ఈ కారు ధర వింటే గుండె గుభేల్.. అక్షరాలా రూ.210 కోట్లు

ఈ కారు ధర వింటే గుండె గుభేల్ మంటుంది. బ్రిటిష్ లగ్జరీ కార్ల దిగ్గజం రోల్స్ రాయిస్ కొత్త కారు బోట్ టైల్‍ను ఆవిష్కరించింది. అది అక్షరాల మన కరెన్సీలో రూ.210 కోట్లు (2.8 కోట్ల డాలర్లు). అయితే కారు ధర వెల్లడించడానికి కంపెనీ నిరాకరించింది. కాని కారు ప్రత్యేకతలను బట్టి ధర ఆ స్థాయిలో ఉండవచ్చని ఆటో రంగ నిపుణులంటున్నారు. ఈ కొత్త కారును 1932 మోడల్ బోట్ టైల్ యజమానే స్వయంగా కొనుగోలు చేస్తున్నట్టు కంపెనీ తెలిపింది.
1920, 1930 దశాబ్దాల్లో ఇలా ప్రత్యేకంగా డిజైన్ చేసిన కార్లు తిరుగుతూ ఉండేవి. కస్టమర్ పూర్తిగా డిజైనింగ్ ప్రాసెస్ అంతటిలోనూ భాగస్వామి అయ్యేలా ప్రోత్సహిస్తారు. కారు డిజైనింగ్ ప్రాజెక్టు అంతటిలోనూ కస్టమర్లను చురుకైన భాగస్వాములను చేసే ప్రత్యేక సహకార భాగస్వామ్యం గా దీన్ని రోల్స్ రాయిస్ కోచ్‍బిల్డ్ డిజైన్ విభాగం అధిపతి అలెక్స్ ఇన్నిన్ అభివర్ణించారు. గతంలో ఎవరూ చూడని అద్భుతం తమ చేతిలోనే ఉందన్న భావం కస్టమర్‍కు ఉంటుందని ఆయన అన్నారు. 2017 ఆవిష్కరించిన కూపె స్వెప్టైల్ ప్రత్యేక లక్షణాలన్నీ బోల్ టైల్‍లో ఉంటాయని, భవిష్యత్తులో ఆహ్లాదాన్ని కోరే కస్టమర్లందరూ కోచ్ బిల్డింగ్‍కు మొగ్గు చూపేలా ఇది ఆకర్షిస్తుందని ఆయన వ్యాఖ్యానించారు.






