Radha Spaces ASBL

టాలీవుడ్‌పై కేసీఆర్ బ్రహ్మాస్త్రం! దెబ్బకు హీరోలు దిగిరాక తప్పదా?

టాలీవుడ్‌పై కేసీఆర్ బ్రహ్మాస్త్రం! దెబ్బకు హీరోలు దిగిరాక తప్పదా?

సెప్టెంబర్ 2, శుక్రవారం బ్రహ్మాస్త్ర ప్రీరిలీజ్ ఈవెంట్‌ను రామోజీ ఫిల్మ్ సిటీలో గ్రాండ్‌గా నిర్వహించేందుకు ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి. బ్రహ్మాస్త్ర మూవీని దక్షిణాది రాష్ట్రాల్లో దిగ్గజ దర్శకుడు రాజమౌళి స్పాన్సర్ చేస్తున్నారు. జూనియర్ ఎన్టీఆర్ ఈ ఈవెంట్‌కు చీఫ్ గెస్ట్. ఆయన అభిమానులు కూడా పెద్ద ఎత్తున అప్పటికే రామోజీ ఫిలింసిటీకి చేరుకున్నారు. హీరో హీరోయిన్లు రణబీర్ కపూర్, ఆలియా భట్ ఎయిర్ పోర్టులో దిగి రామోజీ ఫిలిం సిటీకి వెళ్లేందుకు సిద్ధమవుతుండగా ఈవెంట్ క్యాన్సిల్ అయినట్లు ప్రకటించారు. అసలు ఏం జరిగిందో, ఎందుకు క్యాన్సిల్ అయిందో ఎవరికీ అర్థం కాలేదు. అయితే కాసేపటికే పార్క్ హయత్ హోటల్లో మూవీ టీం ప్రెస్ మీట్ ఉంటుందని ఈవెంట్ నిర్వాహకులు ప్రకటించారు. దీంతో అందరూ పార్క్ హయత్ కు పరుగులు తీశారు.

ప్రీరిలీజ్ ఈవెంట్‌కు పోలీసులు చివరి నిమిషంలో అనుమతి నిరాకరించడం వల్లే రద్దయిందని తర్వాత తెలిసింది. నాలుగురోజుల క్రితమే పోలీసులకు రూట్ మ్యాప్ ఇచ్చామని, అప్పుడు అనుమతించి ఇప్పుడు రద్దు చేశారని రాజమౌళి ప్రెస్ మీట్లో కూడా ప్రకటించారు. ఒకవిధంగా చెప్పాలంటే బ్రహ్మాస్త్ర ప్రీరిలీజ్ ఈవెంట్ ను ఎందుకు రద్దు చేశారో అప్పటివరకూ టీమ్ కు కూడా అర్థం కాలేదు. తెల్లారిన తర్వాత తెరవెనుక ఏం జరిగిందో తెలిసొచ్చింది.

తెలంగాణపై బీజేపీ ప్రత్యేక దృష్టి పెట్టిందనే విషయం తెలిసిందే. అమిత్ షా, నడ్డా లాంటి నేతలు ప్రతి నెలా తెలంగాణలో పర్యటిస్తూ ఇక్కడ కాక పుట్టిస్తున్నారు. తెలంగాణకు వచ్చిన ప్రతిసారీ ఇక్కడ పలువురు ప్రముఖులను కలుస్తున్నారు. అందులో భాగంగా ఇటీవల అమిత్ షా హైదరాబాద్ వచ్చినప్పుడు జూనియర్ ఎన్టీఆర్‌తో భేటీ అయ్యారు. ఆయనతో కలిసి డిన్నర్ చేశారు. ఆ తర్వాత బీజేపీ అధ్యక్షుడు నడ్డా వచ్చి టాలీవుడ్ హీరో నితిన్ తో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. అంతకుముందు.. రాజమౌళి తండ్రి, సినీ రచయిత విజయేంద్ర ప్రసాద్ ను కేంద్ర ప్రభుత్వం రాజ్యసభకు నామినేట్ చేసింది. ఇలా అడపాదడపా పలువురు టాలీవుడ్ ప్రముఖులు బీజేపీతో అంటకాగుతున్నారు. ఇది టీఆర్ఎస్ కు ఏమాత్రం మింగుడుపడలేదు.

ఆంధ్రప్రదేశ్ విడిపోయాక టాలీవుడ్ ఎలా తయారవుతుందోననే ఆందోళనలు తలెత్తాయి. అయితే తెలంగాణ ఏర్పడిన తర్వాత టీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్.. టాలీవుడ్ హీరోలు, దర్శకులు, నిర్మాతల మాటలను ఎప్పుడూ కాదనకుండా వరాలిచ్చారు. సినీరంగ సమస్యల పరిష్కారానికి ఏం కావాలన్నా చేసేందుకు సిద్ధంగా ఉన్నట్టు ప్రకటించారు. అందుకు అనుగుణంగానే దర్శకులు కానీ, నిర్మాతలు కానీ, హీరోలు కానీ ఏదైనా సమస్యతో కేసీఆర్ లేదా కేటీఆర్ దగ్గరకు వెళ్తే.. సానుకూలంగా స్పందించి పరిష్కరించారు. కేసీఆర్, కేటీఆర్, తలసాని శ్రీనివాసయాదవ్ లాంటి పెద్దలు సినీ రంగానికి ఎంతో చేస్తున్నారని పలు వేదికల్లో హీరోలు, దర్శకులు, నిర్మాతలు కొనియాడారు. అయితే ఇప్పుడు సీన్ రివర్స్ అయింది.

