ఉద్యోగులకు ఫిలిప్స్ షాక్.. ఈసారి 6000 మందిని

ప్రముఖ అంతర్జాతీయ సంస్థ ఫిలిప్స్ మరోసారి కోతలను ప్రకటించింది. ప్రపంచవ్యాప్తంగా తమ కంపెనీలో పనిచేస్తున్న ఉద్యోగుల్లో మరో 6 వేల మందిని తొలగిస్తున్నట్లు ప్రకటించింది. కంపెనీ ఉత్పత్తుల్లో ఒకటైన స్లీప్ రెస్పిరేటర్స్‌లో లోపాల కారణంగా భారీ నష్టాలు తలెత్తడంతో ఈ నిర్ణయం తీసుకుంది. కాగా కంపెనీ నుంచి వేల సంఖ్యలో ఉద్యోగుల కోతల ప్రకటన వెలువడటం మూడు నెలల్లో ఇది రెండోసారి కావడం గమనార్హం. కంపెనీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ రాయ్ జాక్‌బ్సో ప్రకటన చేశారు. కఠినమైన నిర్ణయమే అయినప్పటికీ ఉద్యోగుల సంఖ్యను మరింత తగ్గించుకో తప్పని పరిస్థితి నెలకొందని వెల్లడించారు. మా పనితీరును మెరుగుపర్చుకోవడం, ఉత్పాదకతను పెంచుకోడానికి మా పని విధానాన్ని సులభతరం చేసుకోవడం ఇప్పుడు అత్యవసరం. అందుకే కష్టమైనా సరే. 2025 నాటికి దాదాపు 6 వేల మంది ఉద్యోగులను తొలగించక తప్పట్లేదు అని జాకోబ్స్ ప్రకటించారు.
తాజా లేఆఫ్‌ల్లో భాగంగా 2023లోనే 3 వేల మందిని విధుల నుంచి తప్పించనున్నట్లు తెలుస్తోంది. కాగా గతేడాది అక్టోబరులో కంపెనీ 4 వేల మంది ఉద్యోగులను తొలగిస్తున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. సెప్టెంబరుతో ముగిసిన త్రైమాసిక ఫలితాలను ప్రకటిస్తూ సీఈఓ జాకోబ్స్ ఆ నిర్ణయాన్ని ప్రకటించారు. అంటే రానున్న రెండేళ్లలో కంపెనీ మొత్తంగా 10 వేల మంది ఉద్యోగులను తొలగించనుంది.






