ASBL NSL Infratech Sattva Lakeridge Radha Spaces

కలిసి సాగాల్సిన సమయమిది...

కలిసి సాగాల్సిన సమయమిది...

దేశం మొత్తం సంబురాలు చేసుకోవాల్సిన సమయం. ప్రజాస్వామ్యానికి గుండెకాయలాంటి నూతన పార్లమెంటు భవనం ప్రారంభోత్సవం సందర్భంగా.. పార్టీలన్నీ కలిసికట్టుగా ముందుకు సాగాలి. అందునా అధికార ఎన్డీయే ప్రభుత్వం.. ఈమహత్తర కార్యక్రమంలో తొలి అడుగు వేయాల్సి ఉంది. కానీ .. భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు కనీస ఆహ్వానం పంపకుండా.. తామే దాన్ని ప్రారంభిస్తామని మోదీ మొండిపట్టుదలకు పోవడంతో.. ఉత్సవ వాతావరణం నీరుకారిపోయింది. అంతేకాదు.. ఈఉత్సవాన్ని వీక్షించనున్న ప్రపంచదేశాల్లోనూ భారత ప్రజాస్వామ్యంపై చులకన భావన ఏర్పడే ప్రమాదముంది.

పెద్దన్న బాధ్యత తీసుకోవాల్సిన కేంద్రం.. విపక్షాలను పట్టించుకోకుండా ముందుకెళ్తున్న పరిస్థితి కనిపిస్తోంది. మేం చేసేది చేసుకుపోతాం.. మీరు మాత్రం నిబంధనలు పాటించండి అంటూ చెబుతున్న తీరు కళ్లకట్టినట్లు గోచరిస్తోంది. మరీ ముఖ్యంగా మోదీ సర్కార్ .. ప్రచార ఆర్భాటం వల్లే సమస్య ఏర్పడినట్లు తెలుస్తోంది. రాష్ట్రపతిని పిలిచి, ఆమెతో ఈ భవనాన్ని ప్రారంభిస్తే.. మోదీ సర్కార్ కు మంచి మైలేజీ దక్కేది. ఆదివాసీలకు ప్రముఖ ప్రాధాన్యత ఇచ్చినట్లు సంకేతాలు వెళ్లేవి.

మరీ ముఖ్యంగా ఆస్ట్రేలియాలోని ఈవెంట్ తో  దీన్ని మోదీ పోల్చడం సరికాదన్నది నిర్వివాదం. అక్కడి ప్రభుత్వం, విపక్షాలు.. ప్రవాసభారతీయులతో మోదీ ముఖాముఖీ కార్యక్రమానికి హాజరయ్యాయి. అంటే.. అక్కడి ప్రభుత్వం.. విపక్షాలను కలుపుకుని ముందుకు వెళ్తుందనడానికి ఇదే గొప్ప సంకేతం. కానీ మోదీ సర్కార్ ఆ విషయంలో మాత్రం అక్కడి ప్రభుత్వాన్ని ఆదర్శంగా తీసుకోదు. కానీ .. విపక్షాలు మాత్రం అక్కడి పార్టీల్లా  ప్రవర్తించాలని కోరుతోంది.

ఇక విపక్షాలు సైతం..పార్లమెంటు ప్రారంభోత్సవం విషయం.. ఏదో ప్రభుత్వానికి చెందినదిగా భావిస్తున్నట్లు కనిపిస్తోంది. పార్లమెంటు కట్టించింది ఎవరైనా, కట్టింది ఏసర్కార్ హయాంలోనైనా.. ఆడబ్బులు ప్రజలవి. దేశప్రజలు వివిధ రూపాల్లో ఖజానాకు జమచేసిన డబ్బులతో కట్టినవి. అంతే కాకుండా..  ప్రజాస్వామ్య దేశంలో వివిధ పదవులను అధిష్టించిన నేతలు.. ఆప్రజాస్వామ్యానికి పట్టుగొమ్మలాంటి పార్లమెంటు భవనం ప్రారంభోత్సవాన్ని బాయ్ కాట్ చేస్తామనడం.. పూర్తి అవివేకం, అసంబద్ధ నిర్ణయమని చెప్పొచ్చు. రేపు పొద్దున్న ఏదైనా సమస్య లేవనెత్తిన సమయంలో.. పార్లమెంటు ప్రారంభోత్సవానికి రాని పార్టీలకు.. ప్రజాస్వామ్యంపై నమ్మకం ఉందా అని బీజేపీ నేతలు ప్రశ్నించే ప్రమాదం కూడా ఉంది.

అధికార బీజేపీ, విపక్షాలు పట్టువిడుపులతో ప్రవర్తించాల్సిన సమయమిది. కాదు.. కూడదు.. మేం రాజకీయం చేస్తామంటే.. ప్రజల్లో అన్ని పార్టీలు చులకనవుతాయి. అంతే కాదు.. అంతర్జాతీయంగానూ .. మన దేశంపై ఓ రకమైన చులకన భావన కలిగించినవి అవుతాయని రాజనీతిజ్ఞులు చెబుతున్నారు.

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :