ASBL NSL Infratech
facebook whatsapp X

రివ్యూ : 'సరిపోదా శనివారం' కథనం అనివార్యం! 

రివ్యూ : 'సరిపోదా శనివారం' కథనం అనివార్యం! 

తెలుగుటైమ్స్.నెట్ రేటింగ్ : 3/5
నిర్మాణ సంస్థ : డివివి ఎంటర్‌టైన్‌మెంట్స్
నటీనటులు : నాని, ప్రియాంక అరుల్ మోహన్, SJ సూర్య, సాయి కుమార్, అజయ్, అదితిబాలన్, మురళీ శర్మ, అజయ్ ఘోష్, హర్షవర్ధన్, శుభలేఖ సుధాకర్ తదితరులు నటించారు.
సంగీతం: జేక్స్ బిజోయ్, సినిమాటోగ్రఫీ : మురళి జి
ఎడిటర్: కార్తీక శ్రీనివాస్, ఫైట్స్: రామ్-లక్ష్మణ్
నిర్మాతలు: డివివి దానయ్య, కళ్యాణ్ దాసరి
రచన, దర్శకత్వం: వివేక్ ఆత్రేయ
విడుదల తేదీ : 29.08.2024

నాని, డైరెక్టర్ వివేక్ ఆత్రేయ మోస్ట్ ఎవైటెడ్ పాన్ ఇండియా ఫిల్మ్ 'సరిపోదా శనివారం' ప్రమోషన్స్ లో భాగంగా  పోస్టర్లు, గ్లింప్సెస్, సాంగ్స్,టీజర్, ట్రైలర్, నాని, ఎస్ జే సూర్యలు చెప్పిన మాటలు, ఇలా  సినిమా నుండి వచ్చే ప్రతి అప్‌డేట్ హ్యుజ్ బజ్ ని క్రియేట్ చేస్తున్నాయి. అలాగే సినిమాలోని ఇంపార్టెంట్ క్యారెక్టర్స్ ని పరిచయం చేస్తూ రిలీజ్ పోస్టర్స్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. మాస్ ఆడియెన్స్‌కి ఎక్కడంతో మంచి హైప్  ఏర్పడింది. డివివి దానయ్య నిర్మించిన ఆగస్ట్ 29న నాని సరిపోదా శనివారం అంటూ అన్ని భాషల్లోని ఆడియెన్స్‌ను పలకరించేందుకు వచ్చేశాడు. తెలుగులో అయితే నాని సందడి కనిపిస్తోంది. మరి ఈ మూవీ ఎలా ఉందో ఓ సారి సమీక్ష లో చూద్దాం.

కథ:

చిన్నుఅలియాస్ సూర్య (నాని)కి చిన్నతనం నుండి విపరీతమైన కోపం. ఎప్పుడూ ఎవరో ఒకరిని కోపంతో కొడుతూనేవుంటాడు.  ఆ కోపాన్ని కంట్రోల్ చేసేందుకు తల్లి చాయా దేవీ (అభిరామి) కోపానికి కూడా ఓ అర్ధం ఉండాలి అంటూ,  ఓ కండీషన్ పెడుతుంది. వారమంతా కాకుండా ఏదో ఒక రోజు కోపాన్ని చూపించమని చెబుతుంది. అసలు కోపం అంటే ఏంటో చెప్పాలని చాయాదేవీ ప్రయత్నిస్తుంది. కానీ అంతలోపే ఆమె చనిపోతుంది. శనివారం మాత్రమే తన కోపాన్ని ప్రదర్శించాలని సూర్య ఫిక్స్ అవుతాడు. మరో వైపు సోకులపాలెంలో ఎస్సై దయానంద్ (ఎస్ జే సూర్య) అత్యంత క్రూరుడు, మహా కోపిష్టి, దాంతో  తన ప్రతాపాన్నిఅందరిపై  చూపిస్తుంటాడు. ఎవరో ఒకరిని హింసిస్తూనే ఉంటాడు. దయానంద్‌కి తన అన్న ఎమ్మెల్యే కూర్మానంద్ (మురళీ శర్మ)తో ల్యాండ్ సమస్యలు ఉంటాయి. కూర్మానంద్‌ను చంపాలని దయానంద్ ప్లాన్ వేస్తాడు. సోకులపాలెంకు కానిస్టేబుల్ చారులత (ప్రియాంక మోహన్) తో  సూర్య ప్రేమలో పడతాడు. చారులత సూర్య సోకులపాలెం కు ఎందుకు  తీసుకువస్తుంది?  దయానంద్, సూర్యల మధ్య ఏం జరుగుతుంది? సూర్య కోపాన్ని అదుపు చేసుకోడానికి ఏం చేస్తాడు? అనే  విషయాలు  థియేటర్లో చూడాల్సిందే.

