ ఎన్నికల వేడి వేడి వార్తలను ఎప్పటికప్పుడు అందించాయి. ఇక సోషల్‌ మీడియాలో జరిగిన హడావిడి గురించి చెప్పనే అక్కరలేదు. అప్పుడు రెండు వర్గాలుగా తానా నాయకులు చీలిపోయి తమ తమ వర్గాన్ని గెలిపించుకునేందుకు అన్నీ ఊర్లలోనూ తిరుగుతూ సమావేశాలు పెట్టుకుంటూ చివరి నిముషం వరకు హామీలను గుప్పిస్తూ వచ్చారు. ఆ ఎన్నికలు చరిత్రను సృష్టించేలా సాగాయి. చివరకు తానాలో తమ మాటకు ఎదురులేదనుకునే పెద్దలకు ఓటమి ఎదురైంది. కొత్తతరం నాయకులు తానాలో అధికారంలోకి వచ్చారు. కాని తానాలో ప్రజాస్వామ్యం ఎక్కువగా ఉంటుంది కాబట్టి వచ్చిన కొత్తలోనే అధికారాన్ని చేజిక్కించుకున్న తానా నాయకుల్లో విభేదాలు వచ్చాయి. దాంతో ఆ వర్గం రెండు వర్గాలుగా విడిపోయింది.

ఇప్పుడు రెండు సంవత్సరాల తరువాత మళ్ళీ ఎన్నికలు వచ్చాయి. గతంలో రెండు వర్గాలు ఉంటే ఇప్పుడు మూడు వర్గాలు తానాలో కనిపిస్తున్నాయి. ప్రస్తుత అధ్యక్షుడు అంజయ్య వర్గం, కాబోయే అధ్యక్షుడు నిరంజన్‌ వర్గం, అధ్యక్ష అభ్యర్థి నరేన్‌ కొడాలి వర్గం కనిపిస్తోంది. ఈ ఎన్నికల్లో అంజయ్య వర్గం, నరేన్‌ కొడాలి వర్గం కలిపి పోటీ చేస్తోంది. నిరంజన్‌ వర్గం విడిగా పోటీ చేస్తోంది. నిరంజన్‌ వర్గానికి మాజీ అధ్యక్షుడు జయ్‌ తాళ్ళూరి మద్దతుగా ఉన్నారు.

అమెరికాలోని జాతీయ తెలుగు సంఘాల్లో తానాకు 4 దశాబ్దాలకు పైగా చరిత్ర ఉంది. ప్రపంచ తెలుగు సంఘాలకు మాతృసంస్థలా, కమ్యూనిటీకి పెద్దన్నలా తానా వ్యవహరిస్తుంటుంది. దాదాపు 40వేలమందికిపైగా సభ్యులు ఉన్న తానా  కోట్లాది రూపాయలను కమ్యూనిటీకోసం ఖర్చు చేస్తుంటుంది. అమెరికాలోని తెలుగు కమ్యూనిటీకి సేవ చేస్తూనే మరోవైపు తెలుగు రాష్ట్రాల్లోని ప్రజలకోసం కూడా అనేక సేవా కార్యక్రమాలను తానా నిర్వహిస్తుం టుంది. తానా ప్రతి రెండేళ్ళకోమారు నిర్వహించే మహాసభలు ప్రపంచం నలుమూలలా ఉన్న తెలుగువారితోపాటు ఎంతోమంది పెద్దలు, రాజకీయ నాయకులు, సాంస్కృతిక కళాకారులు, సినిమా కళాకారులు వస్తుంటారు.