కరోనా తర్వాత టాలీవుడ్ తీవ్ర ఇబ్బందుల్లో పడింది. భారీ బడ్జెట్ సినిమాలకు టికెట్ రేట్లు పెంచకపోతే గిట్టుబాటు కాదని నిర్మాతలు ఆందోళన వ్యక్తం చేశారు. దీంతో ప్రభుత్వాలను కలిసి టికెట్ రేట్లు పెంచుకునేందుకు, అదనపు షోలు వేసుకునేందుకు అనుమతించాల్సిందిగా కోరాలని నిర్ణయించారు. వెంటనే కేటీఆర్, తలసాని శ్రీనివాసయాదవ్ తదితరులను కలిసి రిక్వస్ట్ చేశారు. వాళ్లు అడిగిందే తడవుగా ప్రభుత్వం అనుమతులు ఇచ్చేసింది. అదే ఆంధ్రప్రదేశ్ లో టికెట్ రేట్లు పెంచుకునేందుకు, అదనపు షోలు వేసుకునేందుకు అనుమతి లభించలేదు. దీంతో చిరంజీవి, మహేశ్ బాబు, ప్రభాస్, రాజమౌళి లాంటి పెద్దలు వెళ్లి స్వయంగా సీఎంను కలవాల్సి వచ్చింది. అయినా అదనపు షోలకు అనుమతి దొరకలేదు. తెలంగాణ మాత్రం సినీరంగం ఏది అడిగినా వెంటనే చేసేస్తోంది.

నందమూరి హరికృష్ణ చనిపోయినప్పుడు హైదరాబాద్ లో ఆయన అంత్యక్రియలకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించాలని కేసీఆర్ ఆదేశించారు. దీంతో మంత్రి కేటీఆర్ ఉదయం నుంచి హరికృష్ణ నివాసం వద్దే ఉండి అన్ని ఏర్పాట్లూ పర్యవేక్షించారు. తలసాని శ్రీనివాస్ యాదవ్ కూడా అక్కడే ఉన్నారు. ఇంతలో అప్పటి ఏపీ మంత్రి పేర్ని నాని అక్కడికి వచ్చారు. దీంతో అక్కడున్న సినీరంగ ప్రముఖులంతా కేటీఆర్, తలసాని శ్రీనివాసయాదవ్ లను వదిలేసి పేర్ని నానికి ఎదురేగి అక్కడ వాలిపోయారు. ఇది తలసాని, కేటీఆర్ మైండ్ లో ఉండిపోయింది. తలసాని శ్రీనివాసయాదవ్ హర్ట్ అయ్యారని తెలుసుకున్న టాలీవుడ్ పెద్దలు మరుసటిరోజే తలసానిని కలసి కాళ్లబేరానికొచ్చారు.

ఇలాంటి తప్పులు టాలీవుడ్ పెద్దలు చాలానే చేశారు. అయినా మన్నిస్తూ వచ్చింది తెలంగాణ ప్రభుత్వం. టాలీవుడ్ కు హైదరాబాద్ కేంద్ర బిందువు కాబట్టి ఆ పేరు చెడగొట్టుకోకూడదనేది కేసీఆర్ వ్యూహం. దాంతో వాళ్లకు ఏ కష్టమొచ్చినా తానున్నానంటూ అభయహస్తం అందిస్తూ వచ్చారు. మరోవైపు ఏపీలో టాలీవుడ్ ప్రముఖులకు అడుగడుగునా అవమానాలే ఎదురయ్యాయి. వాళ్ల కోరికలకు అక్కడ పప్పులుడకలేదు.

తెలంగాణలో పాగా వేసేందుకు బీజేపీ శతవిధాలా ప్రయత్నిస్తోంది. ఇందుకోసం టాలీవుడ్ పై కన్నేసి అడపాదడపా వారిని గోకుతోంది. తెలిసో తెలియకో కొంతమంది ఆ ఉచ్చులో పడిపోయారు. జూనియర్ ఎన్టీఆర్, నితిన్, రాజమౌళి, విజయేంద్ర ప్రసాద్ లాంటివాళ్లు బీజేపీకి అనుకూలంగా ఉన్నారనే ఫీలింగ్ కలుగుతోంది. బీజేపీ నేతలే ఈ విషయాలను బహిరంగంగా ప్రకటిస్తున్నారు. బీజేపీ ప్రకటనలపై అటు జూనియర్ ఎన్టీఆర్ కానీ, నితిన్ కానీ స్పందించలేదు. దీంతో బీజేపీ నేతల మాటలు నిజమేననే భావన కలుగుతోంది.

సినిమాల ద్వారా హిందూత్వ నినాదాన్ని జనంలోకి తీసుకెళ్లేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని కేటీఆర్ గతంలోనే ట్వీట్ చేశారు. కశ్మీర్ ఫైల్స్, బ్రహ్మాస్త్ర, ఆదిపురుష్, కార్తికేయ2 లాంటివి ఈ కోవలోకే వస్తాయి. ఇలాంటి వాటిని ఆదిలోనే అడ్డుకోకపోతే భవిష్యత్తులో ఇబ్బందులు తప్పవని భావించిన ప్రభుత్వం.. టాలీవుడ్ కు తమ దెబ్బ చూపించాలనే నిర్ణయానికి వచ్చింది. వెంటనే బ్రహ్మాస్త్ర ప్రీరిలీజ్ ఈవెంట్ కు అనుమతులు నిరాకరించింది. ఈ ఈవెంట్ రద్దు వెనుక ఉన్న చరిత్ర ఇదీ. మరి టాలీవుడ్ ఇప్పటికైనా మేల్కొంటుందో లేదో చూడాలి.

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :