పవన్ కళ్యాణ్, సాయిధరమ్ తేజ్ హీరోలుగా గప్ చుప్ గా మొదలెట్టేసిన తమిళ రీమేక్! దర్శకుడు సముద్ర ఖని

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఓ వైపు రాజకీయాలతో బిజీగా ఉంటూనే మరో వైపు వరుసగా సినిమాలను పూర్తి చేసే పనిలో ఉన్నారు. ఇప్పటికే ఆయన హరి హర వీర మల్లు సినిమాతో బిజీగా ఉన్నారు. కాగా.. మరో తమిళ రీమేక్‌ను సైలెంట్‌గా పూర్తి చేయటానికి రెడీ అయిపోయారు. దానికి సంబంధించిన పూజా కార్యక్రమాలు కూడా జరిగాయని సినీ సర్కిల్స్‌లో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. వివరాల్లోకి వెళితే..గత కొన్ని రోజులుగా పవన్ కళ్యాణ్, సాయిధరమ్ తేజ్ హీరోలుగా తమిళ చిత్రం వినోదయ సిత్తం తెలుగులో రీమేక్ అవుతుందని చాలా రోజులుగా వార్తలు వినిపిస్తూ వచ్చాయి. రీసెంట్ ఇంటర్వ్యూలో సముద్ర ఖని ఈ విషయాన్ని ఇన్ డైరెక్ట్‌గా కన్‌ఫర్మ్ చేశారు కూడా. అయితే పవన్ కళ్యాణ్ చాలా సైలెంట్‌గా మూవీ స్టార్ట్ చేశారు. దీనికి సముద్ర ఖని దర్శకత్వం వహిస్తున్నారు. సినిమా కోసం పవన్ ఎక్కువ రోజులను కేటాయించలేదు. ముప్పై రోజులను మాత్రమే ఇచ్చారని టాక్ బలంగా వినిపిస్తోంది. అందుకనే తన పాత్రకు సంబంధించిన సన్నివేశాలను వీలైనంత త్వరగా పూర్తి చేసేలా ప్రణాళికలు సిద్ధమయ్యాయట.
హరి హర వీర మల్లు సినిమా సెట్స్‌పై ఉంది. దీంతో పాటు తమిళ రీమేక్ పూర్తి చేయాలి. మరో వైపు హరీష్ శంకర్ కూడా భవదీయుడు భగత్ సింగ్ సినిమాతో రెడీగా కూర్చుని ఉన్నాడు. ఇది పూర్తి చేసే లోపు ఎన్నికలు వచ్చేస్తాయి. దాని తర్వాతే ఇతర సినిమాలకు పవన్ రెడీ అయ్యే అవకాశం ఉందని సమాచారం. వినోదయ సిత్తం సినిమా విషయానికి వస్తే.. ఇది ఏదో సాధించాలని బంధాలు, మనుషులకు విలువ ఇవ్వకుండా పరుగులు పెట్టే మనుషులకు వాటి గొప్పతనాన్ని చెప్పటానికి కాలమే మనిషి రూపంలో వస్తే ఎలా ఉంటుందనేదే కథాంశం. తమిళంలో సముద్ర ఖని, తంబి రామయ్య ప్రధాన పాత్రల్లో నటించారు. తెలుగులో పవన్ కళ్యాణ్, సాయిధరమ్ తేజ్ నటిస్తున్నారు. సముద్ర ఖని సినిమాను డైరెక్ట్ చేస్తున్నారు.






