గృహవిక్రయాల్లో సానుకూల పరిణామాలు... పెరిగిన గిరాకీ

హైదరాబాద్‌లో ఇప్పుడు గృహ విక్రయాలకు గత సంవత్సరం కనిపించిన డిమాండ్ ఇప్పుడు కూడా కనిపిస్తోంది. దానికితోడు కోవిడ్ టైమ్‌లో అందరికీ సొంతింటి గృహాలపై ఆసక్తి కనిపించింది. దాంతో గృహాల కొనుగోళ్ళు రికార్డు స్థాయిలో జరిగిందని నివేదికలు తెలుపుతున్నాయి. దానికితోడు అందుబాటు వడ్డీ రేట్లు, ప్రభుత్వ రాయితీలు, డెవలపర్ల ఆఫర్లు వంటివి ఈ రంగంలో డిమాండ్‌ను మరింత పెంచాయి. దీంతో గృహ కొనుగోలుదారులలో సానుకూల ధృక్పథం నెలకొందని నో బ్రోకర్.కామ్ వార్షిక నివేదిక వెల్లడించింది. లగ్జరీ గృహాలకు డిమాండ్, అద్దెలు పెరగడం, ప్రవాసుల ఆసక్తి, స్థలాలకు గిరాకీ పెరగడం ఇవే ఈ ఏడాది స్థిరాస్తి రంగానికి చోదకశక్తిలా మారతాయని అంచనా వేసింది. ప్రస్తుతం ఆ నివేదిక ప్రకారం ఈ ఏడాది సొంతిల్లు కొనుగోలు చేయాలని 82% మంది ఆసక్తిగా ఉన్నారు. 31% మంది అద్దెలు పెరిగిపోతుండటంతో సొంతిల్లు కొనాలని భావిస్తుండగా 34% సెక్యూరిటీ, 21% అందుబాటు ధరలు, 6% డబ్బు ఆదా, 8% పెళ్లి కోసం ఇల్లు కొనాలనుకుంటున్నారు.
గృహ ప్రవేశానికి సిద్ధంగా ఉన్న వాటిల్లో కొనేందుకు 75% మంది ఆసక్తి చూపిస్తుండగా నిర్మాణంలో ఉన్న వాటిల్లో 8%, ప్లాట్ కొనేందుకు 17% మంది సిద్ధంగా ఉన్నారు. 50% మంది వ్యక్తిగత గృహాలు కొనాలని భావిస్తుండగా 38% మంది గేటెడ్ కమ్యూనిటీలో, 12 శాతం మంది ప్లాట్ కొనేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. ఇంటి కొనుగోలు సమయంలో నిర్మాణ నాణ్యత విషయంలో రాజీ పడట్లేదు. 64 శాతం మంది క్వాలిటీ గురించి వాకబు చేస్తుండగా.. 39 శాతం అనుమతులు, 25 శాతం డెవలపర్ పాత చరిత్ర, 25 శాతం బిల్డర్ నమ్మకం మీద ఆధారపడి కొనుగోలు నిర్ణయం తీసుకుంటున్నారు. 78 శాతం మంది వాస్తు ఉన్న ఇళ్లకు మొగ్గుచూపించగా.. 22 శాతం మంది అవేవీ పట్టించుకోవట్లేదు. కాగా సొంతింటి కొనుగోలులో పెద్దలదే పైచేయి. 37 శాతం మంది 50 ఏళ్ల పైబడిన కొనుగోలుదారులే ఉండగా.. 36 శాతం 25-40 ఏళ్ల వయస్సులు, 25 శాతం 40-50 ఏళ్లు, 2 శాతం 18-15 ఏళ్ల వాళ్లున్నారు. 65 శాతం మంది పురుషులే కాగా.. 35 శాతం మహిళా యజమానులున్నారు. ఉద్యోగాల వారీగా చూస్తే.. 53 శాతం ప్రైవేట్ ఉద్యోగస్తులే గృహ కొనుగోలుదారులు కాగా.. 28 శాతం మంది వ్యాపారులు, 19 శాతం ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నారు. నగరంలో 59 శాతం మంది తొలిసారి గృహ కొనుగోలుదారులే. 84 శాతం మంది సొంతంగా ఉండేందుకు ఇళ్లను కొనుగోలు చేస్తుంటే 16 శాతం పెట్టుబడిరీత్యా కొంటున్నారు.
సొంతింటిపైనే యువత మోజు
భారతీయ యువత సొంతింటికే ప్రాధాన్యం ఇస్తున్నారని చెబుతున్నారు. ఉద్యోగంలో చేరిన ఒకటి రెండేండ్లలోనే సొంతింటికి షిఫ్ట్ కావాలని ఎక్కువమంది యువత కోరుకుంటోందంట. 18-41 ఏండ్ల మధ్య వయస్కుల్లో 45 శాతం మంది యువత మదిలో సిటీలో సొంతింటికి షిఫ్ట్ కావాలనే కోరిక ఉందని సీబీఆర్‌ఈ సర్వేలో తేలింది. సిటీలో న్యూ హోం వారికి ఫస్ట్ ఛాయిస్‌గా ఉందని ఈ సర్వే సారాంశం. 26-41 ఏండ్ల మధ్య వయస్సు గల వారు అద్దె ఇంట్లో ఉండటానికి బదులు సొంతంగా ఇల్లు కొనుక్కోవడానికి 70 శాతం మంది ప్రాధాన్యం ఇస్తున్నారు. రియల్ ఎస్టేట్ కన్సల్టింగ్ సంస్థ సీబీఆర్‌ఈ సౌత్ ఏషియా.. భారత్‌తోపాటు ప్రపంచ దేశాల్లో 20 వేల మందికి పైగా యువత అభిప్రాయాలను సేకరించింది. నాణ్యమైన జీవనం సాగించడానికే ఇండియన్స్ అత్యధిక ప్రాధాన్యం ఇస్తున్నారు. మెరుగైన ఇంట్లో, మెరుగైన వాతావరణ పరిస్థితుల్లో జీవనం సాగించాలని 52 శాతం భావిస్తున్నారు. వచ్చే రెండేండ్లలో సొంతింటికి షిఫ్ట్ కావాలని 72 శాతం మంది యువత తలపోస్తున్నారు. కరోనా మహమ్మారి తర్వాత అమల్లోకి వచ్చిన వర్క్ ఫ్రం హోం.. వర్క్ ఫ్రం ఆఫీస్ పాలసీలలో వారానికి మూడు రోజులు ఆఫీసులకు వెళ్లడమే మంచిదని 69 శాతం మంది అభిప్రాయ పడుతున్నారు. అత్యధిక యువత కొత్త ఇల్లు కొనుక్కోవడమే తమ ఆకాంక్ష అని చెబుతున్నారు. తాము కొనుగోలు చేసే ఇంటి చుట్టూ సానుకూల వాతావరణం ఉండాలని భావిస్తున్నారు.