రివ్యూ : గురితప్పిన 'రామబాణం'
తెలుగుటైమ్స్.నెట్ రేటింగ్ : 2.5/5
నిర్మాణ సంస్థ : పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ
నటి నటులు: గోపిచంద్, డింపుల్ హయాతి, జగపతిబాబు, కుష్బూ కీలకపాత్రలో చేయగా సచిన్ ఖేడేకర్,
నాజర్, అలీ, రాజా రవీంద్ర, వెన్నెల కిషోర్, సప్తగిరి, కాశీ విశ్వనాథ్, సత్య, గెటప్ శ్రీను తదితరులు నటించారు.
సంగీత దర్శకులు: మిక్కీ జే మేయర్, సినిమాటోగ్రఫీ: వెట్రి పలనిసామి
ఎడిటర్: ప్రవీన్ పూడి, సహా నిర్మాత : వివేక్ కూచిబొట్ల
నిర్మాత: టీ. జీ. విశ్వ ప్రసాద్, దర్శకులు : శ్రీవాస్
విడుదల తేదీ: 05.05.2023
‘రామబాణం’ టైటిల్ భలే ఉందే.. ఈ కథకి రామబాణం అని నామకరణం చేసింది మన నందమూరి బాలయ్యే. అన్‌స్టాపబుల్ షోకి గోపీచంద్ గెస్ట్‌గా వెళ్లడం.. అక్కడ అనుకోకుండా ఈ సినిమా గురించి చర్చ నడవడం.. బాలయ్య ‘రామబాణం’ టైటిల్ చెప్పడంతో ఈ సినిమాకి మంచి టైటిల్ సెట్ అయ్యింది. విషయానికొస్తే...గత కొంతకాలం నుండి గోపీచంద్ చిత్రాలు ఏమాత్రం థియేటర్లలో నిలబటంలేదు. సరైన సక్సెస్ అనేది కొట్టలేకపోతున్నాడు. ‘లక్ష్యం’ సినిమాలో గోపీచంద్, జగపతిబాబు అన్నదమ్ములుగా నటించి మెప్పించిన ఈ కాంబినేషన్.. మళ్లీ ‘రామబాణం’తో హిట్‌కి గురిపెట్టారు. గోపీచంద్ హీరోగా, డైరెక్టర్ శ్రీవాస్ దర్శకత్వంలో లక్ష్యం, లౌక్యం చిత్రాల తర్వాత వీరి కాంబినేషన్ లో వస్తున్న చిత్రం కావడంతో సినిమా పై ఆసక్తి నెలకొంది. ఇక ఆయన ఆశలన్నీ ఇప్పుడు రామబాణం సినిమాపై ఉండగా ఈ సినిమా ఈరోజు థియేటర్లో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ రామబాణం మనసుకి గుచ్చుకుందా? లేదంటే గురి తప్పిందా? మరి ఈ సినిమా ప్రేక్షకులను ఎలా ఆకట్టుకుందో. అంతేకాకుండా గోపీచంద్, డైరెక్టర్ శ్రీవాస్ కు ఎటువంటి సక్సెస్ అందించిందో చూద్దాం.