నటీనటుల హావభావాలు:

ఈ సినిమాలో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది  ఎస్ జే సూర్య, నానిల గురించి,  మనం నానిని ఇలాంటి పాత్రల్లో చూడటం కొత్తేమీ కాదు. కాకపోతే హీరోగా అతను తేలిపోయాడు. అండర్ ప్లే మోడ్ లో అతని క్యారెక్టరైజేషన్ ఇంపాక్ట్ లేకుండా పోయింది.  ఎస్ జే సూర్యకు విలన్ పాత్రలే ఇప్పుడు ఎక్కువగా వస్తున్నాయి. స్క్రీన్ మీద ఎస్ జే సూర్య కనిపిస్తే ఆడియెన్స్‌కి కూడా ఓ ఎనర్జీ వచ్చేస్తుంది. విలన్‌గా ఎస్ జే సూర్య అదరగొట్టేశాడు. ఇక చారులత పాత్రలో ప్రియాంక అందంగా కనిపించిందంతే. మొహంలో ఏ మాత్రం ఎక్స్‌ప్రెషన్స్ కనిపించవు. ఓ బొమ్మలా అందంగా తెరపై కనిపిస్తుందంతే. సాయి కుమార్‌కు మంచి పాత్ర పడింది. తండ్రి పాత్రలో మరోసారి తెరపై ఆడియెన్స్‌ను ఆకట్టుకుంటాడు. మురళీ శర్మ పాత్ర కొత్తగా అనిపిస్తుంది. ఆయన పాత్రను డిజైన్ చేసిన విధానం బాగుంటుంది. తల్లి పాత్రలో అభిరామి, అక్క కారెక్టర్‌లో అదితీ, శుభలేఖ సుధాకర్, అలీ, సత్య ప్రకాష్ ఇలా అన్ని పాత్రలు ఓకే అనిపిస్తాయి.

సాంకేతిక వర్గం పనితీరు:

దర్శకుడు వివేక్ ఆత్రేయ కొన్ని సన్నివేశాలను యాక్షన్ పరంగా అలాగే ఎమోషనల్ గా బాగా తెరకెక్కించినప్పటికీ.. తీసుకున్న స్టోరీ లైన్ కి పూర్తి స్థాయిలో ఆకట్టుకునే విధంగా ఆయన స్క్రీన్ ప్లేను రాసుకోలేకపోయారు. అతను రాసుకున్న యాక్షన్ ఎపిసోడ్స్ అండ్ ఎమోషనల్ సీన్స్ బాగున్నాయి. ముఖ్యంగా మదర్ సెంటిమెంట్ చాలా బాగుంది.  సంగీత దర్శకుడు జేక్స్ బిజోయ్ అందించిన పాటలు ఓకే. సినిమాలో బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బాగుంది.  మురళి జి సినిమాటోగ్రఫీ కూడా బాగుంది. సినిమాలోని చాలా సన్నివేశాలను చాలా బ్యూటిఫుల్ గా చిత్రీకరించారు. ఇక ఎడిటింగ్ విషయానికి వస్తే.. అక్కడక్కడ ఉన్న కొన్ని సాగతీత అనిపిస్తుంది ఇంకా ఎడిటింగ్ వుంది.  నిర్మాత డివివి దానయ్య, కళ్యాణ్ దాసరి ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా ఈ చిత్రాన్ని నిర్మించారు. వారి నిర్మాణ విలువులు చాలా బాగున్నాయి.

విశ్లేషణ :

సరిపోదా శనివారం వంటి  కథల్ని మనం ఎన్నో చూసాం!  క్రూరమైన రాక్షసుడిలాంటి విలన్.. ఓ ప్రాంతంలోని ప్రజల్ని హింసిస్తుంటాడు.. ఆ రాక్షసుడ్ని అంతం చేసేందుకు హీరో వస్తాడు. ఇలాంటి లైన్, పాయింట్‌తోనే దాదాపు మాస్ కమర్షియల్ చిత్రాలన్నీ తయారవుతుంటాయి. ఈ సరిపోదా శనివారం కూడా అదే. కాకపోతే ఇందులో హీరో తన కోపాన్ని ఎప్పుడు పడితే అప్పుడు ప్రదర్శించడు. కేవలం శనివారం మాత్రమే తన కోపాన్ని, హీరోయిజాన్ని ప్రదర్శిస్తుంటాడు. మిగతా వారాల్లో వచ్చి హీరోని లేపేస్తే అయిపోతుంది కదా? అని లాజిక్స్ వెతికితే మాత్రం ఈ సినిమా వింతగా ఉంటుంది. ఇందులో నచ్చే అంశం ఏమిటంటే? నాని, ఎస్ జే సూర్యల కాంబో సీన్లు.. వారిద్దరి ఫేస్ ఆఫ్.. వారి నటన స్పెషల్‌గా ఉంటుంది. మరీ ముఖ్యంగా ఎస్ జే సూర్యను వివేక్ ఆత్రేయ బాగా వాడుకున్నాడనిపిస్తుంది. ఎస్ జే సూర్య పాత్రకే ఎక్కువగా ఎలివేషన్ ఇచ్చినట్టుగా అనిపిస్తుంది.  ఓవరాల్ గా ఈ సినిమాలో నాని, ఎస్ జే సూర్యల నటనతో పాటు పవర్ ఫుల్ యాక్షన్ ఎలిమెంట్స్, మదర్ సెంటమెంట్ చాలా బాగా ఆకట్టుకున్నాయి. లాజిక్స్ వెతకకుండా... థియేటర్లో సినిమా చూస్తే బాగుంది అనిపిస్తుంది.
 

 

 

praneet praneet praneet ASBL Radhey Skye Radha Spaces
Tags :