మోదీకి పార్లమెంట్.. కేసీఆర్‌కు సెక్రటేరియేట్.. మరి జగన్‌కు....???

మోదీకి పార్లమెంట్.. కేసీఆర్‌కు సెక్రటేరియేట్.. మరి జగన్‌కు....???

రాజకీయ నేతలెవరైనా తాము అధికారంలోకి వస్తే తమకంటూ ఓ మార్క్ ఉండాలని ట్రై చేస్తుంటారు. నాడు ఎన్టీఆర్ తీసుకొచ్చిన ఎన్నో సంస్కరణల గురించి ఇప్పటికీ చెప్పుకుంటూ ఉంటారు. రెండు రూపాయలకే కిలో బియ్యం, మహిళలకు ఆస్తిలో వాటా, పటేల్ – పట్వారీ వ్యవస్థ రద్దు.. లాంటివెన్నో ఎన్టీఆర్ హయాంలో రూపుదిద్దుకున్నాయి. ఇక వైఎస్ రాజశేఖర రెడ్డి తీసుకొచ్చిన ఎన్నో సంక్షేమ పథకాలు ఇప్పటికీ ప్రజల ఆదరణ చూరగొంటున్నాయి. ఆరోగ్యశ్రీ, రైతులకు రుణమాఫీ, ఫీజు రీఎంబర్స్ మెంట్.. లాంటివి వైఎస్ పేరును సజీవంగా ఉంచుతున్నాయి. అలాగే మోదీ, కేసీఆర్ లాంటి నేతలు కూడా తమ హయాంలో ఇవి జరిగాయని చెప్పుకునేందుకు ఎన్నో కళ్ళ ముందు సాక్షాత్కరిస్తున్నాయి. కానీ ఈ విషయంలో జగన్ మాత్రం విమర్శలు ఎదుర్కొంటున్నారు.

మోదీ పాలనకు 9 ఏళ్లు పూర్తయ్యాయి. ఈ తొమ్మిదేళ్లలో మోదీ తనకంటూ ఒక ప్రత్యేకతను సాధించుకున్నారు. పెద్దగా ఉచితాల జోలికి పోకుండా ప్రాక్టికల్ గా పాలన సాగించేందుకే మోదీ ఎక్కువగా మొగ్గు చూపుతున్నారు. అయితే భారత్ ను హిందూరాజ్యంగా మార్చేందుకు మోదీ ప్రయత్నిస్తున్నారని విపక్షాలు ఆరోపిస్తున్నా బీజేపీ పెద్దగా పట్టించుకోవట్లేదు. తన పని తాను చేసుకుంటూ పోతున్నారు మోదీ. అందులో భాగంగా దాదాపు వందేళ్లు పూర్తి కావస్తున్న పాత పార్లమెంటు భవనం స్థానంలో కొత్త పార్లమెంట్ భవనాన్ని నిర్మించారు మోదీ. అత్యాధునిక హంగులతో భవిష్యత్ అవసరాలు తీర్చే విధంగా దీన్ని తీర్చిదిద్దారు. ఇది పది కాలాలపాటు మోదీ పేరును క్యారీ చేస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు.

ఇక తెలంగాణ ఏర్పడిన తర్వాత కేసీఆర్ అధికార పగ్గాలు చేపట్టారు. అప్పటి నుంచి తెలంగాణలో తనదైన సంస్కరణలు అమలు చేస్తున్నారాయన. ఏ ఏ రంగాల్లో తెలంగాణ వెనుకబడిందో గ్రహించి ఆయా రంగాల్లో పెద్దఎత్తున పెట్టుబడులు పెట్టారు. దీంతో రాష్ట్రం రూపురేఖలు మారాయి. ముఖ్యంగా గతంలో ఉన్న సెక్రటేరియేట్ స్థానంలో అత్యాధునిక భవనాన్ని నిర్మించాలనుకున్నారు. అనుకున్నట్టుగానే ట్యాంక్ బండ్ కు అభిముఖంగా అద్భుతమైన కట్టడాన్ని నిర్మించారు. హైదరాబాద్ లో ఇది ఇప్పుడు పెద్ద టూరిస్ట్ స్పాట్ గా మారిపోయింది. కేసీఆర్ భలే కట్టాడుగా.. అని అందరూ చెప్పుకుంటున్నారు. పాత జ్ఞాపకాలను చెరిపేసి కొత్త సెక్రటేరియేట్ తెలంగాణ అభివృద్ధికి నిలువెత్తు సాక్ష్యంగా నిలుస్తోంది.

ఇక రాష్ట్ర విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్ లోటు బడ్జెట్ తో కునారిల్లుతోంది. నిధుల లేమి రాష్ట్రాన్ని పట్టి పీడిస్తోంది. విడిపోయిన తర్వాత ఐదేళ్లు చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఆయన అమరావతి రాజధానిని ఎంపిక చేసి తాత్కాలిక సచివాలయం, అసెంబ్లీ, హైకోర్టు నిర్మించారు. వీటిస్థానంలో కృష్ణానధికి అభిముఖంగా ఐకానిక్ బిల్డింగులు కట్టేందుకు ప్రణాళికలు రూపొందించారు. అయితే ఆ తర్వాత ఎన్నికల్లో చంద్రబాబు ఓడిపోయారు. జగన్ అధికారంలోకి వచ్చారు. ఆయన ఏకంగా అమరావతితో పాటు మరో రెండు రాజధానులను ఏర్పాటు చేసేందుకు మొగ్గుచూపారు. దీంతో అసలు రాజధానిపైనే రగడ మొదలైంది. ఎక్కడా ఒక కట్టడం కూడా జరుపుకునే పరిస్థితి లేకుండా పోయింది. నాడు చంద్రబాబు కట్టిన తాత్కాలక భవనాల్లోనే కాలం గడపాల్సిన పరిస్థితి ఏర్పడింది. జగన్ తనకంటూ పేరు తెచ్చే ఒక్క ఐకానిక్ భవనాన్ని కూడా నిర్మించలేకపోయారు. మోదీకి పార్లమెంటులాగా, కేసీఆర్ కు సెక్రటేరియేట్ లాగా.. జగన్ కూడా తనకు ఇలాంటిది ఒకటుంది అని చెప్పుకునే ఛాన్స్ ఉంటే బాగుండేదేమో..!

 

 

praneet obili-garuda AHA poulomi Png-jewelry aurobindo MUPPA
Tags :