Radha Spaces ASBL

అదో తుత్తి..! రాజకీయానందంలో చిరంజీవి..!!

అదో తుత్తి..! రాజకీయానందంలో చిరంజీవి..!!

చిరంజీవి.. వెండితెరపై మెగాస్టార్.! ఎన్టీఆర్, ఏఎన్నార్ తర్వాత మెగాస్టార్ దే చిత్రసీమ. సినీరంగంలో తిరుగులేని రారాజుగా వెలుగొందుతున్న సమయంలోనే ఆయన రాజకీయాల్లోకి అడుగు పెట్టారు. ప్రజారాజ్యం అనే రాజకీయ పార్టీ పెట్టి తన అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. అధికారం దక్కలేదు. 18 మంది ఎమ్మెల్యేలను గెలిపించుకుని కాంగ్రెస్ పార్టీలో పార్టీలో విలీనం చేసేశారు. కేంద్రంలో రాజ్యసభ సభ్యత్వం పొందారు. కేంద్రంలో మంత్రి పదవీ పొందారు.. రాష్ట్రం విడిపోయింది. కాంగ్రెస్ పార్టీ పతనమైంది. చిరంజీవి కూడా ఆ పార్టీలో యాక్టివ్ గా లేకుండా మళ్లీ సినిమాల్లో బిజీ అయిపోయారు.

రాజకీయాలకు నేను దూరం అయ్యానేమో కానీ.. రాజకీయం నా నుంచి దూరం కాలేదు.. అనే డైలాగ్ ఈ మధ్య బాగా వైరల్ అయింది. చిరంజీవి తన ట్విట్టర్ వేదికగా ఈ డైలాగ్ ను వదిలారు. ఆయన మళ్లీ రాజకీయాల్లోకి రాబోతున్నారని.. తమ్ముడు పవన్ కల్యాణ్ పార్టీలో యాక్టివ్ రోల్ పోషించబోతున్నారని ప్రచారం జోరుగా సాగింది. మరోవైపు వైసీపీ చిరంజీవిని రాజ్యసభకు పంపబోతోందని.. తద్వారా తమ్ముడు పవన్ కు చెక్ పెట్టబోతోందనే టాక్ కూడా వచ్చింది. అయితే అది తాను నటించిన గాడ్ ఫాదర్ సినిమాలోని డైలాగ్ అని తర్వాత తేలింది. చిరంజీవి మళ్లీ రాజకీయాల్లోకి రావడం ఊహాగానమేనని స్పష్టమైంది. అయితే చిరంజీవిపై సోషల్ మీడియాలో జరిగిన ప్రచారం మాత్రం మెగాస్టార్ ను ఉబ్బితబ్బిబ్బయ్యేలా చేసింది. తన డైలాగ్ ఇంత ప్రకంపనలు సృష్టిస్తుంది అని అనుకోలేదన్నారు చిరంజీవి.

డైలాగ్ లో చెప్పినట్టు చిరంజీవి రాజకీయాలకు దూరమయ్యారేమో కానీ రాజకీయాన్ని మాత్రం తన నుంచి దూరం చేసుకోలేకపోతున్నారనిపిస్తోంది. తను సినిమాల్లో ఉన్నా, పాలిటిక్స్ లో లేకున్నా తానొక లీడర్ ననే ఫీలింగ్ లోనే ఉన్నారు. తన చుట్టూ ఉన్నవాళ్లంతే తనను అలాగే చూడాలనే ఫీలింగ్ లో ఉన్నట్టు కనిపిస్తున్నారు. ఈ మధ్యకాలంలో జరిగిన పలు సినిమా ఫంక్షన్లలో చిరంజీవి ఇండస్ట్రీకి పెద్ద అని పలువురు పొగిడారు. టికెట్ రేట్ల విషయంలో సీఎం జగన్ దగ్గరకు ఇండస్ట్రీ ప్రముఖులను తీసుకెళ్లి సమస్యను పరిష్కరించారని మెగాస్టార్ ను ఆకాశానికెత్తేశారు. దీంతో చిరంజీవి తనకు తిరుగులేదనుకున్నారు. సినిమా ఇండస్ట్రీకి తానే పెద్ద దిక్కు అని సంబరపడ్డారు.

ఇప్పుడు తన గాడ్ ఫాదర్ సినిమా ప్రమోషన్స్ లో చిరంజీవి బిజీగా ఉన్నారు. గాడ్ ఫాదర్ ప్రీరిలీజ్ ఫంక్షన్ ను అనంతపురంలో నిర్వహించాలని నిర్ణయించింది సినిమా యూనిట్. అనంతపురంలో చిరంజీవి సినిమా ఫంక్షన్ చేయడం ఇదే తొలిసారి. దీనిపై పలువురు నేతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. చిరంజీవి నిర్ణయంపై వైసీపీ నేతలైతే మరింత సంతోషం వ్యక్తం చేస్తున్నారు. విజయసాయిరెడ్డి, రోజా లాంటి నేతలు అనంతపురంలో చిరంజీవి సభ పెట్టడంపై ట్వీట్ల ద్వారా హర్షం వ్యక్తం చేశారు. వైసీపీ నేతల ట్వీట్లతో చిరంజీవి సంబరపడుతున్నారని.. కానీ ఇది పవన్ కల్యాణ్ ను ఇబ్బంది పెడ్తున్నారనే విషయం మెగాస్టార్ గ్రహించట్లేదని పలువురు అభిప్రాయపడుతున్నారు.

చిరంజీవి మాత్రం ప్రస్తుతానికి తాను రాజకీయాల్లో లేనంటున్నారు. కానీ కాంగ్రెస్ పార్టీ మాత్రం చిరంజీవి ఇంకా తమవాడేనంటోంది. ఈ మేరకు డెలిగేట్ కార్డును కూడా విడుదల చేసింది. దీనిపై చిరంజీవి నోరు మెదపలేదు. ఆ పార్టీలో కూడా యాక్టివ్ గా లేరు. కానీ కాంగ్రెస్ పార్టీ మాత్రం చిరంజీవిని ఇరకాటంలో పెట్టే ప్రయత్నం చేసింది. చిరంజీవి మాత్రం ఏపీలో వైసీపీకి దగ్గరగా ఉండేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇది పవన్ కల్యాణ్ కు కాస్త ఇబ్బంది కలిగిస్తోంది. కానీ చిరంజీవి మాత్రం తాను అందరివాడినని చెప్పుకునే ప్రయత్నం చేస్తున్నారు. మరి ఆయన ఎత్తులు ఎలాంటి పరిణామాలకు దారితీస్తాయో వేచి చూడాలి.

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :