అశోక్ గెహ్లాట్‌పై సోనియా ఆగ్రహం..? కాంగ్రెస్ అధ్యక్ష పదవి రేసు నుంచి ఔట్..!

అశోక్ గెహ్లాట్‌పై సోనియా ఆగ్రహం..? కాంగ్రెస్ అధ్యక్ష పదవి రేసు నుంచి ఔట్..!

కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవి వ్యవహారం ఆ పార్టీలో మరిన్ని వివాదాలకు కారణమవుతోంది. కాంగ్రెస్ పార్టీని నడిపే నాయకుడికోసం ఆ పార్టీ నేతలంతా ఎంతో ఎదురు చూస్తున్నారు. గాంధీ ఫ్యామిలీ తప్పా మరెవరూ దాన్ని ముందుకు నడిపించలేదని దేశవ్యాప్తంగా నేతలంతా ఘంటాపథంగా చెప్తున్నారు. కానీ గాంధీ ఫ్యామిలీ మాత్రం అధ్యక్ష పదవి చేపట్టేందుకు ససేమిరా అంటోంది. వయసు పైబడడం, ఆరోగ్యం సహకరించకపోవడంతో సోనియా గాంధీ దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నారు. రాహుల్ గాంధీ మాత్రం తనకు ఆ పదవి వద్దంటే వద్దని భీష్మించుకు కూర్చున్నారు.

కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్ ను ఎన్నుకునేందుకు ఆ పార్టీ నేతలు సిద్ధమయ్యారు. గాంధీ ఫ్యామిలీ నుంచి ఆయనకు గ్రీన్ సిగ్నల్ కూడా వచ్చింది. తనకు ఇష్టం లేకపోయినా గాంధీ ఫ్యామిలీ పదే పదే చెప్తుండడంతో కాంగ్రెస్ అధ్యక్ష బాధ్యతలను చేపట్టేందుకు ఆయన అంగీకరించక తప్పలేదు. శశిథరూర్ లాంటి వాళ్లు ఉత్సాహపడుతున్నా కాంగ్రెస్ పార్టీ శ్రేణుల నుంచి ఆశించినంత స్పందన రావట్లేదు. అశోక్ గెహ్లాట్ వైపే సోనియా, రాహుల్ మొగ్గు చూపడంతో ఆయన్ను ఎన్నుకునేందుకు పీసీసీలు సిద్ధమయ్యాయి. ప్రస్తుతం రాజస్థాన్ సీఎంగా ఉన్న అశోక్ గెహ్లాట్ ఆ పదవికి గుడ్ బై చెప్పి ఏఐసీసీ చీఫ్ బాధ్యతలు చేపట్టేందుకు ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి.

అయితే ఇక్కడే పెద్ద ట్విస్ట్ జరిగింది. రాజస్థాన్ సీఎంగా అశోక్ గెహ్లాట్ ను వదులుకునేందుకు ససేమిరా అంటున్నారు ఆయన వర్గం ఎమ్మెల్యేలు. అశోక్ గెహ్లాట్ రాజీనామా చేసి కాంగ్రెస్ అధ్యక్ష బాధ్యతలు చేపడితే సీఎంగా సచిన్ పైలెట్ కే ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి. సచిన్ పైలెట్ ను సీఎంగా చూసేందుకు అశోక్ గెహ్లాట్ వర్గీయులు ఏమాత్రం సుముఖంగా లేరు. దీంతో తాము రాజీనామాకైనా సిద్ధంగా ఉన్నాం కానీ సచిన్ పైలెట్ ను సీఎం చేసేందుకు, అశోక్ గెహ్లాట్ ను వదులుకునేందుకు సిద్ధంగా లేమని తేల్చేశారు. కాంగ్రెస్ పార్టీ పరిశీలకులు మల్లికార్జున్ ఖర్గే, అజయ్ మాకెన్ లకు ఇదే విషయాన్ని స్పష్టం చేశారు. రెండ్రోజులపాటు జైపూర్ లో ఎమ్మెల్యేలతో సమావేశమై అక్కడి పరిస్థితులను అంచనా వేశారు పరిశీలకులు.

రాజస్థాన్ కాంగ్రెస్ ఎమ్మెల్యేల తీరు చూశాక. తన వర్గం ఎమ్మెల్యేలకు సర్దిచెప్పడంలో అశోక్ గెహ్లాట్ విఫలమయ్యారని సోనియా భావిస్తున్నారు. ఒక రాష్ట్రంలో తన వర్గం నేతలనే దారికి తెచ్చుకోలేని అశోక్ గెహ్లాట్.. రేపు ఏఐసీసీ చీఫ్ గా దేశవ్యాప్తంగా కాంగ్రెస్ శ్రేణులను ఎలా ముందుకు నడిపిస్తారనే సందిగ్ధంలో పడిపోయింది గాంధీ ఫ్యామిలీ. రాజస్థాన్ పరిణామాలను చూసిన తర్వాత కాంగ్రెస్ పార్టీ సీనియర్లు కూడా ఇదే అభిప్రాయంతో ఉన్నారు. ఏఐసీసీ అధ్యక్ష బాధ్యతలను చేపట్టేందుకు అశోక్ గెహ్లాట్ కు ఇష్టం లేకపోవడం వల్లే .. తన వర్గం ఎమ్మెల్యేలను అశోక్ గెహ్లాట్ ఇలా రెచ్చగొడుతున్నారనే అభిప్రాయమూ ఉంది.

ఈ పరిస్థతుల్లో అశోక్ గెహ్లాట్ ను సీఎం పదవి నుంచి తప్పించి రాజస్థాన్ లో సంక్షోభంలోకి వెళ్లడం కంటే.. ఆయన్ను కాంగ్రెస్ అధ్యక్ష పదవిలో కూర్చోబెట్టకపోవడమే ఉత్తమమనే టాక్ నడుస్తోంది. దీంతో అశోక్ గెహ్లాట్ కు అధ్యక్ష పదవిపై సోనియా పునరాలోచనలో పడ్డారు. ప్రస్తుత పరిస్థితుల్లో అశోక్ గెహ్లాట్ కాకుండా మరెవరికీ అధ్యక్ష పదవి చేపట్టేంత సీన్ లేదనే వాదనా ఉంది. మరి అధ్యక్ష పదవి ఎవరికి దక్కుతుందో.. అటు తిరిగి ఇటు తిరిగి మళ్లీ రాహుల్ గాంధీయే దిక్కని భావిస్తారో వేచి చూడాలి.

 

Tags :
ii). Please add in the header part of the home page.