కథ:
అన్నదమ్ముల అనుబంధానికి భావోద్వేగాలను మిళితం చేసిన కథే రామబాణం. కుటుంబ బంధాలు.. అన్నదమ్ముల అనుబంధాలను కథా వస్తువుగా తీసుకుని సోషల్ మెసేజ్ ఇచ్చే ప్రయత్నంలో దర్శకుడు శ్రీవాస్ తనకి అచ్చొచ్చిన కమర్షియల్ ఫార్మాట్‌నే నమ్ముకున్నారు. అయితే ఫ్యామిలీ ఎమోషన్ కథలోని పాత్రలు వాస్తవ జీవితం నుంచి పుట్టుకొస్తేనే ఆడియన్స్‌కి ఈజీగా కనెక్ట్ అవుతుంది. ఇది మన కథ.. మనందరి కథ.. నా కథే అని ఇన్వాల్వ్ అవుతారు. కానీ ఈ రామబాణానికి దర్శకుడి అంచనా కు చేరుకోలేదు. చూసిన కథే.. పైగా చూసేసిన పాత్రలే కావడంతో కథలో కొత్తదనం కనిపించదు. రాజారాం (జగపతిబాబు) తమ్ముడు విక్కీ (గోపీచంద్). నమ్ముకున్న సిద్ధాంతాలతో హోటల్ బిజినెస్ చేస్తూ ఉంటాడు రాజారాం. స్వచ్ఛమైన ఆహారం ను అందించాలనే లక్ష్యంతో ఉంటాడు. అందరికీ కల్తీలేని ఆహారం అందించాలనే ఉద్దేశంలో సుఖీభవ పేరుతో హోటల్స్ నడిపిస్తుంటాడు రాజారాం. అదే ఊరిలో పాపారావు (నాజర్) కల్తీ ఆహారంతో ప్రజల ఆరోగ్యాన్ని పాడుచేస్తుంటాడు. రాజారాంకి ప్రజల్లో వస్తున్న మంచిపేరుని చూసి తట్టుకోలేక రాజారాంపై కుట్రలు పన్నుతూ ఉంటాడు. దీంతో తమ్ముడు విక్కీ తిరగబడతాడు. నీతి, న్యాయాన్ని నమ్ముకున్న రాజారాం గొడవలు వద్దని తమ్ముడ్ని మందలిస్తాడు. దీంతో విక్కీ చిన్నతనంలోనే అన్న దగ్గర నుంచి కలకత్తా పారిపోతాడు. అక్కడికి వెళ్లిన విక్కీ.. విక్కీ భాయ్‌గా ఎలా మారాడు.. 14 ఏళ్ల తరువాత తిరిగి వచ్చి.. ప్రమాదంలో ఉన్న తన అన్న కుంటుబాన్ని ఎలా కాపాడుకున్నాడు? శత్రువుల ఆట ఎలా కట్టించాడు? భైరవి (డింపుల్ హయాతీ) తో ప్రేమలో పడిన విక్కీ, తన ప్రేమను గెలుపొందడం కోసం ఏం చేశాడు? లాంటి ప్రశ్నలకు సమాధానాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
నటీనటుల హావభావాలు:
గోపీచంద్, జగపతిబాబు వీళ్లిద్దరూ అన్నదమ్ములుగా చేస్తున్నారంటే.. ఈ కాంబో బ్రదర్స్‌కి ఉన్న క్రెడిబిలిటీనే వేరు. ఒకే తల్లి కడుపున పుట్టిన అన్నదమ్ములుగా భలే ఉన్నార్రా అనేట్టుగా ఉంటారు జగపతిబాబు, గోపీచంద్‌లు. ఇద్దరివీ సేమ్ కటౌట్లు. రంగు, ఒడ్డు, పొడుగు.. చివరికి గుణం కూడా ఒకటే అన్నట్టుగా ఉంటారు దానికి అనుగుణంగా గోపీచంద్, జగపతి బాబులు నటించారు. అలాగే గోపీచంద్ తో కెమిస్ట్రీ కూడా బాగుంది. గోపిచంద్ యాక్షన్ సన్నివేశాలు, ఫైట్స్ బాగున్నాయి. తన అన్నకొసం గోపీచంద్ ఎదురు తిరిగే సన్నివేశాలు బాగున్నాయి. హీరోకి వదినగా జగపతిబాబుకి జోడీగా సీనియర్ హీరోయిన్ ఖుష్బూ ఉన్నంతలో పర్వాలేదనిపించింది. సినిమాలో హీరోయిన్ డింపుల్ హాయాతీ పెర్ఫార్మెన్స్ కూడా ఆకట్టుకుంటుంది. అలీ, నాజర్, సుభలేఖ సుధాకర్, గెటప్ శ్రీను, సత్య ఇలా చాలామందే ఉన్నారు కానీ.. గుర్తించుకునే బలమైన పాత్రలైతే కాదు, కథానుసారంగా చేసారు.