తానా నిర్వహణను మూడు విభాగాలు చూస్తుంటాయి. కార్యనిర్వాహక వర్గం (ఎగ్జిక్యూటివ్‌ కమిటి), తానా ఫౌండేషన్‌, బోర్డ్‌ ఆఫ్‌ డైరెక్టర్స్‌ విభాగాలు తానా కార్యక్రమాలు సక్రమంగా, విజయవంతమయ్యేలా చేస్తాయి. అన్నీ సంఘాలకు జరిగినట్లుగానే తానాలో కూడా కీలకమైన ఎగ్జిక్యూటివ్‌ కమిటీ పదవులకు, తానా ఫౌండేషన్‌ ట్రస్టీ, బోర్డ్‌ ఆఫ్‌ డైరెక్టర్స పదవులకు ఎన్నికలు జరుగుతుంటాయి. 

 

మారిన పరిస్థితులు... వివాదాల వలన ఎన్నికలు సజావుగా జరిగేనా?

తానాలో ప్రస్తుతం జరుగుతున్న ఎన్నికలు గతంలో జరిగిన దానికన్నా విభిన్నంగా జరుగుతున్నాయి. ఎందుకంటే ఇప్పుడు ఎన్నికల షెడ్యూల్‌ ప్రకటించినా అభ్యర్థుల లిస్ట్‌ వచ్చినా ఎన్నికల వేడి కనిపించడం లేదు. దీనికి ముఖ్య కారణం కోర్టు తగాదాలే.

తానాలో గత సంవత్సరం కొత్తగా వేలాదిమంది తానా సభ్యత్వాన్ని తీసుకున్నారు. అందులో 2021లో కేవలం 2-3 నెలల వ్యవధిలో దాదాపుగా 16500 మందికి పైగా సభ్యులు కొత్తగా తానా సభ్యత్వం కోసం దరఖాస్తులు చేసుకున్నారు. తానాలో ఉన్న వర్గాలు పోటీపడి సభ్యత్వాలను చేర్పించాయి. దానికితోడు గత ఎన్నికల్లో ఓటమి చెందిన వర్గం నాయకులు భారీగా డబ్బులు ఖర్చు పెట్టి నూతన సభ్యులను చేర్పించారని చెబుతున్నారు. మరో వర్గం కూడా వచ్చే ఎన్నికల్లో తమ మెజారిటీ తగ్గకూడదన్న ఉద్దేశ్యంతో తాను కూడా సభ్యులను చేర్పించింది అని కూడా చెపుతున్నారు.  రాజ్యాంగం ప్రకారం సభ్యత్వ ధృవీకరణ కమిటీ నిర్ణీత సమయంలో అంటే ఏప్రిల్‌ 30 2022 లోపు, సభ్యుల దరఖాస్తులను పరిశీలించి సభ్యుల నమోదు ప్రక్రియను పూర్తి చేయవలసి ఉంటుంది. చాలా పెద్ద సంఖ్యలో దరఖాస్తులు రావటం వలన నిర్ణీత సమయంలో కొత్త సభ్యుల పరిశీలనలు జరగలేదు. ఆమోదం పొందకపోవటం వెనుక కుట్ర ఉందని కొత్త సభ్యులకు అన్యాయం జరిగిందని నరేన్‌ వర్గం ఆరోపించింది. దానిపై నిరంజన్‌ వర్గం ఇందులో తమ తప్పు ఏమీ లేదని వేలాదిమంది జాబితాను పరిశీలించడం కమిటీలో ఉన్న ముగ్గురి వల్ల సాధ్యం కాకపోవడం వల్లనే నిర్ణీత గడువులోగా వారికి ఓటు హక్కు కల్పించలేక పోయామని చెబుతోంది.

