'పక్కా కమర్షియల్' పక్కాగా హిట్ అవుతుందని నమ్ముతున్నాను - ప్రీ రిలీజ్ లో చిరంజీవి

'పక్కా కమర్షియల్' పక్కాగా హిట్ అవుతుందని నమ్ముతున్నాను - ప్రీ రిలీజ్ లో చిరంజీవి

వరస విజయాలతో జోరు మీదున్న విలక్షణ దర్శకుడు మారుతి తెరకెక్కిస్తున్న సినిమా పక్కా కమర్షియల్. మెగా ప్రొడ్యూస‌ర్ అల్లు అరవింద్ గారి స‌మ‌ర్ప‌ణ‌లో స‌క్సెస్ ఫుల్ బ్యాన‌ర్లుగా అంద‌రి మ‌న్న‌న‌లు అందుకున్న జీఏ2 పిక్చ‌ర్స్ - యూవీ క్రియేష‌న్స్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. బ‌న్నీ వాస్ నిర్మాత‌గా మ్యాచో హీరో గోపీచంద్‌తో చేస్తున్న పక్కా కమర్షియల్ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. ఇప్పటికే విడుదలైన ట్రైలర్, టీజర్, పాటలకు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. తాజాగా ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ శిల్ప కళావేదికలో జరిగింది. ఈ వేడుకకు మెగాస్టార్ చిరంజీవి గారు ముఖ్య అతిథిగా ఈ వేడుకలో పాల్గొన్నారు. 

నిర్మాత బన్నీవాస్, మెగాస్టార్ చిరంజీవి గారును ఉద్దేశిస్తూ మాట్లాడుతూ

"మా కుటుంబాలన్నిటికి మీరొక మహాగణపతి లాంటివారు. ఎందుకంటే మా కుటుంబాలు కానీ, ఈ గీతా ఆర్ట్స్ తో మిగతా సంస్థలు కానీ ఈస్థాయిలో ఉన్నాయంటే దీనికి కారణం మీరు" అని చెప్తూ... గీతా ఆర్ట్స్ టీం కి , పక్కా  కమర్షియల్ టీం కి కృతజ్ఞతలు తెలిపారు. 

దర్శకుడు మారుతి మాట్లాడుతూ.. బందరులో బొమ్మలేసుకునే ఒక చిరంజీవి గారి అభిమానినైన నాకు ఒక పది సినిమాలు చేసే అవకాశం రావడం, చిరంజీవి గారు ఈ ఫంక్షన్ కి ముఖ్య అతిధిగా రావడం నా అదృష్టం. నేను బందరులో ఉన్నప్పుడు చిరంజీవి గారితో మెట్లపై మాట్లాడుతూ దిగుతున్నట్లు ఒక కల వచ్చింది. ఆ కల ప్రజా రాజ్యం పార్టీ టైం లో నెరవేరింది. ఆ టైంలోనే నేను సినిమాలు ఏవి చెయ్యకు ముందు నేను ఫస్ట్ యాక్షన్ చెప్పిన హీరో చిరంజీవి గారు. ఇటువంటి అదృష్టం ఇంకెవరికి రాదు. నీలో ఒక డైరెక్టర్ ఉన్నారయ్యా అనే చిరంజీవి గారి మాటతో నేను దర్శకుడినయ్యాను అంటూ తన కృతజ్ఞత భావాన్ని తెలిపారు. 

పక్కా కమర్షియల్ సినిమా గురించి మాట్లాడుతూ అగ్ర నిర్మాత అల్లు అరవింద్ కు , నిర్మాత బన్నీ వాస్ తో తన టీం కు కృతజ్ఞతలు తెలిపారు. 

రాశిఖన్నా మాట్లాడుతూ.. ముందుగా చిరంజీవి గారికి శుభాకాంక్షలు తెలుపుతూ, ఇప్పటివరకు నేను చేసిన అన్ని కేరక్టర్ లో బెస్ట్ కేరక్టర్ ఇది, మునుపెన్నడూ చూడని విధంగా గోపీచంద్ ఈ సినిమాలో కనిపిస్తారు.దర్శకుడు మారుతి గురించి మాటల్లో చెప్పలేము కానీ నేను పనిచేసిన దర్శకులలో ఒన్ అఫ్ ది బెస్ట్ డైరెక్టర్ అని చెప్తూ , నిర్మాత బన్నీ వాస్ తో పాటు పలువురికి కృతజ్ఞతలు తెలిపారు.  