సాంకేతికవర్గం పనితీరు:
డైరెక్టర్ శ్రీవాస్ గోపీచంద్‌తో ఆల్రెడీ పని చేసి ఉండటం వల్ల.. ఆయన నుంచి ఆడియన్స్ ఏం ఎక్స్‌పెక్ట్ చేస్తారో.. గోపీచంద్‌కి ఎలాంటి సీన్లు నప్పుతాయో వాటినే ఎంచుకున్నారు దర్శకుడు. మాస్ ఎలిమెంట్స్, యాక్షన్ ఎపిసోడ్స్ విషయంలో మాచో స్టార్ గోపీచంద్ పెర్ఫామెన్స్‌కి తిరుగు ఉండదు. కానీ.. కథ డిమాండ్‌ని బట్టే పెర్ఫామెన్స్ ఆధారపడి ఉంటుంది. కథలో కొత్తదనం లోపించడం.. పైగా చూసిన సీన్లే మళ్లీ మళ్లీ చూస్తున్నట్టుగా అనిపించడంతో గోపీచంద్ ఎంత కష్టపడ్డా.. ఆడియన్స్‌కి కావాల్సిన కంటెంట్ ఇవ్వలేకపోయారు దర్శకుడు. మ్యూజిక్ డైరెక్టర్ మిక్కీ జే మేయర్ మ్యూజిక్ ఆకట్టుకుంటుంది. సాంగ్, తన బ్యాక్గ్రౌండ్ స్కోర్ నీట్ గా ఉన్నాయి. సినిమాటోగ్రఫీ కూడా బాగుంది. ఎడిటింగ్ మాత్రం బెటర్ గా చేయాల్సింది. అలాగే డైలాగ్స్ బాగున్నాయి, కానీ ల్యాగ్ సీన్స్ కట్ చేయాల్సింది. నిర్మాణ విలువలు బాగున్నాయి. ఫ్యామిలీ డ్రామాకి కావాల్సిన సెటప్ అంతా మేకర్స్ బాగా డిజైన్ చేశారు.
విశ్లేషణ:
కుటుంబ కథా చిత్రాలకు ప్రధాన బలం.. సెంటిమెంట్. ‘రామబాణం’లో సెంటిమెంట్ వర్కౌట్ చేసే సీన్లు కొల్లలుగా వున్నా... కథ రొటీన్ ఫార్మాట్ కావడంతో ఆడియన్స్‌ని పెద్దగా కనెక్ట్ కాలేదు. ఇంటర్వెల్ బ్యాంగ్.. అన్నదమ్ముల మధ్య ఎలివేషన్స్.. గుడిలో హోమం ఫైట్.. మాస్ ఆడియన్స్‌కి బాగా నచ్చుతాయి. ప్రీ క్లైమాక్స్ సీన్ హైలైట్‌గా నిలిచింది. కొన్ని సీన్లు ఇక జగపతిబాబు పాత్ర చుట్టూనే కథ నడిచినా.. ఆయన పూర్తి స్థాయిలో ఉపయోగించుకోలేకపోయారు. అలీ, నాజర్, సుభలేఖ సుధాకర్, గెటప్ శ్రీను, సత్య ఇలా చాలామందే ఉన్నారు కానీ.. గుర్తించుకునే బలమైన పాత్రలైతే కాదు. సంగీతం మాస్టర్ సావిత్రిగా వెన్నెల కిషోర్‌ని తేడాగా చూపించారు. ఆ కామెడీ కూడా పెద్దగా వర్కౌట్ కాలేదు.‘రక్త సంబంధం విడిపోవచ్చు కానీ.. తెగిపోదు, డబ్బు ఉంటే ధనవంతుడు అవుతాడు అదే కుటుంబం ఉంటే బలవంతుడు అవుతాడు’ లాంటి డైలాగ్స్‌కి మంచి రెస్పాన్స్ వచ్చింది థియేటర్స్‌లో. యాక్షన్ సీన్‌లలో గోపీచంద్ అదరగొట్టాడు. చివరిగా.. ‘రామబాణం’ మనసుకి గుచ్చకునేంతగా అయితే లేదు కానీ.. అన్నదమ్ముల అనుబంధాన్ని..ఫ్యామిలీ వాల్యూస్‌ని గుర్తు చేసింది. ఆయన ఫ్యాన్స్‌కి ఫుల్ మీల్స్‌లా అనిపిస్తుంది.