ఈ విషయంపై రెండు వర్గాలు పట్టు బిగించడంతో ఈ వివాదం చిలికి చిలికి పెద్ద వివాదంగా మారింది. దానికితోడు నరేన్‌ వర్గానికి తోడుగా అంజయ్య వర్గం ఇసి మీటింగ్‌లో వారికి ఓటు హక్కు కల్పించాలని తీర్మానించి బోర్డుకు పంపింది. దీంతో తానా బోర్డు ఈ విషయమై సమావేశాన్ని ఏర్పాటు చేసి చర్చించింది. అయితే బ్కెలాస్‌ను ఎప్పుటికప్పుడు మార్చడం సబబుగా ఉండదని సీనియర్లు భావించారు. కొత్తగా చేరిన దాదాపు 33000 ఓటర్లు (సాధారణంగా ఒక లైఫ్‌ మెంబెర్‌ -ఆయన సతీమణితో ఇద్దరికి ఓటు హక్కు వస్తుంది) ఓటింగ్‌ హక్కు కల్పించేలా బ్కెలాస్‌లో మార్పులు చేయాలని కోరింది. దీనిపై ఓటింగ్‌ జరిగింది. 15 మంది సభ్యుల బోర్డులో ఇద్దరు సీనియర్‌ సభ్యులు తటస్థంగా ఉండటంతో 7-6తో తీర్మానం వీగిపోయింది. కొత్తగా చేరిన సభ్యులు తానా కార్యక్రమాలలో అన్ని విధాలుగా పాల్గొనవచ్చు గాని ఈ టర్మ్‌కి మాత్రం  వారికీ వోట్‌ హక్కు ఉండదు అని నిర్ణయించటం జరిగింది

కొత్త సభ్యులు చేరిక సబబు ఏనా?

ూబతీట జుఞవశ్రీ వాళ్ళు ‘మరక మంచిదే’ అని వ్యాపార ప్రకటన చేస్తూ వుంటారు. అలాగే కారణాలు ఏవి అయినా, అవలంభించిన విధానం ఏదైనా, 2- 3 నెలల వ్యవధిలో దాదాపు 33,000 మంది సభ్యులను తానా సంస్థలో చూపించటం అభినందనీయం అని చాలా మంది అంటున్నారు. అంతే కాదు తానా సంస్థకి దాదాపు వి 200,000 ఆదాయం వచ్చింది కదా. అటువంటి పరిస్థితులలో సభ్యులు తమ డబ్భులతో సభ్యత్వం తీసుకున్నారా? వారిని ఎవరైనా స్పాన్సర్‌ చేసి చేర్పించారా? అని తగాదా పడటం అనవసరం అనే వారు కూడా వున్నారు. ఈ వ్యవహారంపై తానా బోర్డు చాలా వివరంగా చర్చించి మరి ఎలాంటి కొనసాగింపు కార్యక్రమాలు చేయకూడదని నిర్ణయించటం కూడా జరిగింది. తానా ప్రస్తుత బైలాస్‌ ప్రకారం కొత్తగా చేరిన సభ్యులకు ఓటు హక్కు తరువాత సంవత్సరం లో వస్తుంది అని ఉండటం వలన ఇరు వర్గాలు తమ తమ అభిప్రాయాలతో వున్నారు.

కోర్టు ఏమంటుంది?

ఏప్రిల్‌ 3వ తేదీన మెంబర్‌షిప్‌ గొడవపై కోర్టులో ఫైనల్‌ హియరింగ్‌ -ఆర్బిట్రేషన్‌ జరగనున్నది. ఆరోజు ఏమి జరుగుతుందన్న దానిపై తానా నాయకులతోపాటు సభ్యులు కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఒకవేళ కోర్టు కేసు వేసినవారు తమ కేసును ఎవరికి వారుగా విత్‌ డ్రా చేసుకొంటున్నారు కనుక కోర్టు ఈ విషయంలో జోక్యం చేసుకోదని ఒక అభిప్రాయం చెపుతున్నారు. లేదా కోర్ట్‌ దీనిపై తనంతట తానే ఏదో ఒక నిర్ణయం తీసుకుని జడ్జిమెంట్‌ ఇవ్వవచ్చు. అప్పుడు కొత్తగా చేరిన వాళ్ళందరికీ ఓటు హక్కు ఇవ్వాలి లేదా వద్దు అనే విషయమై తీర్పు కూడా ఇవ్వవచ్చు. కోర్టు తీర్పును తానా బోర్డు అమలు చేయక తప్పదు. దాంతో ఇప్పుడు అందరి దృష్టి కోర్టు ఇచ్చే తీర్పుపై ఉంది. 

