Radha Spaces ASBL

కళావేదిక వారి బాలు స్వరఝరి SPB వర్ధంతి - సంస్మరణ

కళావేదిక వారి బాలు స్వరఝరి SPB వర్ధంతి - సంస్మరణ

ప్రముఖ కూచిపూడి కళాకారిణి గురు శ్రీమతి స్వాతి అట్లూరి గారు తమ స్వఛ్ఛంద సంస్థ కళావేదిక ఆధ్వర్యంలో, స్వర్గీయ ఎస్.పి బాల సుబ్రహ్మణ్యంగారి కి శ్రద్ధాంజలి అర్పిస్తూ, "బాలు స్వరాంజలి" కార్యక్రమాన్ని నిర్వహించారు. బాలు గారి ఆశయాలను నెరవేర్చే ప్రయత్నం చేస్తూ, వారి స్ఫూర్తితో, వారు చేపట్టిన ఎన్నో మంచి కార్యక్రమాలను కొనసాగించి, ముందుకు తీసుకువెళ్ళాలనే సదుద్దేశంతో స్థాపించబడిన ఈ సంస్థ నిర్వహించిన కార్యక్రమం ఇది. న్యూజెర్సీలోని సి దత్త పీఠం, శ్రీ శివ, విష్ణు టెంపుల్ వారి ఈవెంట్ హాల్ లో సెప్టెంబర్ 24, 2021 శనివారం  సాయంత్రం ఐదున్నరనుంచి ఎనిమిదిన్నర వరకు జరిగిన ఈ స్వరాంజలి కార్యక్రమంలో ప్రముఖ గాయనీ గాయకులైన ఉష, సుమంగళి, శ్రీకాంత్ సండుగు పాల్గొన్నారు. సెయింట్ లూయీస్ కు చెందిన ప్రముఖ వ్యాఖ్యాత శ్రీమతి వింజమూరి సాహిత్య ఈ కార్యక్రమానికి వ్యాఖ్యాతగా వ్యవహరించారు. కళావేదిక సంస్థ ఎడ్వైజర్ కమిటీలో ఒకరైన ఫణి డొక్కా అట్లాంటానుంచి ఈ కార్యక్రమానికి వచ్చి, సంధానకర్తగా వ్యవహరిస్తూ బాలు గారితో తన అనుభవాలను పంచుకున్నారు. 

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఉపేంద్ర చివుకుల (కమిషనర్ న్యూజెర్సీ బోర్డ్ ఆఫ్ పబ్లిక్ యుటిలిటీస్),
స్టెరిలీ.ఎస్.స్టాన్లీ (అసెంబ్లీ మేన్), శాంతి నర్రా (మిడిల్ సెక్స్ కౌంటీ కమిషనర్ డిప్యూటీ డైరెక్టర్), శాం జోషి (ఎడిసన్ టౌన్షిప్ కౌన్సిల్ వైస్ ప్రెసిడెంట్) విచ్చేసారు.

తానా, ఆటా, నాట్స్, టాటా, టి.ఎల్.సి.ఏ, టి.ఎఫ్.ఏ.ఎస్, ఎన్.ఆర్.ఐ.వి.ఏ, సిలికాన్ ఆంధ్రా, సాయి దత్త పీఠం శివ విష్ణు టెంపుల్ వంటి ప్రముఖ సంస్థల ప్రతినిథులు ఈ కార్యక్రమంలో పాల్గొనడం ముదావహం.

బాలు గారు పాడిన కొన్ని మధుర గీతాలను ఆలపిస్తూ ఉష, సుమంగళి, శ్రీకాంత్ గార్లు ప్రేక్షకులను అలరించారు. మధ్యలో మెరుపులా మెరుస్తూ తన చక్కని వ్యాఖ్యానంతో, సమయస్ఫూర్తితో సాహిత్య  కార్యక్రమం ఆద్యంతం చక్కగా నడిపించారు. బాలుగారు తనను ఆశీర్వదించిన మధుర క్షణాలను గుర్తుచేసుకుంటూ బాలు గారి మానస పుత్రిగా కీర్తింపబడే ఉష, ఒకటి రెండు వీడియో క్లిపింగ్స్ పంచుకున్నారు. సంస్థ అధ్యక్షురాలు శ్రీమతి స్వాతి సూటిగా, క్లుప్తంగా మాట్లాడుతూ, తమ సంస్థ ఉద్దేశాన్ని ప్రేక్షకులకు తెలియజేయగానే, అందరినుంచీ అపూర్వమైన స్పందన లభించింది. ఎంతోమంది సహృదయులు ముందుకు వచ్చి, అప్పటికప్పుడు విరాళాలు అందించి తమ విశాల హృదయాన్ని చాటారు. శ్రీ అట్లూరి వందన సమర్పణ చేస్తూ, ఈ కార్యక్రమం ఇంత దిగ్విజయమవ్వడానికి కారణమైన అందరకూ పేరుపేరునా కృతజ్ఞతలు తెలిపారు. ఈ స్వరాంజలి కార్యక్రమం వచ్చినవారందరికీ ఒక తృప్తిని, చక్కని అనుభూతులను మిగిల్చింది. అందరూ మరొక్కమారు ఆ గాన గంధర్వుణ్ణి స్మరించుకుని, వారి ఆశయాలను పూర్తిచేయడానికి  పునరంకితులమౌతామని నిశ్చయంచేసుకుని, సెలవు తీసుకున్నారు.

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :