అందుకే 6 గ్యారంటీలు ప్రకటించాం : రేవంత్ రెడ్డి
గత పదేళ్లు అధికారంలో ఉన్న బీఆర్‌ఎస్, ఇచ్చిన హామీలు నిలబెట్టుకుందా అనే విషయాన్ని ప్రజలు ఆలోచించాలని తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి కోరారు. కొడంగల్ నియోజకవర్గంలోని బొమ్రాస్‌పేటలో నిర్వహించిన రోడ్ షోలో రేవంత్ రెడ్డి మాట్లాడారు. కొడంగల్‌ను దత్తత తీసుకుంటామని, నీళ్లు తీసుకొస్తామని చెప్పిన నేతలు అలాగే చేశారా? అని నిలదీశారు. కాంగ్రెస్ హయాంలోనే ఇందిరమ్మ ఇళ్లు ఇచ్చాం. రోడ్లు వేశాం. ఈ పదేళ్లు బీఆర్‌ఎస్ పేదల కోసం ఏమీ చేయలేదు. ఇప్పుడొచ్చి కేసీఆర్ మళ్లీ మనల్ని ఓట్లు అడుగుతున్నారు. మందుపోయాలి, ఓటుకు రూ.10 వేలు ఇవ్వాలనేది వారి ఆలోచన. రూ.లక్షల కోట్లు సంపాదించుకోవడమే బీఆర్‌ఎస్ నేతల లక్ష్యం. బంగారు తెలంగాణలో పేదలకు ఎంత బంగారం పంచారు? బంగారు తెలంగాణ సంగతి దేవుడెరుగు. ఉన్న బంగారాన్ని అమ్ముకునే పరిస్థితి వచ్చింది. ప్రజలు కష్టాలు అర్థం చేసుకున్నాం కాబట్టే తెలంగాణలో మరోసారి ఇందిరమ్మ రాజ్యం తీసుకురావాలని నిర్ణయించాం. అందుకే 6 గ్యారంటీలు ప్రకటించాం అని తెలిపారు.