ఒకవేళ పాతమెంబర్లతోనే ఎన్నికలకు వెళ్ళవచ్చు నని అనుకుంటే ఎన్నికలు సరైన సమయంలోనే (జనవరిలో ఇచ్చిన ఎన్నికల ప్రణాళిక ప్రకారం ఏప్రిల్‌ 22తో ఈ కార్యక్రమం ముగిసిపోవాలి) నిర్వహించడానికి వీలవుతుంది. ఒకవేళ కొత్త మెంబర్లకు కూడా వోటింగ్‌ హక్కు ఇస్తున్నట్లు తీర్పు వస్తే మాత్రం ఎన్నికల నిర్వహణకు ఇంకో నెలరోజులకుపైగా సమయం పట్టవచ్చు. ఎన్నికల తేదీలు మారిపోతాయి. అందువల్లనే అభ్యర్థులు కూడా ఏప్రిల్‌ 3వ తేదీ వరకు పెద్దగా ప్రచారంపై దృష్టి పెట్టలేదు. తరువాతనే తమ ప్రచారవ్యూహాలను ప్రకటించనున్నారు. పలువురు అభ్యర్థులు తమ ఎన్నికల ప్రచారం ఏప్రిల్‌ 3వ తరువాత ముమ్మురం చేస్తామని చెపుతున్నారంటే ఆ తేదీల్లో వచ్చే జడ్జిమెంట్‌ కోసం వారు ఎంతగా ఎదురు చూస్తున్నారన్న విషయం అర్థమవుతుంది.

ఈసారి నుంచి ఎలక్ట్రానిక్‌ వోటింగ్‌ 

తానా ఎన్నికల నిర్వహణలో బాలేట్‌ పేపర్‌లు తానా సభ్యులందరికీ పంపటం, సభ్యులు వోట్‌ వేసి తిరిగి వెనక్కి పంపటం, నిర్ణయించిన రోజున ఆ బాలేట్‌ పేపర్లు లెక్క కట్టి అభ్యర్థుల గెలుపు- ఓటములు నిర్ణయించటం జరుగుతుంది. ఇది చాల శ్రమతో, ఖర్చుతో కూడుకున్న పని అని అందరికి తెలిసినా అనేక సంవత్సరాలుగా ఈ పద్దతిప్రకారమే జరుగుతోంది. సభ్యుల అడ్రస్‌లు మారటం, బాలేట్‌ పేపర్లు వారికి అందకపోవటం ఒక సమస్య అయితే, సభ్యుల నుంచి బాలే పేపర్లు తెప్పించు కోవటం కూడా ఒక సమస్య.   ఆ సమస్యను అధికమిస్తూ, అభ్యర్థులు, లేదా వారి మనుషులు సభ్యుల నుంచి బాలట్‌ పేపర్లు తీసుకొని ఎన్నికల కార్యాలయానికి పంపటం కూడా చేస్తూ ఉండేవారు. ఆ పద్దతి కూడా తప్పు అని అభ్యంతరం చెప్పే వాళ్ళు కూడా వున్నారు.

ఈ సారి తానా ఎన్నికలు ఎలక్ట్రానిక్‌ వోటింగ్‌ ద్వారా జరుగుతాయని తెలిసింది. ప్రతి సభ్యునికి ఎన్నికల నిర్వహణ కార్యాలయం నుంచి ఒక కోడ్‌ ఆ సభ్యుని ఇమెయిల్‌కి పంపుతారు (ఇమెయిల్‌ లేని సభ్యులకు పోస్ట్‌లో పంపుతారు) ఆ కోడ్‌ నెంబర్‌ వాడుతూ, ప్రతి సభ్యుడు తన వోట్‌ హక్కు వినియోగించుకొని వోట్‌ వేస్తారు అన్నమాట. ఇది ఒక శుభ పరిణామమే!

