న్యూయార్క్ లో ప్రధాని మోడీ మెగా ఈవెంట్..
భారతీయుల నుంచి విశేష స్పందన భారత ప్రధాని మోడీ మానియా.. అమెరికాను ఊపేస్తోంది. సెప్టంబర్ 22న జరిగే మోడీ & యూఎస్ ప్రోగ్రెస్ టు గెదర్‌కు.. అమెరికాలోని భారతీయుల నుంచి విశేష స్పందన లభిస్తోంది.దీనికి నసావు వెటరన్స్ మెమోరియల్ కొలీజియం వేదికగా మారింది. ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు... ఇప్పటికే 24 వేల మందికి పైగా ప్రవాస భారతీయులు తమ పేర్లు రిజిస్ట్రర్ చేసుకున్నట్లుగా ఇండో-అమెరికన్ కమ్యూనిటీ ఆఫ్ USA (IACU) తెలిపింది.
యూనియన్‌డేల్, లాంగ్ ఐలాండ్‌లో జరిగే ఈవెంట్ కోసం రిజిస్ట్రేషన్‌లు 590 కమ్యూనిటీ సంస్థల ద్వారా వచ్చాయని, వీరంతా యునైటెడ్ స్టేట్స్ అంతటా 'వెల్‌కమ్ పార్ట్‌నర్స్'గా సైన్ అప్ చేశారని IACU ఒక ప్రకటనలో తెలిపింది. ఈ వేదిక సామర్థ్యం 15 వేలు మాత్రమే ఉంది.. భారీ సంఖ్యలో రిజిస్ట్రేషన్ చేసుకోవడంతో మరిన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లుగా ప్రతినిధులు వెల్లడించారు. ఈ కార్యక్రమానికి 42 రాష్ట్రాల నుంచి భారతీయ అమెరికన్లు పెద్ద ఎత్తున హాజరవుతారని అంచనా వేస్తున్నారు.అనుకున్న దానికంటే ఎక్కువ మంది ఈ కార్యక్రమానికి రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. వారందరికీ సీటింగ్ ఏర్పాట్లు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది.
మరీ ముఖ్యంగా...ఈ ఈవెంట్ భారత-అమెరికన్ కమ్యూనిటీకి ఎంతో ముఖ్యమైంది. దీనిని సక్సె్స్ ఫుల్ గా నిర్వహించడానికి కావాల్సిన ఏర్పాట్లు చేస్తున్నామని నిర్వాహకులు తెలియజేశారు. ఇందులో నరేంద్ర మోడీ ప్రసంగంతో పాటు వివిధ భారతీయ-అమెరికన్ల సాంస్కృతిక ప్రదర్శనలు ఉంటాయని చెప్పారు. మరోవైపు ఐక్యరాజ్యసమితి జారీ చేసిన తాత్కాలిక స్పీకర్ల జాబితా ప్రకారం సెప్టెంబర్ 26వ తేదీన ఇక్కడ జరిగే అత్యున్నత స్థాయి యూఎన్ జనరల్ అసెంబ్లీ సమావేశంలో భారత ప్రధాని ప్రసంగించనున్నారు.
అయితే, 2014లో తొలిసారి ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం న్యూయార్క్‌లో జరిగిన భారీ కమ్యూనిటీ సమావేశానికి ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ హాజరయ్యారు. ప్రఖ్యాత మాడిసన్ స్క్వేర్ గార్డెన్‌లో ఈ ఈవెంట్ నిర్వహించారు. ఆ తర్వాత 2019లో టెక్సాస్‌లోని హ్యూస్టన్‌లోని ఎన్ఆర్జీ స్టేడియంలో జరిగిన మెగా కమ్యూనిటీ కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు.. అప్పటి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సైతం ఈ ప్రోగ్రామంలో పాల్గొన్నారు. లాభాపేక్ష లేని సంస్థ, ఇండో-అమెరికన్ కమ్యూనిటీ ఆఫ్ USA (IACU) సాంస్కృతిక కార్యక్రమాలు మరియు పబ్లిక్ ప్రోగ్రామ్‌ల ద్వారా ఇండో-అమెరికన్ కమ్యూనిటీలో అవగాహన మరియు ఐక్యతను పెంపొందిస్తోంది.