అమిత్ షా చెంతకు రఘురామ ఇష్యూ.. ఏం జరుగుతుంది?

అమిత్ షా చెంతకు రఘురామ ఇష్యూ.. ఏం జరుగుతుంది?

ఆంధ్రప్రదేశ్ లో ఎంపీ రఘురామ కృష్ణంరాజు అరెస్ట్ వ్యవహారం తీవ్ర ఆసక్తి రేపుతోంది. రాజద్రోహం ఆరోపణలపై సొంత పార్టీ ఎంపీ అయిన రఘురామకృష్ణంరాజుపై కేసు పెట్టి అరెస్ట్ చేసింది వైసీపీ ప్రభుత్వం. ఆయన మితిమీరి ప్రవర్తించారని.. ప్రభుత్వం పైనా, ప్రభుత్వాధినేత పైనా తీవ్ర ఆరోపణలు చేశారని సీఐడీ చెప్తోంది. ఎవరూ ఫిర్యాదు చేయకపోయినా స్వచ్చంధంగా సీఐడీ కేసు నమోదు చేసి ఆయన్ను అరెస్టు చేసింది. అయితే ఈ అరెస్టు అనంతరం జరుగుతున్న అనేక పరిణామాలు తీవ్ర ఆసక్తి కలిగిస్తున్నాయి.

సీఐడీ అరెస్టు చేసిన వెంటనే బెయిల్ కోసం రఘురామకృష్ణంరాజు హైకోర్టును ఆశ్రయించారు. కిందికోర్టునే ఆశ్రయించాలంటూ హైకోర్టు చెప్పడంతో సీఐడీ కోర్టుకు వెళ్లారు. అక్కడు చుక్కెదురైంది. అయితే మళ్లీ హైకోర్టును ఆశ్రయించారు. తన ఆరోగ్యం బాగలేనందును ప్రైవేటు ఆసుపత్రికి తరలించాలని కోరారు. దీనిపై స్పందించిన హైకోర్టు ఆయనకు వైద్యపరీక్షలు నిర్వహించాలని ఆదేశించింది. అయితే ఆయన్ను ఎవరూ కొట్టలేదని వైద్య కమిటీ నివేదిక ఇచ్చింది. అయితే సరైన సమయంలో నివేదిక ఇవ్వనందుకు ఆగ్రహించిన హైకోర్టు కోర్టు ధిక్కరణ కేసుకు ఆదేశించింది.

ఇంతలోనే సుప్రీంకోర్టును ఆశ్రయించారు రఘురామకృష్ణంరాజు. ఆయన్ను వెంటనే సికింద్రాబాద్ లోని ఆర్మీ ఆసుపత్రికి తరలించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. దీంతో సీఐడీ ఆయన్ను సికింద్రాబాద్ కు తరలించింది. ఈ పరిణామాలు సహజంగానే ఏపీ సర్కార్ కు మింగుడు పడలేదు. వెంటనే కౌంటర్ పిటిషన్ దాఖలు చేసింది. రఘురామకృష్ణంరాజు రాజద్రోహానికి పాల్పడ్డారని పేర్కొంది. దీనిపై విచారణ జరగాల్సి ఉంది.

ఇదే సమయంలో రఘురామకృష్ణంరాజు కుమారుడు, కుమార్తె ఢిల్లీలో అమిత్ షాను కలిసారు. తమ తండ్రిపై జగన్ సర్కార్ కక్ష సాధిస్తోందని అమిత్ షా దృష్టికి తీసుకెళ్లారు. జోక్యం చేసుకోవాల్సిందిగా అభ్యర్థించారు. వైసీపీ తరపున గెలిచిన కొన్నాళ్లకే రఘురామకృష్ణంరాజు బీజేపీకి దగ్గరయ్యారు. వైసీపీ సిఫారసు చేయకపోయినా బీజేపీ అండతో కొన్ని పార్లమెంటరీ కమిటీల్లో రఘురామకృష్ణం రాజు స్థానం దక్కించుకున్నారు. అమిత్ షా, నడ్డా.. తదితరులతో క్లోజ్ గా మూవ్ అయ్యారు. బీజేపీ అధిష్టానంతో అత్యంత దగ్గరగా ఉన్నందునే రఘురామకృష్ణంరాజుపై చర్యలు తీసుకునేందుకు వైసీపీ వెనుకాడుతోందనే టాక్ వినిపించింది. లేకుంటే ఎప్పుడో రఘురామకృష్ణంరాజుపై వైసీపీ చర్యలు తీసుకుని ఉండేది.

వైసీపీ అధినేత, సీఎం జగన్ కూడా ఏదైనా ఇష్యూ వచ్చినప్పుడు మోదీ కంటే అమిత్ షానే ఎక్కువగా సంప్రదిస్తుంటారు. పలు మార్లు ఢిల్లీ వెళ్లి అమిత్ షాను కలిశారు. కేవలం అమిత్ షాతో సమావేశమయ్యేందుకే ఢిల్లీ వెళ్లిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఇప్పుడు రఘురమకృష్ణంరాజు ఫ్యామిలీ కూడా అమిత్ షానే ఆశ్రయించింది. మరి అటు జగన్, ఇటు రఘురామ ఫ్యామిలీ రెండూ అమిత్ షాకు దగ్గరే. మరి ఇప్పుడు అమిత్ షా ఏం చేస్తారనేది ఆసక్తి కలిగిస్తోంది. ఈ ఇష్యూలో అమిత్ షా జోక్యం చేసుకుంటారా.. ఈ ప్రాబ్లమ్ సాల్వ్ అవుతుందా.. లాంటి అనేక ప్రశ్నలు ఇప్పుడు తలెత్తుతున్నాయి.

 

Tags :