 

praneet praneet praneet obili-garuda

ఎన్నికల ప్రకటన

తానాకు ప్రతి రెండేళ్శకోమారు ఎన్నికలు నిర్వహించాలన్న బైలాస్‌ ప్రకారం ఈ సంవత్సరం ఎన్నికలను నిర్వహించేందుకు బోర్డ్‌ ఏర్పాట్లను చేసింది. అందులో భాగంగా ఎన్నికల కమిటీ ద్వారా ఎన్నికల షెడ్యూల్‌ను విడుదల చేయించింది. ఎన్నికల ప్రకటన విడుదల చేయిస్తూనే కోర్టు తీర్పునకు అనుగుణంగా మార్పులు కూడా ఉండవచ్చని పేర్కొంది. ఎన్నికల ప్రకటన వెలువడిన వెంటనే నరేన్‌ కొడాలి వర్గం, అంజయ్య వర్గం కలిసి తమ అభ్యర్థులను ప్రకటించింది. మరోవైపు జయ్‌ తాళ్ళూరి వర్గం కూడా తమ అభ్యర్థులను ప్రకటించింది.

అభ్యర్థులు వీరే...

ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) ఎన్నికల్లో పోటీ పడే అభ్యర్థుల వివరాలను ఎన్నికల కమిటీ ప్రకటించింది. ఎగ్జిక్యూటివ్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ పదవికి డా. నరేన్‌ కొడాలి, గోగినేని శ్రీనివాస పోటీ పడుతున్నారు. తానా కార్యదర్శి పదవికి రాజా కసుకుర్తి, అశోక్‌బాబు కొల్లా పోటీ పడుతున్నారు. ట్రజరర్‌ పదవికి భరత్‌ మద్దినేని, శిరీష తూనుగుంట్ల పోటీ పడుతున్నారు. జాయింట్‌ సెక్రటరీ పదవికి వెంకట్‌ కోగంటి, శ్రీని యలవర్తి పోటీ పడుతున్నారు. జాయింట్‌ ట్రెజరర్‌ పదవికి సునీల్‌ పంత్ర, రజనీకాంత్‌ కాకర్ల పోటీ పడుతున్నారు.

*  కమ్యూనిటీ సర్వీస్‌ కో ఆర్డినేటర్‌ పదవికి లోకేష్‌ కొణిదెల, వాసిరెడ్డి వంశీకృష్ణ, కల్చరల్‌ సర్వీస్‌ కో ఆర్డినేటర్‌ పదవికి ఉమ ఆర్‌ కటికి, మాధురి ఎల్లూరి, ఉమెన్‌ సర్వీసెస్‌ కో ఆర్డినేటర్‌ పదవికి రజని ఆకురతి, భోగవల్లి పద్మ పోటీ పడుతున్నారు. కౌన్సిలర్‌ ఎట్‌ లార్జ్‌ పదవికి సతీష్‌ కొమ్మన, సతీష్‌ పునటి, ఇంటర్నేషనల్‌ కో ఆర్డినేటర్‌ పదవికి ఠాగూర్‌ మలినేని, శశాంక్‌ యార్లగడ్డ పోటీ పడుతున్నారు. స్పోర్ట్స్‌ కో ఆర్డినేటర్‌ పదవికి శ్రీధర్‌ కుమార్‌ కొమ్మాలపాటి, నాగమల్లేశ్వర రావు పంచుమర్తి పోటీ పడుతున్నారు.