అగ్ర నిర్మాత అల్లు అరవింద్ మాట్లాడుతూ.. అడిగినవెంటనే మా ఆహ్వానాన్ని మన్నించి ఇక్కడకి హాజరైన చిరంజీవిగారికి నా ప్రత్యేక కృతజ్ఞతలు. హీరో గోపీచంద్ ను ఉద్దేశిస్తూ మాట్లాడుతూ.. ప్రతిఘటన సినిమా చూసిన తరువాత మీ నాన్నగారిని మా బ్యానర్ లో సినిమాను చేయమని అడిగాం, కానీ అది కుదర్లేదు, ఇప్పుడు మా బ్యానర్ లో మీరొక మంచి సినిమా చేసారు. మారుతికి ఆడియన్స్ ప్లస్ తెలుసు కథనుంచి బయటకు వచ్చి కూడా ఆడియన్స్ ను నవ్వించగలరు ఇదివరకు ఈవివి. సత్యనారాయణ గారి సినిమాల్లో అలా చూసేవాళ్ళం అని చెప్తూ తన టీం కు పక్కా కమర్షియల్ టీం కృతజ్ఞతలు తెలిపారు. 

మ్యాచో స్టార్ గోపీచంద్ మాట్లాడుతూ.. చిరంజీవి గారు నా సినిమా ఫంక్షన్ కి గెస్ట్ గా రావడం ఇదే మొదటిసారి. నాలాంటి ఎంతోమందికి ఇన్స్పరేషన్ మీరు, మీ సినిమాలు చూసి ఎంతో నేర్చుకున్నాం. ఏ సపోర్ట్ లేకున్నా ఈరోజు ఒక మహావృక్షంలా ఎదిగారు అని చెప్తూ, ఈ సినిమాను నేను చేయడానికి మొదటికారణం యూవీ క్రియేషన్స్ వంశీ, వంశీ వలన నాకు పరిచయమైన మంచి వ్యక్తి మారుతి. తనకున్నా టాలెంట్ కి ఇంకా పెద్ద దర్శకుడు అవుతాడు. ఈ సినిమాను చాలా బాగా చేసారు అంటూ పక్కా కమర్షియల్ సినిమా నటులకు, సాంకేతిక నిపుణులుకు కృతజ్ఞతలు తెలిపారు. 

మెగాస్టార్ చిరంజీవి మాట్లాడుతూ... గోపీచంద్ నాన్నగారితో నాకు మంచి పరిచయం ఉంది, కాలేజీ రోజుల్లోనే నాలాంటి యంగ్ స్టార్స్ కి మంచి భరోసా ఇచ్చేవారు. తరువాత నేను ఇండస్ట్రీ కి రావడం, ఆయన కూడా ఇండస్ట్రీ కి వచ్చి విప్లవాత్మక,సందేశాత్మక చిత్రాలను తెరకెక్కించి అనతికాలంలోనే అత్యద్భుతమైన పేరును సంపాదించారు. ఆ పేరు ఈరోజు గోపీచంద్ తో కొనసాగుతుంది.  గోపీచంద్ విలక్షణ నటుడిగా తన కెరియర్ మొదలుపెట్టి ఇప్పుడు పక్కా కమర్షియల్ సినిమాలు చేస్తున్నాడు. 

గోపీచంద్ సినిమాల్లో సాహసం నాకు చాలా ఇష్టమైన సినిమా అని చెబుతూ, గోపీచంద్ చేసిన పలు సినిమాల గురించి ప్రస్తావించారు. దర్శకుడు మారుతి గురించి మాట్లాడుతూ ప్రజారాజ్యంలో టైం లో ఒక పాటను షూట్ చెయ్యమని మారుతికి చెప్పాను , చాలా అద్భుతంగా ఆ పాటను చేసాడు. అప్పుడే మారుతిని అడిగాను డైరెక్షన్ చెయ్యాలనే గోల్ ఏమైనా ఉందా అని. అప్పుడు మారుతి అలా లేదండి అని చెప్తూ చిన్న చిన్న కథలు అనుకుంటున్నాను అని చెప్పారు. ఈరోజు మంచి కమర్షియల్ సినిమాలు చేస్తున్నారు. మారుతి సినిమాల్లో ప్రేమకథా చిత్రమ్, భలే భలే మగాడివే తనకిష్టం అని చెప్తూ పక్కా కమర్షియల్ సినిమా మంచి హిట్ అవ్వాలని కోరుకుంటున్నట్లు తెలుపుతూ మారుతి తో సినిమా చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు వెల్లడించారు. నిర్మాత బన్నీ వాస్ గురించి మాట్లాడుతూ నేను చూస్తుండగానే అతను అంచలంచెలుగా ఎదిగాడు, గీతా ఆర్ట్స్ కి బన్నీవాసు ఒక రామబంటు అని చెప్పుకొచ్చారు. రావు రమేష్ గురించి ప్రస్తావిస్తూ వాళ్ళ నాన్నగారు రావు గోపాలరావు తో ఉన్న జ్ఞాపకాలను పంచుకుని ఇమిటేట్ చేసారు. ప్రస్తుతం ఆయన లేని స్థానాన్ని రావు రమేష్ భర్తీ చేస్తున్నారని చెప్పుకొచ్చారు. అందరికి కృతజ్ఞతలు తెలుపుతూ "పక్కా కమర్షియల్" సినిమా హిట్ అవ్వాలని ఆశీర్వదించారు.  ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. జులై 1, 2022న పక్కా కమర్షియల్ ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. 

 

Tags :