బంగ్లా మాజీ ప్రధాని హసీనా భవితవ్యం..?
బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా భవితవ్యంపై నీలినీడలు కమ్ముకుంటున్నాయి. ఆమె అమెరికా,బ్రిటన్ లో రాజకీయ ఆశ్రయం కోరినట్లు వార్తలు వస్తున్నాయి. అయితే ఆ దేశాలు అందుకు సముఖత వ్యక్తం చేయడం లేదని.. అందుకే ఆమె మరికొన్నిరోజుల పాటు భారత్ లో ఉండాల్సి రావొచ్చని తెలుస్తోంది. అయితే.. అదే సమయంలో ..హసీనా ఏ దేశంలోను ఆశ్రయం కోరలేదని ఆమె తనయుడు సాజీబ్ వాజెద్ వెల్లడించారు. అమెరికా ప్రభుత్వం ఆమె వీసాను రద్దు చేసిందంటూ మీడియా కథనాలు వెలువడిన తరుణంలో ఆయన నుంచి ఈ స్పందన వచ్చింది. ఆమె ఆశ్రయం విషయంలో యూకే, యూఎస్ ప్రభుత్వాలు స్పందించడం లేదనే వార్తల్లో ఎలాంటి నిజం లేదని తెలిపారు.
తప్పనిసరి పరిస్థితుల్లో బంగ్లాదేశ్ ప్రధాని పదవి నుంచి వైదొలగాల్సి వచ్చిన షేక్ హసీనా మరో రెండ్రోజులపాటైనా భారత్‌లోనే ఆశ్రయం పొందడం అనివార్యమయ్యేలా ఉంది. వాస్తవంగా మన దేశం మీదుగా బ్రిటన్‌కు వెళ్లి అక్కడ తాత్కాలిక ఆశ్రయం పొందాలనేది ఆమె ఉద్దేశం. హిండన్ వైమానిక స్థావరంలో దిగడానికి ముందు ఇదే విషయాన్ని ఆమె సన్నిహిత వర్గాలు భారత ప్రభుత్వానికి తెలిపాయి.
ఆమె సోదరి రెహానా కుమార్తె తులిప్ సిద్దీఖ్ బ్రిటన్ పార్లమెంటులో సభ్యురాలు. రెహానాకు బ్రిటన్ పౌరసత్వం ఉంది. దాంతో ఆమె యూకే వెళ్లనున్నట్లు తెలుస్తోంది. అయితే...ఆశ్రయం కోరుతూ లేదా శరణార్థిగా ఒక వ్యక్తి వచ్చేందుకు తమ వలసచట్టాలు అంగీకరించబోవని ఇటీవలే బ్రిటన్ అధికారి ఒకరు వెల్లడించారు. ‘‘అవసరంలో ఉన్నవారికి రక్షణ కల్పించే విషయంలో మాకు గొప్ప రికార్డు ఉంది. అంతర్జాతీయ రక్షణ కోరేవారు తొలుత చేరుకున్న సురక్షిత దేశంలోనే ఆశ్రయం అడగాలి’’ అని అన్నారు. మరోవైపు అమెరికా వీసా రద్దు చేసిందని వార్తలు వచ్చాయి.
ఈ పరిణామాల వేళ.. ఢిల్లీలోని అజ్ఞాత ప్రదేశంలోనే హసీనా తాత్కాలికంగా తలదాచుకోనున్నారు. సోదరి షేక్ రెహానాతో కలిసి సైనిక రవాణా విమానంలో సోమవారం మన దేశానికి వచ్చిన హసీనాను పటిష్ఠమైన భద్రత నడుమ ఓ రహస్య ప్రదేశానికి తరలించిన విషయం తెలిసిందే. భద్రతా కారణాల దృష్ట్యా కుటుంబ సభ్యుల ఒత్తిడి మేరకే హసీనా దేశం వీడినట్లు ఇప్పటికే ఆమె కుమారుడు వెల్లడించారు. 15 ఏళ్ల పాటు అధికారంలో ఉన్న తన తల్లి.. ఎన్నో కష్టనష్టాలను ఓర్చుకున్నారని సాజీబ్ వాజెద్ పేర్కొన్నారు. . తిరిగి ఆమె రాజకీయాల్లోకి వచ్చే అవకాశం లేదన్నారు.