*  తానాలోని ఫౌండేషన్‌, బోర్డ్‌ పదవులకు పోటీ తీవ్రంగా కనిపిస్తోంది.
*  బోర్డ్‌ డైరెక్టర్‌ పదవులకు నరేన్‌ కొడాలి ప్యానల్‌ నుంచి శ్రీనివాస్‌ లావు, రవి పొట్లూరి, డా. ప్రసాద్‌ నల్లూరి, రవి మందలపు పోటీ పడుతున్నారు.
*  ఫౌండేషన్‌ పదవులకు నరేన్‌ వర్గం నుంచి హేమ కానూరు, భక్త బల్లా, శ్రీనివాస్‌ ఎండూరి, శ్రీనివాస్‌ కూకట్ల పోటీ పడుతున్నారు.
*  శ్రీనివాస గోగినేని వర్గం నుంచి బోర్డ్‌ పదవులకు వెంకటరమణ యార్లగడ్డ, మురళీ తాళ్ళూరి, శ్రీనివాస్‌ ఉయ్యూరు పోటీ పడుతున్నారు.
*  ఫౌండేషన్‌ పదవులకు రవిసామినేని, సుమంత్‌ రామ్‌ సెట్టి, దినేష్‌ త్రిపురనేని, రాంప్రసాద్‌ చిలుకూరి, లక్ష్మణ్‌ పర్వతనేని పోటీ పడుతున్నారు.
*  రీజినల్‌ రిప్రజెంటేటివ్‌ పదవులకు రెండు వర్గాల నుంచి పలువురు పోటీ పడుతున్నారు.

నరేన్‌ కొడాలి

ప్రస్తుత తానా ఎన్నికల్లో అధ్యక్ష పదవికి నరేన్‌ కొడాలి పోటీ చేస్తున్నారు. వృత్తిరీత్యా ప్రొఫెసర్‌ అయిన నరేన్‌ కొడాలికి తానాతో మంచి అనుబంధం ఉంది. తానాలో వివిధ పదవులను ఆయన చేపట్టారు. 2003-2005 వరకు కో-చైర్‌, వెబ్‌, ఐటి సపోర్ట్‌, 2005-2007: కో-చైర్‌, తానా ఐటి కమిటీ, 2006-2007: ఆపరేటింగ్‌ కమిటీ, 16వ తానా కాన్ఫరెన్స్‌, 2006-2007: చైర్‌, కాన్ఫరెన్స్‌ వెబ్‌ కమిటీ, 2007-2011: చైర్‌, తానా వెబ్‌ కమిటీ, 2009-2013: డైరెక్టర్‌, తానా బోర్డ్‌ ఆఫ్‌ డైరెక్టర్స్‌, 2011-2013: సెక్రటరీ, తానా బోర్డ్‌ ఆఫ్‌ డైరెక్టర్స్‌, 2013-2017: డైరెక్టర్‌, తానా బోర్డ్‌ ఆఫ్‌ డైరెక్టర్స్‌, 2013-2015 సెక్రటరీ, తానా బోర్డ్‌ ఆఫ్‌ డైరెక్టర్స్‌, 2013-2015: చైర్మన్‌, తానా బోర్డ్‌ ఆఫ్‌ డైరెక్టర్స్‌, 2013-2015: సభ్యుడు, తానా బైలాస్‌ కమిటీ, 2013-2015: సభ్యుడు, తానా మెంబర్‌షిప్‌ వెరిఫికేషన్‌ కమిటీ, 2013-2015: సభ్యుడు, తానా ఇన్వెస్ట్‌మెంట్‌ కమిటీ 2016-2017: లీగల్‌ లైజన్‌, తానా బోర్డ్‌ ఆఫ్‌ డైరెక్టర్స్‌, 2017-2019: చైర్‌, తానా బిల్డింగ్‌ కమిటీ, 2018-2019: చైర్మన్‌, 22వ తానా మహాసభలు, 2018-2019: కమ్యూనికేషన్స్‌ మరియు ఐటి సపోర్ట్‌, 2019-2021: కో-చైర్‌ తానా బిల్డింగ్‌ కమిటీ, 2021-2023: అంకితమైన తానా వాలంటీర్‌గా ఉంటూ ప్రస్తుతం తానా అధ్యక్ష పదవికి పోటీ చేస్తున్నారు. గత ఎన్నికల్లో కూడా ఆయన తానా అధ్యక్ష అభ్యర్థి పదవికి పోటీ పడ్డారు. 

