ASBL Koncept Ambience
facebook whatsapp X

ఎన్నికల శంఖారావం పూరించబోతున్న మోదీ!

ఎన్నికల శంఖారావం పూరించబోతున్న మోదీ!

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు షెడ్యూల్ ప్రకారమే జరుగుతాయనే క్లారిటీ వచ్చేసింది. డిసెంబర్ లో జరిగే ఈ ఎన్నికల కోసం పార్టీలన్నీ సమాయత్తమవుతున్నాయి. వచ్చే నెల మొదటి లేదా రెండో వారంలో షెడ్యూల్ విడుదలవుతుందని అన్ని పార్టీలూ భావిస్తున్నాయి. అధికార బీఆర్ఎస్ ఇప్పటికే అభ్యర్థులను కూడా ఖరారు చేసేసి ప్రజాక్షేత్రంలోకి పంపించేసింది. కాంగ్రెస్ కూడా నేడోరేపో అభ్యర్థులను ప్రకటించేందుకు సిద్ధమవుతోంది. రేసులో వెనుకబడ్డామని భావిస్తున్న బీజేపీ.. ఇకపై స్పీడ్ పెంచాలని నిర్ణయించింది. అందులో బాగంగా ఏకంగా ప్రధాని మోది చేత ఎన్నికల శంఖారావాన్ని పూరించేలా కార్యాచరణ రెడీ చేసింది.

ప్రధాని నరేంద్ర మోదీ అక్టోబర్ 1న తెలంగాణలో పర్యటించబోతున్నారు. వాస్తవానికి ఆయన పర్యటన రెండో తేదీ ఉంటుందని ముందుగా చెప్పుకొచ్చారు. అయితే మోదీ షెడ్యూల్ ఒక రోజు ముందుకు జరిగింది. ఒకటో తేదీనే ఆయన తెలంగాణ వస్తున్నారు. మహబూబ్ నగర్ లోని భూత్పూర్ ఐటీఐ కాలేజీ ప్రాంగణంలో జరిగే బహిరంగసభలో మోదీ పాల్గొంటారు. ఆ రోజు బీజేపీ ఎన్నికల శంఖారావాన్ని మోదీ పూరిస్తారని రాష్ట్ర బీజేపీ నేతలు చెప్తున్నారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలకు సరైన సమాధానం ఇచ్చేలా మోదీ సభ ఉంటుందని నేతలు భావిస్తున్నారు. రేసులో వెనుకబడ్డామని వస్తున్నవిమర్శలకు మోదీ సభ ఆన్సర్ చెప్తుందని బీజేపీ నేతలు నమ్మకంగా ఉన్నారు.

దేశవ్యాప్తంగా మోదీ చరిష్మా రోజురోజుకూ పెరుగుతూనే ఉంది. ఇప్పటికీ ఆయన ప్రపంచంలో అత్యంత ఆదరణ కలిగిన నేతగా పేరొందారు. అయితే తెలంగాణలో మాత్రం ఆ పార్టీ ప్రభావం రోజురోజుకూ దిగజారిపోతుంది. ఇప్పటికీ అభ్యర్థుల ఎంపిక పూర్తి కాలేదు. ఎప్పటికి అవుతుందో కూడా పార్టీలో క్లారిటీ లేదు. ఇంకా స్క్రూటినీ కూడా మొదలు కాలేదు. అయితే మోదీ టూర్ తర్వాత పార్టీ స్పీడ్ పెరుగుతుందని అందరూ భావిస్తున్నారు. ముఖ్యంగా మోదీ సభను దిగ్విజయం చేయడం ద్వారా తెలంగాణలో ఊపు తీసుకురావాలని పార్టీ భావిస్తోంది. కొత్త పార్లమెంటు భవనం ప్రారంభోత్సవం, ఉమెన్ రిజర్వేషన్ బిల్లుకు ఆమోదం పొందడం.. పార్టీలో కొత్త ఉత్సాహం తీసుకొచ్చింది.

ఒకటో తేదీ మహబూబ్ నగర్ బహిరంగ సభ అనంతరం మోదీ నిజామాబాద్ కూడా వెళ్తారని తెలుస్తోంది. అయితే దీనిపై ఇంకా అధికారిక ప్రకటన లేదు. మోదీ పర్యటనను దిగ్విజయం చేసేందుకు రాష్ట్ర పార్టీ 26న సన్నాహక సమావేశం నిర్వహించబోతోంది. పార్టీలో నేతల మధ్య విభేదాలు తారస్థాయికి చేరిన ప్రస్తుత పరిస్థితుల్లో ఈ సమావేశంపై ఆసక్తి నెలకొంది. పార్టీ తీరుపై గుర్రుగా ఉన్న కొంతమంది సీనియర్ నేతలు పార్టీ మారతారనే ప్రచారం జరుగుతోంది. వీళ్లు ఈ సమావేశానికి హాజరవుతారా.. లేకుంటే డుమ్మా కొడతారా అనే సందేహాలు కూడా ఉన్నాయి. బీఆర్ఎస్, బీజేపీ ఒక్కటే అనే ప్రచారానికి కూడా మోదీ సమాధానం చెప్పాల్సిన పరిస్థితి ఏర్పడింది.  

 

 

praneet praneet praneet ASBL Landmark Radhey Skye Radha Spaces
Tags :