ఈసారి జరిగే ఎన్నికల్లో తన విజయం ఖాయమని ఆయన ధీమాగా ఉన్నారు. గత ఎన్నికల్లో ఓటమి తరువాత ఈసారి ఎన్నికలకోసం అప్పటి నుంచే ఆయన కసరత్తును మొదలెట్టారు. తానాలో సుదీర్ఘకాలం నిర్వహించిన పదవుల ద్వారా ఉన్న అనుబంధాన్ని ఈసారి ఓటుగా మలిచేందుకు కృషి చేస్తున్నారు. విధేయత, విశ్వసనీయత ప్రభావవంత మైన సేవ పేరుతో ఆయన ఎన్నికల్లో దిగారు. ప్రస్తుత అధ్యక్షుడు అంజయ్య చౌదరి మద్దతుతో ఆయన ఎన్నికలను ఎదుర్కొంటున్నారు. తన టీమ్‌ను ఎంపిక చేసుకుని టీమ్‌ కొడాలి పేరుతో రంగంలోకి దిగారు.

శ్రీనివాస గోగినేని

తానాలో ప్రస్తుతం జరుగుతున్న ఎన్నికల్లో తానా అధ్యక్ష అభ్యర్థిగా శ్రీనివాస గోగినేని పోటీ చేస్తున్నారు. ప్రస్తుతం వైస్‌ ప్రెసిడెంట్‌గా, కాబోయే అధ్యక్షుడు నిరంజన్‌ శృంగవరపు ప్యానెల్‌ నుంచి అధ్యక్ష అభ్యర్థిగా ఆయన పోటీ చేస్తుండటం విశేషం. గతంలో జరిగిన ఎన్నికల్లో కూడా ఆయన అధ్యక్ష పదవికి స్వతంత్రంగా పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ఈసారి ఎలాగైనా గెలవాలని నిరంజన్‌ వర్గం మద్దతుతో ఎన్నికల బరిలోకి దిగారు. తానాలో వివిధ పదవులను ఆయన చేపట్టిన అనుభవం, అందరితో కలిసిమెలిసిపోయే గుణంతో తాను గెలవడం ఖాయమన్న ధీమాలో ఉన్నారు.  తానా ఫౌండేషన్‌ చైర్మన్‌ 2015-17, బోర్డు సభ్యుడు 2015-17, ఇసి సభ్యుడు 2015-17, తానా బైలాస్‌ కమిటీ సభ్యుడు, 2015 డిట్రాయిట్‌లో జరిగిన తానా మహాసభలకు సెక్రటరీగా, 2013-15లో ఫౌండేషన్‌ సెక్రటరీగా, 2011-13లో ఫౌండేషన్‌ ట్రెజరర్‌గా, 2009`11లో ఫౌండేషన్‌ జాయింట్‌ సెక్రటరీగా, 2011లో బోర్డ్‌ మెంబర్‌గా కూడా పనిచేశారు. ఇలా ఎన్నో పదవులను చేపట్టిన శ్రీనివాస గోగినేని 5కె కార్యక్రమం ద్వారా పాపులర్‌ అయ్యారు. ఇప్పుడు జరుగుతున్న ఎన్నికల్లో గెలుపుతనదేనని ధీమా వ్యక్తం చేస్తూ, నిరంజన్‌ టీమ్‌తో కలిసి ఎన్నికల బరిలోకి దిగారు. ఆయనకు తానా మాజీ అధ్యక్షుడు జయ్‌ తాళ్ళూరి మద్దతును ప్రకటించారు.

 

 

Vertex poulomi Png-jewelry
Tags :